వంతెన దుస్థితిపై ముందే రిపోర్టులు.. పట్టించుకోని గుజరాత్ ప్రభుత్వం

ఇక 9 రోజుల క్రితం కూడా ఓ మీడియా సంస్థ వంతెనపై భారీగా గుంతలు ఏర్పడ్డాయని, ప్రమాదకరంగా మారిందని రిపోర్టు చేసింది.;

Update: 2025-07-09 15:34 GMT

గుజరాత్ లోని వడోదరలో మహిసాగర్ నదిపై నిర్మించిన వంతెన కుప్పకూలిన ఘటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని జాతీయ మీడియా ధ్వజమెత్తుతోంది. బుధవారం ఉదయం మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో వంతెనపై పయనిస్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లతో సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి. దీంతో సుమారు పది మంది వరకు మరణించారని చెబుతున్నారు. సంఘటన తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రమాదాన్ని ముందే ఊహించిన స్థానిక మీడియా పలుమార్లు వంతెన దుస్థితిపై కథనాలు ప్రచారం చేసిన ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

గంభీర వంతెనపై పగుళ్లు వచ్చినట్లు మూడు నెలల క్రితమే ఓ చానల్ లో కథనం ప్రసారం చేశారు. ఇక 9 రోజుల క్రితం కూడా ఓ మీడియా సంస్థ వంతెనపై భారీగా గుంతలు ఏర్పడ్డాయని, ప్రమాదకరంగా మారిందని రిపోర్టు చేసింది. అయితే ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కనీసం పట్టించుకోకపోవడంతో బుధవారం ఉదయం ఘోరం జరిగిపోయిందని అంటున్నారు. వంతెనపై రాకపోకలను నిలిపివేసినా ఈ దుస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఘటనా స్థలిలో మృతులను వెలికి తీసేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పది మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా మృతులు ఉండొచ్చని అంటున్నారు. 1985లో నిర్మించిన వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మరింతగా దెబ్బతిన్నదని అధికారులు చెబుతున్నారు. అయితే స్థానిక మీడియా మాత్రం అధికారుల తీరునే తప్పుపడుతోంది. వంతెనపై పగుళ్లు రావడం, వర్షాలు కురుస్తుండటం వల్ల రాకపోకలు నియంత్రిస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు. ఇక వంతెన కూలడంతో వడోదర-ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. ఈ రెండు పట్టణాలను ఈ వంతెన కలుపుతోంది. మరోవైపు బ్రిడ్జి కూలిన సంఘటనపై పీఎం నరేంద్ర మోదీ, సీఎం భూపేంద్ర పటేల్ స్పందించారు.

Tags:    

Similar News