పవన్ సీటు లోకి మంత్రి గుడివాడ...!

ఎట్టకేలకు విశాఖ జిల్లా మంత్రి గుడివాడ అమర్నాధ్ కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ సీటుని కూడా వైసీపీ అధినాయకత్వం కన్ ఫర్మ్ చేసింది

Update: 2024-03-12 18:17 GMT

ఎట్టకేలకు విశాఖ జిల్లా మంత్రి గుడివాడ అమర్నాధ్ కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ సీటుని కూడా వైసీపీ అధినాయకత్వం కన్ ఫర్మ్ చేసింది. విశాఖలో కీలకమైన గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్నాధ్ పోటీ చేయబోతున్నారు. ఈ విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉన్నా మధ్యలో కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావుని తీసుకుని వచ్చి ఇంచార్జిగా నియమించారు.

అయితే ఆయన గుడివాడ శిష్యుడే. పైగా గుడివాడ స్కెచ్ లో భాగమే అని ఇపుడు తెలుస్తోంది అంటున్నారు. నిజానికి చాలా కాలం క్రితమే మంత్రి గుడివాడను సొంత నియోజకవర్గం చూసుకోమని వైసీపీ అధినాయకత్వం చెప్పిందని అంటున్నారు గుడివాడ సొంత ఊరు మింది గ్రామం. అది ఉండేది గాజువాక పరిధిలో. దాంతో ఆయన పోటీ చేయాల్సింది గాజువాక నియోజకవర్గం నుంచే.

ఇక చూస్తే 2019లోనే ఆయన అక్కడ నుంచి పోటీ చేయాలి. కానీ తిప్పల నాగిరెడ్డి అనే సీనియర్ నేత ఉండడం వల్ల వీలు పడలేదు. పైగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తూండడంతో సామాజిక సమీకరణలను చూసుకుని మరీ రెడ్డికి అక్కడ చాన్స్ ఇచ్చింది.

ఇక ఇపుడు చూస్తే గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారు అని ఊహించి యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని చందూని ఇంచార్జిగా చేసింది. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. అదే టైం లో జనసేన అక్కడ పోటీ చేస్తుందని ఊహించారు. కాపు అభ్యర్ధి ప్రత్యర్ధిగా ఉంటారు అని కూడా అంచనా వేశారు.

తీరా ఇపుడు చూస్తే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన టీడీపీ నేత. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో సేం కమ్యూనిటీ నుంచి పోటీ పెడితే ఓట్లు చీలుతాయి కాబట్టి కాపుకే ఇక్కడ చాన్స్ ఇవ్వాలని భావించి గుడివాడను బరిలోకి దింపుతున్నారు అని అంటున్నారు.

ఇక్కడ సామాజిక సమీకరణలు కూడా ముఖ్యంగా ఉంటున్నాయి. ఈ నియోజకవర్గంలో కాపులు యదవులు డామినేటింగ్ రోల్ లో ఉన్నారు. 2009లో గాజువాక ఏర్పాటు అయితే కాపు అభ్యర్ధి తొలి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో యాదవ సామాజికవర్గం నుంచి పల్లా గెలిచారు. 2019లో జగన్ వేవ్ లో రెడ్డి సామాజిక వర్గం గెలిచింది. ఈసారి కాపు ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఆ సామాజిక వర్గంలో ఉంది. దాంతో పాటు జనసేనకు సీటు కావాలని అడిగారు.

కానీ పొత్తులలో ఇది టీడీపీకి వెళ్తోంది అని అంటున్నారు. ఇలా రెండు పార్టీలలో కొంత అభిప్రాయ భేదాలు ఉన్న నేపధ్యంలో గుడివాడను వైసీపీ తరఫున దింపుతున్నారు. ఇక తిప్పల వర్గం కూడా ఉరుకూటిని తప్పించి ఎవరికి ఇచ్చినా పనిచేస్తామని హామీ ఇచ్చింది. గాజువాకలో పెద్ద ఎత్తున ఉన్న కాపులు వైసీపీకి ఈసారి సపోర్ట్ గా ఉంటారు అన్న నమ్మకంతో వైసీపీ గుడివాడను బరిలోకి దింపుతోంది.

ఈసారి కనుక ఆయన గెలిస్తే గుడివాడకు గాజువాక సొంత సీటు అయిపోతుంది. మొత్తానికి గాజువాక వంటి కీలకమైన సీటులో మంత్రిని అభ్యర్ధిగా నిలబెడుతూ వైసీపీ కరెక్ట్ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఆసక్తికరమైన పోరు సాగనుంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువే. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామన్న బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అది కూడా తమకు అనుకూలిస్తుందని వైసీపీ భావిస్తోంది. అలాగే జనసేనకు టికెట్ ఇవ్వకపోతే వారి ఓట్లలో కూడా చీలిక వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.

తనకు గాజువాక సీటు కన్ ఫర్మ్ అవుతుందని ముందే తెలుసుకున్న గుడివాడ పవన్ మంచివాడు అమాయకుడు అని రీసెంట్ గా కామెంట్స్ చేశారు. ఆయనను చంద్రబాబు వాడుకుంటున్నారు అని గుడివాడ చేసిన ఈ కామెంట్స్ గాజువాకలో ఉన్న జనసైనికులను తన వైపు తిప్పుకోవడానికే అంటున్నారు. మొత్తం మీద సొంత గడ్డ మీద గుడివాడ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News