గంటాను ఢీ కొంటానంటున్న గుడివాడ ?
ఆ నియోజకవర్గం మీద చాలా మందికి మక్కువ ఉంది. అయితే అది ఎక్కువగా సైకిలెక్కిన వైనమే కనిపిస్తుంది.
ఆ నియోజకవర్గం మీద చాలా మందికి మక్కువ ఉంది. అయితే అది ఎక్కువగా సైకిలెక్కిన వైనమే కనిపిస్తుంది. అయినా సరే ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడికి అయినా భీమునిపట్నం అంటే ఎంతో ఇష్టం. అలా హాట్ ఫేవరేట్ సీటుగా ఉంది. భీమిలీ అంటే టీడీపీకి కంచుకోట అని తెలిసినా వైసీపీ నేతలు మాత్రం దానిని వదలడం లేదు, తమ ప్రభంజనం వచ్చే ఎన్నికల్లో వస్తుందని అపుడు మొత్తం విశాఖ జిల్లానే స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందులో భీమిలీ కూడా తమదే అవుతుందని అంటున్నారు. ఇక భీమిలీ వైసీపీ ఇంచార్జిగా ఉన్న చిన్న శ్రీను ఆ పార్టీని వీడి వెళ్లిపోయారు. దాంతో భీమిలీకి కొత్త ఇంచార్జిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ సీటు మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మక్కువ చూపిస్తున్నారు అని అంటున్నారు.
విశాఖ జిల్లాకే కేంద్రం :
గుడివాడ గాజువాకకు చెందిన వారు, ఆయన 2014లో అనకాపల్లి నుంచి ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో అక్కడే అసెంబ్లీ సీటు తీసుకుని గెలిచారు. 2024 నాటికి ఆయన గాజువాక షిఫ్ట్ అయ్యారు. అది తన సొంత నియోజకవర్గంగా చేసుకుందామని చూసినా అక్కడ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుటుంబం ప్రాబల్యం ఎక్కువ. మొత్తానికి కూటమి వేవ్ లో అత్యధిక తేడాతో ఓటమి చెందారు. ఆయన్ని ఆ తరువాత వైసీపీ అధినాయకత్వం చోడవరానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆయన చోడవరం వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు. నిజానికి అప్పటికే ఆయనకు భీమిలీ మీద మోజు ఉందని చెబుతారు.
ఎక్కువగా విశాఖలోనే :
ఇక గుడివాడకు చోడవరం బాధ్యతలు అప్పగించినా ఆయన ఎక్కువగా విశాఖ జిల్లాలోనే ఉంటూ వస్తున్నారు. ఆయనకు విశాఖ నుంచి రాజకీయాలు చేయడమే ఇష్టమని చెబుతున్నారు. దానికి తోడు అన్నట్లుగా భీమిలీ నియోజకవర్గం ప్రస్తుతం ఇంచార్జి లేక ఖాళీగా ఉంది. దాంతో ఆయన ఈ సీటు కోరుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవాలని వ్యూహంగా ఉంది అని అంటున్నారు. దానికి కారణం గుడివాడ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పైగా స్థానికత పేరుతో తాను ఈ సీట్లో పాగా వేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.
బిగ్ షాట్స్ కన్ను :
మరో వైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా భీమిలీ నుంచి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ఈ సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇంకో వైపు జనసేన కూడా ఈ సీటు మీద ఫోకస్ పెట్టింది. 2019లో ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే పాతిక వేల ఓట్లు ఇక్కడ పడ్డాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో తమ కోసం పట్టుబట్టాలని నిర్ణయించుకుంది. ఇక టీడీపీ నుంచే బిగ్ షాట్స్ ఈ సీటు మీద దృష్టి పెట్టారని కచ్చితంగా హైకమాండ్ కి సన్నిహితులు అయిన వారే పోటీ చేస్తారని అంటున్నారు. ఇపుడు వైసీపీ నుంచి గుడివాడ లాంటి వారు ఇంచార్జిగా ఉంటామంటే వైసీపీ హైకమాండ్ ఓకే చెబుతుందని కూడా అంటున్నారు. అయితే వైసీపీ భీమిలీ నేతలు అయితే పక్కా లోకల్ కే ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని అంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వద్దే వద్దు అని వారు గట్టిగా చెబుతున్నారు. ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం చేసిన ప్రయోగాలు చాలు అని అంటున్నారు. అయితే టీడీపీ పై స్థాయిలో భీమిలీ మీద ఫోకస్ పెట్టిన క్రమంలో వైసీపీ కూడా అంగబలం అర్ధ బలం ఉన్న వారికే బాధ్యతలు అప్పగిస్తుంది అని అంటున్నారు.