అక్షరాల రూ.2.37 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. కొత్త రికార్డు
ఒక దేశం.. ఒక పన్ను నినాదంతో తెర మీదకు తీసుకొచ్చిన జీఎస్టీ (వస్తుసేవల పన్ను) వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.;
ఒక దేశం.. ఒక పన్ను నినాదంతో తెర మీదకు తీసుకొచ్చిన జీఎస్టీ (వస్తుసేవల పన్ను) వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ముగిసిన ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. గత ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే ఏకంగా 12.6 శాతం అధికంగా జీఎస్టీ వసూళ్లు ఉండటం విశేషం. ఈ ఏప్రిల్ లో దేశ వ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.2.37 లక్షల కోట్ల భారీ మొత్తం వసూలైంది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 జులై ఒకటి నుంచి ఇప్పటివరకు ఒక నెలలో గరిష్ఠంగా వచ్చిన జీఎస్టీ ఆదాయం ఇదే. గత ఏడాది (2024) ఏప్రిల్ లో జీఎస్టీ వసూళ్లు రూ.2.10 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో అదనంగా 27 వేల కోట్ల రూపాయిల పన్ను వసూళ్ల ఆదాయం వచ్చింది. అంతేకాదు.. ఈ ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు.. అంతకు ముందు మార్చితో పోల్చినా భారీగా ఉండటం గమనార్హం.
ఈ మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో దేశీయంగా జరిగిన లావాదేవీలపై జీఎస్టీ ఆదాయం 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లు కాగా.. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్టీ 20.8 శాతం పెరుగుదలతో రూ.46,913 కోట్లకు చేరింది. తాజా వసూళ్లపై డెలాయిట్ ఇండియా భాగస్వామి స్పందిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లను దాటటం బలమైన ఆర్థిక పనితీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థలోని బలాన్ని జీఎస్టీ వసూళ్లు చాటి చెబుతున్నట్లుగా చెబుతున్నారు.