ఎవరీ గోవింద్ భాయ్ డోలాకియా.. ఈ బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఇస్పెషల్

కీలక పదవులకు సంబంధించి రాజకీయ పార్టీల ఎంపికలు ఎలా ఉంటాయన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు

Update: 2024-02-15 04:17 GMT

కీలక పదవులకు సంబంధించి రాజకీయ పార్టీల ఎంపికలు ఎలా ఉంటాయన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ.. పార్టీకి.. ప్రభుత్వానికి మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటాయి. అందుకు భిన్నంగా తాజాగా బీజేపీ ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థి ఒకరి ఉదంతం ఆసక్తికరంగా మారింది. రోటీన్ రాజకీయ ఎంపికలకు భిన్నంగా ఈ రాజ్యసభ అభ్యర్థి కనిపిస్తారు. బీజేపీ అధినాయకత్వం ఒకరిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే.. ఆ వెంటనే ఎగిరి గంతేస్తారు. పార్టీకి థ్యాంక్స్ చెబుతారు.

కానీ.. గోవింద్ భాయ్ డోలాకియా మాత్రం.. ''వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నా ప్రయాణం వ్యాపారవేత్తగా సాగటం ఆనందం. కొన్ని గంటల ముందు నేను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైనట్లు తెలిసింది. నా పేరును ఫైనల్ చేసే ముందు బీజేపీ అధిష్ఠానం ఆలోచించి ఉండాల్సింది'' అంటూ అరుదైన వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ గోవింద్ భాయ్ డోలాకియా ఎవరు? పెద్దల సభకు ఎంపిక చేయటమే వరంగా భావించే ఈ రోజుల్లో అందుకు భిన్నంగా ఆయన మాటల మర్మం ఏమిటి? అసలు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

Read more!

గుజరాత్ లోని సూరత్ నగరం గురించి విన్నంతనే వజ్రాల ఆభరణాల వ్యాపారులు పెద్ద ఎత్తున గుర్తుకు వస్తారు. అలాంటి వ్యాపారుల్లో ఒకరు గోవింద్ భాయ్ డోలాకియా. సూరత్ లోని శ్రీరామక్రిష్ణా ఎక్స పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయన వ్యవస్థాపకుడు.. ఛైర్మన్. వజ్రాల తయారీ కంపెనీని ఆయన 1970లలో ప్రారంభించారు. ఆయన కంపెనీలో దాదాపు ఐదు వేల మంది వరకు పని చేస్తుంటారు. ఆయన నిర్వహించే సంస్థ ఆదాయం ప్రస్తుతానికి1.8 బిలియన్ డాలర్లుగా చెబుతారు.

వ్యాపారవేత్తగానే కాదు ఆయనకు మరిన్ని వ్యాపకాలు ఉన్నాయి. మంచి వక్తగా.. సామాజిక సేవకుడిగా ఆయనకు పేరుంది. దేశంలో పేరు మోసిన ఎన్నో విద్యా సంస్థల్లోనూ.. విశ్వవిద్యాలయాల్లోనూ ఆయన ప్రసంగాలు చేశారు. 2011లో అయోధ్యలోని రామాలయ నిర్మాణం కోసం రూ.11కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. 2014లో ఎస్ఆర్కే నాలెడ్జ్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. వజ్రాల వ్యాపారంలోకి దిగిన సందర్భంలో ఒక్క ఉద్యోగితో ఆయన ప్రయాణం మొదలైంది.

అంచలంచెలుగా ఎదిగిన ఆయన.. ఇప్పుడు పేరు మోసిన వజ్రాల వ్యాపారిగా ఆయన సుపరిచితుడు. తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ఖరీదైన బహుమతులను అందిస్తూ వార్తల్లోకి వస్తుంటారు. ఉద్యోగులకు ఆయనంటే మహా గౌరవం. గతంలో తన కంపెనీలో పని చేసే 300 మంది ఉద్యోగులు.. వారి కుటుంబాల కోసం సుమారు రూ.90 లక్షల ఖర్చుతో ఒక ప్రత్యేక ఏసీ రైలును బుక్ చేసి పది రోజుల పాటు ఉత్తరాఖండ్ యాత్రకు పంపి వార్తల్లోకి ఎక్కారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న గోవింద్ భాయ్ డోలాకియాను ఈసారి బీజేపీ అధినాయకత్వం రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ తరహా రాజకీయేతర ఎంపిక సమకాలీన రాజకీయాల్లో కాస్తంత భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News