మరోసారి పాన్ ఆధార్ అనుసంధానం.. సోషల్ మీడియాలో పేలుతున్న జోక్స్..

సోషల్‌ మీడియా యుగంలో ఏ ప్రకటనైనా వినోదంగా మారకుండా ఉండడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.;

Update: 2025-11-04 04:51 GMT

ఆర్థిక లావాదేవీల్లో మోసాలను నియంత్రించడం, ట్యాక్స్ ఆన్ టైమ్ పేమెంట్ లాంటి వాటి కోసం ప్రభుత్వం ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేయాలని సూచించింది. గతంలో దీనికి కొన్ని రోజుల పాటు గడువు పెట్టింది. ఆ గడువు ముగిసింది. కానీ ఇటీవల మళ్లీ ఈ అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పాన్–ఆధార్‌ లింకింగ్‌ ప్రకటన బయటికి వచ్చినప్పుడు ప్రజల్లో కొంత గందరగోళం, కొంత భయం నెలకొంది. కేంద్రం ఇంకో కొత్త రూల్ తీసుకుచ్చిదంటూ సెటైర్లు వేశారు. ‘ఇంకో కొత్త రూల్.. గడువు ఎప్పటి వరకు..? లింక్‌ చేయకపోతే జరిమానా ఉంటుందా?’ అంటూ ప్రజలు సోషల్‌ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ ఆ భయాన్ని కేవలం కొన్ని గంటల్లోనే నెటిజన్లు హాస్యంగా మార్చేశారు.

ప్రక్రియ సాధారణమే..

పాన్‌ కార్డు + ఆధార్‌ లింక్‌ చేయడం చాలా సులభం. ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని ఆధార్‌ సేవా కేంద్రంలో ఈ ప్రక్రియ చేయించుకోవచ్చు. డిసెంబర్‌ 31, 2025 వరకు మరోసారి నూతన గడువును కేంద్రం విధించింది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం గుర్తింపును క్రమబద్ధీకరించడం, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పెంచడం, మోసాలను నివారించడం. కానీ, సాధారణ పౌరుడి మనసులో మాత్రం కొత్త ఆలోచన ‘ఇదే గడువు గతంలో కూడా చెప్పారు కదా!’ అని. ప్రభుత్వం ప్రతి ఏటా గడువును పొడిగించడం.. ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో లాగిన్‌ సమస్యలు రావడం వంటి అంశాలు ఈ అంశాన్ని మళ్లీ పెద్ద చర్చగా మార్చేశాయి.

సోషల్‌ మీడియా యుగంలో ఏ ప్రకటనైనా వినోదంగా మారకుండా ఉండడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పాన్+ఆధార్‌ లింక్ కూడా ఇదే విధమైన హాస్యాన్ని పండించింది. ‘పాన్‌’ అనే పదం విన్న వెంటనే కొందరు ఫ్రైయింగ్‌ పాన్‌ను గుర్తు చేసుకున్నారు. ఫోటోషాప్‌ తెరపైకి వచ్చింది. పాన్‌పై టేప్‌తో అతికించిన ఆధార్‌ కార్డు ఫోటోలు, ‘ఇప్పుడే లింక్‌ చేశాను’ అన్న క్యాప్షన్‌లు, మీమ్‌ పేజీలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘గవర్నమెంట్‌ చెప్పింది పాన్‌కి ఆధార్‌ లింక్‌ చేయమని, నేను పనికొచ్చే పాన్‌నే లింక్‌ చేశాను!’ అని కామెడీ క్యాప్షన్ పెట్టాడు. ఈ మీమ్స్‌ అంతగా వ్యాపించాయి కాబట్టి.. కొంత మంది నిజంగానే ఆన్‌లైన్‌లో వెతికారు. ‘ఫ్రైయింగ్‌ పాన్‌తో ఆధార్‌ లింక్‌ ఎలా చేయాలి?’ అని. ఇది భారతీయ నెటిజన్‌ హాస్య స్ఫూర్తికి సాక్ష్యం.

ప్రజలు ప్రభుత్వ నియమాలతో అలసిపోయారు బ్యాంక్‌ ఖాతా లింక్‌ చేయాలి, మొబైల్‌ లింక్‌ చేయాలి, ఆధార్‌ అప్ డేట్ చేయాలి. ప్రతి నెలా కొత్త నిర్ణయం, కొత్త హెచ్చరిక. ఈ బరువును కొంచెం తేలిక చేయడమే మీమ్స్‌ చేసే పని. హాస్యం ఇప్పుడు సామూహిక ఒత్తిడి నుంచి బయటపడే మార్గంగా మారింది. పాలసీలు సీరియస్‌గా ఉన్నా.. ప్రజల ప్రతిస్పందన మాత్రం కాస్త హ్యూమరస్ గా మారింది.

Tags:    

Similar News