మంత్రిగారి మాట: 'అద్దంకి' ఆశలు నెరవేరేనా.. ?
మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ప్రజలకు ఏదైనా చెప్పారంటే చేస్తారన్న పేరుంది. గతంలో ఆయన అప్రతి హతంగా విజయం దక్కించుకోవడానికి ఇదే కారణం.;
మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ప్రజలకు ఏదైనా చెప్పారంటే చేస్తారన్న పేరుంది. గతంలో ఆయన అప్రతి హతంగా విజయందక్కించుకోవడానికి ఇదే కారణం. బుజ్జన్నగా పేరొందిన ఆయన సామాన్యులకు చేరువైన రాజకీయ నాయకుడు. అయితే.. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీపై తర్జన భర్జన కొనసాగుతోంది. గొట్టి పాటి ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గాన్ని వైసీపీ హయాంలో బాపట్లలో చేర్చారు. నిజానికి అప్పటి వరకు అద్దంకి.. ప్రకాశం జిల్లా పరిధిలో ఉండేది. కానీ, వైసీపీ దీనిని మార్చేసింది.
ఇది స్థానికులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి వేరు చేసి, తిరిగి ప్రకాశం జిల్లాలోకలపాలన్నది ఇక్కడి ప్రజల డిమాండ్. దీనిపై గత ఎన్నికల సమయంలో గొట్టి పాటి కూడా స్థానికులకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా తిరిగి ప్రకాశంలో కలిపేలా చర్యలు తీసుకుంటామ న్నారు. అయితే.. జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు.. లేదా ప్రజల ఆకాంక్షల మేరకు మార్పులు చేర్పులు చేసేందుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం దీనిపై దృష్టి పెట్టలేదు.
ఈ కమిటీ ఇప్పటికి కేవలం రెండు సార్లు మాత్రమే భేటీ కాగా.. ఈ రెండు సార్లు కూడా అద్దంకి వ్యవహారం ముందుకు సాగలేదు. అయితే.. మంత్రి గొట్టిపాటి ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా.. ఆయనను ఇదే విషయంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి గొట్టిపాటి.. నియోజకవర్గానికి తరచుగా వెళ్లడం లేదు. మంత్రిగా ఉండడంతో చిలకలూరిపేటలోని నివాసంలోనే ఆయన ఉంటున్నారు. దీంతో కొందరు ఇక్కడకు కూడా వచ్చి.. వినతులు సమర్పిస్తున్నారు. అద్దంకి వ్యవహారాన్ని తేల్చాలని కోరుతున్నారు.
ఇదిలావుంటే.. ప్రక్రియ మొదలైందని అధికారులు చెబుతున్నారు. బాపట్ల జిల్లా నుంచి అద్దంకిని వేరు చేసి ప్రకాశంలో కలపడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తాజాగా మంత్రికి అధికారులు సమాచా రం పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం బాపట్ల జిల్లా సరిహద్దులు, అద్దంకిని వేరు చేసే అంశంపై సాధ్యాసా ధ్యాలను వివరిస్తూ నివేదికను సిద్ధం చేయనున్నట్టు సమాచారం.
ఈ ప్రక్రియ పూర్తయితే.. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఇదిలా వుంటే.. జిల్లా కేంద్రం బాపట్ల తమకు 70 కిలో మీటర్ల దూరంలో ఉందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. అద్దంకి నుంచి బాపట్ల వెళ్లాలంటే ఒక రోజు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆశలు ఏమేరకు నెరవేరుతాయన్నది చూడాలి.