ఏడాదిలో 247.4 మిలియన్ల యాడ్స్ తొలగింపు.. గూగుల్ ఇండియా ఎందుకిలా?
తాను పెట్టుకున్న నిబంధనలకు భిన్నంగా ఉంటూ.. ప్రజలకు మోసం చేసేందుకు అవకాశం ఉన్న ప్రకటనల్ని ఎప్పటికప్పుడు తొలగించేందుకు వీలుగా గూగుల్ భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది.;
తాను పెట్టుకున్న నిబంధనలకు భిన్నంగా ఉంటూ.. ప్రజలకు మోసం చేసేందుకు అవకాశం ఉన్న ప్రకటనల్ని ఎప్పటికప్పుడు తొలగించేందుకు వీలుగా గూగుల్ భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. ఆదాయానిచ్చే అవకాశం ఉన్నప్పటికి.. తప్పుడు ప్రకటనల ద్వారా మోసం చేసే అవకాశం ఉన్న వాటిని తొలగించిన ప్రకటనల లెక్క చూస్తే భారీగా ఉంది. కేవలం ఏడాది వ్యవధిలో ఒక్క భారత్ లో తొలగించిన యాడ్స్ 247.4 మిలియన్లు కావటం గమనార్హం.
అంతేకాదు.. ఈ ప్రకటనలకు సంబంధించి 29 లక్షల ప్రకటనల ఖాతాల్నిశాశ్వితంగా రద్దు చేసినట్లుగా వెల్లడైంది. దీనికి సంబంధించిన ఒక రిపోర్టు విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్లకుపైగా ప్రకటనదారుల ఖాతాల్ని సస్పెండ్ చేసిన గూగుల్.. తమ డిజిటల్ యాడ్స్ ఎకో సిస్టమ్ ను విశ్వసనీయంగా ఉంచే ప్రయత్నంలో ఈ కీలక అడుగు వేసినట్లుగా చెబుతోంది.
భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్న వేళ.. ఆన్ లైన్ ఆర్థిక మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో బ్రాండ్ దుర్వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు హాని కలిగించే ప్రకటనల్ని నిషేధిస్తూ గూగుల్ తీసుకున్న చర్యలు ఆసక్తికరంగా మారాయి.
తాజాగా విడుదలైన సంస్థ వార్షిక యాడ్స్ సేఫ్టీ రిపోర్టులో పేర్కొన్న దాని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 5.1 బిలియన్ల ప్రకటనల్ని తొలగించినట్లుగా చెప్పింది. గూగుల్ పరకటన విధాన నిబంధనల ఉల్లంఘనల జాబితాలో ఆర్థిక సేవలకు సంబంధించిన ప్రకటనలే అధికంగా ఉన్నాయి. ట్రేడ్ మార్క్ ఉల్లంఘనలు.. దుర్వినియోగం.. జూదం.. గేమ్స్ సంబంధించిన ప్రకటనలు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లుగా గుర్తించారు.
మోసాల్ని ప్రోత్సహించే ప్రకటనదారుల్ని సస్పెండ్ చేసేందుకు ఏకంగా వంద మందికి పైగా నిపుణుల టీం పని చేసినట్లుగా గూగుల్ పేర్కొంది. అంతేకాదు.. ఏఐ వీడియోల ప్రకటనలు పెరిగినట్లుగా వెల్లడించింది. తాను చేపట్టిన చర్యల కారణంగా స్కామ్ ప్రకటనల జోరు 90 శాతం వరకు తగ్గాయని వెల్లడించింది. ఆదాయాన్ని అందించే మార్గాల కంటే కూడా విశ్వసనీయత పెంచే చర్యలకే గూగుల్ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తన రిపోర్టు ద్వారా స్పష్టం చేసిందని చెప్పాలి.