బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాటల్లో వైజాగ్
ఈ క్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోమారు వైజాగ్ ప్రత్యేకతను చాటేలా ఓ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
గూగుల్ పెట్టుబడులతో వైజాగ్ గ్లోబల్ ట్రెండింగ్ సిటీగా మారింది. అమెరికా వెలుపల అతిపెద్ద మొత్తంలో గూగుల్ పెట్టుబడి పెడుతుండటంతో విశాఖ నగరం ప్రత్యేకతల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోమారు వైజాగ్ ప్రత్యేకతను చాటేలా ఓ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం, డ్రీమ్‌ఫోర్స్ అనే సేల్స్‌ఫోర్స్ వార్షిక టెక్నాలజీ ఈవెంట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా గూగుల్ పెట్టుబడులపై సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్ ప్రస్తావించారు.
అమెరికా వెలుపల గూగుల్ అత్యధిక పెట్టుబడి దక్షిణ భారతదేశంలో పెట్టాలని నిర్ణయిందని, ఇందుకోసం వైజాగ్ లో 15 బిలియన్ డాలర్లతో ఒక గిగావాట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్, ఏఐ హబ్ పెడుతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైజాగ్ ఒక బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్ అంటూ వర్ణించారు. అంతేకాకుండా తాను మాట్లాడుతున్న సమయంలో చప్పట్లు కొట్టాలని సభికులను కోరడం విశేషం.
విశాఖలో గూగుల్ డేటా సెంటరుతో పాటు ఆ ప్రాంత ముఖచిత్రమే మారిపోనుందని సుందర్ పిచాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పుడు భారతదేశంలో రైలు ప్రయాణం చేసే సమయంలో కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న గూగుల్ సీఈవో వైజాగ్ అందాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఆయన మాట్లాడిన ఈ వీడియో ఆన్లైన్ ట్రెండింగుగా మారింది. అంతేకాకుండా గూగుల్ డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉద్యోగాలు రావంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి కూటమి నేతలకు మరో ఆయుధం లభించినట్లైంది.
ఈ వారంలో వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై సుందర్ పిచాయ్ రెండు సార్లు స్పందించారు. ఈ నెల 14న ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న వెంటనే ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. విశాఖ గూగుల్ ఏఐ హబ్ కోసం తాను ప్రధాని మోదీతో మాట్లాడినట్లు చెప్పిన సుందర్ పిచాయ్.. ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని 'చారిత్రాత్మక అభివృద్ధి'గా పేర్కొన్నారు. దీని ద్వారా తమ అత్యాధునిక టెక్నాలజీని భారతీయ సంస్థలకు, వినియోగదారులకు అందించి, దేశవ్యాప్తంగా AI ఆవిష్కరణలను వేగవంతం చేస్తామని వెల్లడించారు. తద్వారా దేశాభివృద్ధి దోహదపడుతుందని తెలిపారు.