గోదావరి నదిలో కాలకూటం...పవన్ సంచలనం

అఖండ గోదావరిని చూసే భాగ్యం ఏపీకే ఉంది. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి అలా ప్రాంతాలు అన్నీ దాటుకుంటూ ఏపీకి గోదావరి వస్తుంది.

Update: 2026-06-09 00:30 GMT

అఖండ గోదావరిని చూసే భాగ్యం ఏపీకే ఉంది. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి అలా ప్రాంతాలు అన్నీ దాటుకుంటూ ఏపీకి గోదావరి వస్తుంది. అది కూడా ఉరుకుని పరుగులు తీస్తూ వస్తుంది. నిండుగా అఖండంగా కనిపిస్తూ అందరికీ కనువిందు చేస్తుంది. రాజమండ్రి వద్ద అఖండ గోదావరిని చూసేందుకు ఎవరికైనా కళ్ళూ చాలవు. అలాంటి గోదావరి నిండా కాల కూటం నింపుతున్నారు. కాలుష్యం కోరల్లో గోదావరి నది నిండిపోయింది. దీని మీద ఇటీవల ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గోదావరి ప్రాంతానికి వెళ్ళి స్వయంగా విజిట్ చేశారు. ఎక్కడెక్కడి నుంచి గోదావరిలో కలుషితం అయిన వ్యర్ధాలు కలుస్తున్నాయి అన్నది ఆయన అరా తీశారు. ఆ మీదట ఆదేశాలను సైతం అధికారులకు జారీ చేసారు.

ఇన్నాళ్ళు ఏం చేశారు :

ఇదిలా ఉంటే తాజాగా పవన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గోదావరి నది విషయంలో అధికరుల ఉదాశీనత మీద ఆగ్రహం వ్య్హక్తం చేశారు. కళ్ళ ముందే గోదావరి కలుషితమవుతుంటే ఇన్ని రోజులూ ఏం చేశారు అని సూటిగా ప్రశ్నించారు. పీసీబీ అందించిన ల్యాబ్ రిపోర్టుపై సమీక్ష సమావేశంలో కీలకంగా చర్చించారు. ఇక ఈ నివేదికలో అనుమతించదగిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలను గుర్తించారు. దాంతో పవన్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర పేపర్ మిల్లుకు అలాగే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. అంతే కాదు నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు కూడా పవన్ ఆదేశాలు జారీ చేశారు.

దిగ్భ్రాంతిని కలిగించే అంశాలు :

ఇదిలా ఉంటే పవిత్ర గోదావరి నదిని పారిశ్రామిక రసాయనాలు అలాగే, రాజమండ్రీని వచ్చే ర మురుగు నీరు ఎంత దారుణంగా కలుషితం చేస్తున్నాయో ఆ నివేదిక కళ్ళకు కట్టింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అందించిన ల్యాబ్ రిపోర్టులో ఈ విధంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధిక రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ నివేదికపై పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆందోళనకర స్థాయిలో కోలిఫామ్ బ్యాక్టీరియా :

గోదావరి నదిని మురుగు మయం అలాగే రసాయన మయం చేస్తున్న ప్రస్తుత పరిస్థితిపై పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కళ్ళ ముందే గోదావరి నది ఇంతలా కలుషితమవుతున్నా ఇన్ని రోజులుగా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేశారని అధికారులను పవన్ నిలదీశారు. అంతే కాదు గోదావరి నీటిలో కాలుష్యాన్ని చూపే బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి మూడు ఎంజీ బై ఎల్ కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ అది 5.2 ఎంజీ బై ఎల్ గా నమోదైంది. అంటే ఏకంగా 73 శాతం పెరిగిందన్న మాట. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి చేపలు జలచరాలు చనిపోతున్నాయి. నీటి స్వచ్ఛత గరిష్టంగా 5 ఎన్టీయూ పాయింట్లు ఉండాలి. కానీ పరీక్షల్లో ఇది 8.4 నుండి 14.2 ఎన్టీయూగా వచ్చింది. మురుగునీరు కలవడం వల్ల గోదావరి నీరు పూర్తిగా రంగు మారిపోతోంది. మురుగు కాలువలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 250 ఎంజీ బై ఎల్ దాటకూడదు. కానీ ఇక్కడ 263 ఎంజీ బై ఎల్ గా నమోదైంది. నీటిలో నైట్రేట్ పరిమితి 45 ఎంజీ బై ఎల్ దాటకూడదు. కానీ ఇక్కడ ఏకంగా 119.6 ఎంజీ బై ఎల్ గా తేలింది. రసాయన ఎరువుల అవశేషాలు ఫ్యాక్టరీల వ్యర్థాలు కలవడం వల్లే నైట్రేట్లు ఇంతగా పెరిగాయని చెబుతున్నారు.

గోదావరి నీరు పనికి రాదు :

ఇక ఈ ల్యాబ్ నివేదిక ప్రకారం ఈ నీరు స్నానాలు చేయడానికి గానీ, గృహ అవసరాలకు గానీ ఏమాత్రం పనికి రాదు. ఈ నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నైట్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందక బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే ముప్పు ఉందని నివేదిక హెచ్చరించింది. ఇదిలా ఉంటే పరిశ్రమల మనుగడను, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో ఆ పరిశ్రమకు మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

గోదావరి ప్రక్షాళనకు కేంద్ర సాయం :

ఇదిలా ఉండగా గోదావరి నది శాశ్వత ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగారితో ప్రత్యేకంగా మాట్లాడతానని పవన్ చెప్పారు. దాని కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అంతే కాదు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఒక్క చుక్క మురుగునీరు కూడా శుద్ధి కాకుండా గోదావరిలోకి వెళ్లకూడదని ఆదేశించారు.

Tags:    

Similar News