'మే మేహెచ్'.. నెట్టింట ఐటీ ఉద్యోగుల గగ్గోలు.. ఎందుకో తెలుసా?
ఉన్నఫళంగా కంపెనీలు ఊస్టింగ్ ఆర్డర్లు చేతిలో పెడుతుండటంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెక్ ప్రపంచంలో ఉద్యోగాల కోత (లేఆఫ్స్) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఉద్యోగుల తొలగింపుపై దృష్టి పెట్టిన కంపెనీలు మే నెలలో మరింత జోరుగా కోతలు పెట్టాయని అంటున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 'మే మేహెమ్' అంటూ ఐటీ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఐటీ ఇంజనీర్లు ఉద్యోగాలు కోల్పోయారని చెబుతున్నారు. ఈ పరిస్థితి రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు. ఉన్నఫళంగా కంపెనీలు ఊస్టింగ్ ఆర్డర్లు చేతిలో పెడుతుండటంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు నెలల్లోనే లక్ష మంది రోడ్డున..?
టెక్ పరిశ్రమలో లేఆఫ్స్ పరంపర ఈ ఏడాది ప్రారంభం నుంచి మరింత ఉధృతమైందని చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారని చెబుతున్నారు. ఉన్న ఫళంగా కంపెనీలు అందిస్తున్న పింక్ స్లిప్స్‌తో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. లింక్డ్‌ఇన్ వేదికగా ఎంతో మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, మేనేజర్లు తమకు జరిగిన చేదు అనుభవాలను, ఆవేదనను పంచుకుంటున్నారు.
దిగ్గజ కంపెనీలు సైతం
టెక్ కంపెనీల్లో ఉద్యోగులకు లేఆప్ఫ్ ప్రకటించడం సర్వసాధారంగా చెబుతున్నారు. చిన్నచితకా కంపెనీలు తమ మనుగడ సాధించడానికి పొదుపు చర్యలలో భాగంగా ఉద్యోగులను తగ్గించుకుంటాయని అంటున్నారు. కానీ, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి పెద్ద పెద్ద టెక్ దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించడమే ఐటీ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందని అంటున్నారు. సోషల్ మీడియా దిగ్గజం మెటా తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో ఏకంగా 10 శాతం మందిని తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెటాతో పాటు సిస్కో, పేపాల్ కూడా ఉద్యోగాల కోత విధించింది. నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కునే వేదికైన లింక్డ్‌ఇన్ సైతం తమ సంస్థల్లో వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు కారణం ఏఐనే..
పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆయా కంపెనీలు నష్టాల్లో ఉండటం వల్ల ఈ లేఆఫ్స్ జరగడం లేదన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. భవిష్యత్తు రేసులో ముందుండటం కోసం చాలా కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు చెబుతున్నారు. సాంప్రదాయ ఐటీ విభాగాల్లో మానవ వనరుల ఖర్చును భారీగా తగ్గించుకోవడం, ఆ మిగిలిన బడ్జెట్‌ను కృత్రిమ మేధ, జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులపై పెట్టుబడులుగా మళ్లించడానికి ప్రాధాన్యమిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో సాధారణ కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ విభాగాల కంటే ఏఐ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్ రంగాల్లోనే భారీగా నిధులను కుమ్మరిస్తున్నాయని అంటున్నారు. ఈ పరిణామం సాధారణ ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. ‘మానవ శ్రమను రీప్లేస్ చేస్తూ ఏఐ ప్రాజెక్టుల కోసం మమ్మల్ని తీసేస్తారా?’ అంటూ ఉద్యోగులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఉద్యోగులు 'మే మేహెమ్' అంటూ తమ ఆవేదనను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే ఐటీ రంగంలో మనుగడ సాగించాలంటే కేవలం పాత నైపుణ్యాలు సరిపోవని స్పష్టమవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు భయాందోళనలకు గురికాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌స్కిల్లింగ్ చేసుకోవాలని, AI టూల్స్‌పై పట్టు సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా, 2026 మే నెల మాత్రం ఐటీ చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.