'బురఖాల వెనుక ఉన్న ముఖాలు చూపించాలి'.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు!
అవును... బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కు ముందు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.;
బీహార్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కు ముందు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ముస్లిం మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా బురఖాల ముసుగులో బోగస్ ఓటింగ్ జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు! దీంతో.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అవును... బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కు ముందు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఈ ఎన్నికలు అడవి రాజ్యం వర్సెస్ అభివృద్ధి మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఎన్డీయే ఎజెండా అభివృద్ధి అని.. ఎన్డీయే అభివృద్ధి అంశాలపై ఎన్నికల్లో పోటీ చేస్తోందని.. ప్రధాని మోడీ, నితీష్ కుమార్ పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారని అన్నారు.
బురఖా తనిఖీలపై కీలక వ్యాఖ్యలు!:
పోలింగ్ సమయంలో భద్రతపై చర్చను గిరిరాజ్ సింగ్ తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా... బురఖా తనిఖీని వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన నొక్కి చెప్పారు. బురఖాలు ధరించిన ఓటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. బురఖాల ముసుగులో బోగస్ ఓటింగ్ జరుగుతుందని.. గతంలో, పురుషులు కూడా బురఖాలు ధరించేవారని ఆయన అన్నారు.
ఇదే సమయంలో.. ఇది భారతదేశమని.. ఇక్కడ ఎన్నికల సంఘం రూల్స్ వర్తిస్తాయని.. ఆధార్ కార్డు కోసం, ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు వెళ్లినప్పుడూ వాళ్లు బురఖా తీయరని.. ఇదేమీ పాకిస్థాన్, బంగ్లాదేశ్ లేదా మరేదైనా ఇస్లామిక్ దేశం కాదని.. ఇది ఇండియా అని.. ఇది సెక్యులర్ దేశమని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు!
నిష్పాక్షికమైన ఎన్నికలను నిర్ధారించడానికి పోలింగ్ కేంద్రాలలో కఠినమైన గుర్తింపు తనిఖీలు చాలా ముఖ్యమైనవని వాదించిన సింగ్.. ఎన్డీయే పారదర్శక, రాజ్యాంగ విధానాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు!
'121 సీట్లతో ఎన్డీయే గెలుస్తుంది'!:
గురువారం బరాహియాలోని హయ్యర్ సెకండరీ స్కూల్ లోని పోలింగ్ స్టేషన్ లో ఓటు వేసిన తర్వాత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా... బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఎన్డీఏ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా.. 121 సీట్లలో ఎన్డీయే గెలుస్తుందని.. 2010 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని తాను చెబుతున్నానని అన్నారు.
కాగా... బీహార్ లో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 122 మంది మహిళా అభ్యర్థులు సహా 1,314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక.. 3.75 కోట్లకు పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొటున్నారు! పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.