జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం బాంబుల కలకలం.. 20వేల మంది తరలింపు

ఈ బాంబులను నిర్వీర్యం చేయడానికి ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో 1,000 మీటర్ల (1 కిలోమీటరు) వరకు ప్రమాదకర జోన్‌గా ప్రకటించారు.;

Update: 2025-06-04 15:06 GMT

రెండో ప్రపంచ యుద్ధం ముగిసి దశాబ్దాలు గడిచినా దాని తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా, జర్మనీలోని కోలోన్ నగరంలో మూడు.. రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు కనుగొనబడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, బాంబులు దొరికిన ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న 20,000 మందికి పైగా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. వారికి నగరం సమీపంలోని అనేక చర్చిలు, క్రీడా మైదానాల్లో ఆశ్రయం కల్పించారు. ముందు జాగ్రత్త చర్యగా కోలోన్‌కు వెళ్లే రవాణా మార్గాలను కూడా కొంత సమయం పాటు మూసివేశారు. నగరమంతటా అంబులెన్స్‌లు, భద్రతా బలగాలను మోహరించారు.

అమెరికా తయారు చేసిన బాంబులు

సోమవారం నాడు జర్మనీలో కనుగొనబడిన ఈ మూడు బాంబులు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీపై వేసిన పేలని బాంబులు అని అధికారులు తెలిపారు. అవి అమెరికా తయారు చేసినవిగా భావిస్తున్నారు. కనుగొన్న మూడు బాంబులలో రెండు బాంబులు ఒక్కొక్కటి 1,000 కిలోగ్రాముల (1 టన్ను) బరువు ఉండగా, మరొకటి 500 కిలోగ్రాముల (అర టన్ను) బరువు ఉంది. మొత్తం మీద 2.5 టన్నుల పేలుడు పదార్థాలు దొరికాయి.

ఈ బాంబులను నిర్వీర్యం చేయడానికి ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో 1,000 మీటర్ల (1 కిలోమీటరు) వరకు ప్రమాదకర జోన్‌గా ప్రకటించారు. ఒకవేళ పొరపాటున ఈ బాంబులు పేలితే, కిలోమీటర్ల మేర తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు హెచ్చరించారు. 1939లో జర్మనీ పోలాండ్‌పై దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిట్లర్ నేతృత్వంలోని నాజీ దళాలను అణచివేయడానికి అమెరికన్, బ్రిటిష్ బలగాలు జర్మనీపై వేలాది బాంబులను కురిపించాయి. ఇప్పటికీ, జర్మనీలో పెద్ద సంఖ్యలో పేలని బాంబులు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News