నిద్రపోని జెన్ జడ్.. వారికేమైంది?

ప్రపంచాన్ని ఇప్పుడో కొత్త తరం నడిపిస్తోంది. అదే.. జనరేషన్ జెడ్ (1996 - 2010 మధ్యన పుట్టినోళ్లు) .;

Update: 2025-09-20 04:54 GMT

ప్రపంచాన్ని ఇప్పుడో కొత్త తరం నడిపిస్తోంది. అదే.. జనరేషన్ జెడ్ (1996 - 2010 మధ్యన పుట్టినోళ్లు) . ఇప్పటివరకు ఉన్న జెనరేషన్లకు కాస్త భిన్నంగా వీరు ఉండటమే కాదు..వారి వ్యవహారశైలి సైతం భిన్నంగా ఉండటం కనిపిస్తుంది. కనిపించేందుకు ఏ మాత్రం భావోద్వేగాలు లేని వారిగా.. వస్తువులు.. వస్తుసేవలకు విపరీతమైన ప్రాధాన్యతను ఇస్తూ.. తమను తాము ప్రేమించుకోవటానికే సమయం సరిపోనట్లుగా ఉండే ఈ బ్యాచ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పెద్దగా పట్టనట్లుగా ఉండే వీరికి.. ఏదైనా విషయంలో తేడాగా అనిపిస్తే రోడ్ల మీదకు వచ్చి రచ్చ చేయటమే కాదు.. ప్రభుత్వాల్ని సైతం ఇట్టే మార్చేంత పవర్ ఫుల్ గా వీరు వ్యవహరిస్తూ ఉంటారు.

టెక్నాలజీని విపరీతంగా ప్రేమించే వీరికి సంబంధించి తాజాగా ఒక సర్వే నిర్వహించారు. అమెరికాకు చెందిన మ్యాట్రెస్ అనే సంస్థ వెయ్యి మంది జెన్ జెడ్ వారిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఒక షాకింగ్ నిజం వెలుగు చూసింది. అదేమంటే.. జెనరేషన్ జెడ్ వారు ఎక్కువగా నిద్ర పోవటం లేదని.. వీరు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఆలోచనల తీవ్రతతో నిద్రకు కూడా దూరమైనట్లుగా పేర్కొన్నారు.

అమెరికాలోని జనరేషన్ జెడ్ వర్గీయులకు సామాజిక స్ప్రహ కూడా ఎక్కువే. ఆర్థిక ఒత్తిళ్లు.. ఉద్యోగ భద్రత లాంటి అంశాల్లో తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు. అమెరికాలో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు..పెరిగిన లేఆఫ్ లు వారిని కలవరపాటుకు గురి చేస్తున్నట్లుగా పేర్కొంది. ఇటీవల టారిఫ్ లపై చర్చలు మొదలైనప్పటి నుంచి వారు సరిగా నిద్ర పోవటం లేదని గుర్తించారు. సర్వే చేసిన వారిలో 69 శాతం మంది డబ్బు గురించి ఆలోచిస్తూ.. మెలుకువతో ఉండిపోతుండగా.. 47 శాతం మంది ఉద్యోగభద్రతపై ఆందోళన చెందుతున్నట్లుగా గుర్తించారు.

ఇల్లు.. ఇంటి అద్దెల ఖర్చులు వీరిని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తున్నట్లుగా తేలింది. తాజా సర్వేలో 11 శాతం మంది ఐదు గంటల కంటే తక్కువగా నిద్ర పోతున్నారని.. నిద్ర పోయే ముందు కూడా బ్యాంక్ ఖాతాలో ఎంత మొత్తం ఉందన్న విషయాన్ని చెక్ చేసుకోవటం వీరిలో కనిపిస్తుందనిచెబుతున్నారు. సగానికి పైగా జెన్ జెడ్ లు సోషల్ మీడియాకు అంకితం అవుతున్నట్లుగా తేల్చారు. 47 శాతం మంది టీవీలు చూడటంతోనే కాలం గడుపుతుండగా.. కొంతమంది బెడ్రూంలకే పరిమితం అవుతున్నారని సర్వే వెల్లడించింది. నిద్ర సరిగా లేని కారణంగా వీరు యాక్టివ్ గా ఉండటం లేదని కూడా చెబుతున్నారు.

Tags:    

Similar News