ప్రయాణం నుంచి పరిపాలన దాకా.. మార్పుకు కేరాఫ్ అడ్రస్ 'జనరేషన్ జెడ్'

జెన్ జెడ్.. ఈ పదం బంగ్లాదేశ్ , నేపాల్ లో ప్రభుత్వాలను కూలదోసిన యువత చాటిన స్ఫూర్తితో అందరికీ తెలిసివచ్చింది.;

Update: 2025-12-18 23:30 GMT

జెన్ జెడ్.. ఈ పదం బంగ్లాదేశ్ , నేపాల్ లో ప్రభుత్వాలను కూలదోసిన యువత చాటిన స్ఫూర్తితో అందరికీ తెలిసివచ్చింది. ప్రభుత్వాలను సైతం కదిలించగల శక్తి ఈ జెన్ జెడ్ యువతకు ఉందన్న విషయం తేటతెల్లమైంది. నేటికి సమాజంలోని అన్యాయాలను చూసి నిలదీయడం.. వ్యవస్థలో మార్పు కోసం తపించడం ఆ తరం లక్షణం అయితే.. ఆ తపనను చేతల్లో చూపిస్తూ.. ఆధునిక సాంకేతికతను ఆయుధంగా మార్చుకొని ప్రపంచాన్నే ప్రభావితం చేస్తోంది నేటి జనరేషన్ జెడ్.

మాటల నుంచి మార్పు వైపు..

జనరేషన్ జెడ్ అంటే కేవలం రీల్స్ చేసే తరం అని భావిస్తే అది పొరపాటే. దేశ సరిహద్దులు దాటి నేపాల్ రాజకీయాల్లో వారు చూపిన చొరవ దీనికి నిదర్శనం.. తమకు నచ్చని వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం, మార్పు కోసం రోడ్ల మీదకు వచ్చే తెగువ వారి సొంతం. కేవలం ధర్నాలతో ఆగిపోకుండా.. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములవుతూ దేశ భవిష్యత్తును దిశానిర్ధేశం చేస్తున్నారు.

ప్రపంచాన్ని చదివేస్తున్న ‘ట్రావెల్ ట్రెండ్’

జనరేషన్ జెడ్ ఆలోచనా ధోరణిలో వచ్చిన అతిపెద్ద మార్పు ‘ప్రయాణం’. క్లియర్ ట్రిప్ నివేదిక ప్రకారం.. 2025లో ట్రావెల్ బుకింగ్స్ లో ఈ తరం ఏకంగా 650 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది కేవలం విహారయాత్ర మాత్రమే కాదు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. వియత్నం వంటి అంతర్జాతీయ ప్రాంతాల నుంచి అండమాన్ వారణాసి వంటి దేశీయ ఆధ్యాత్మిక కేంద్రాల దాకా వీరు వెళుతున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా తమను తాము తెలుసుకోవడానికి ‘సోలో ట్రావెలింగ్ ను కెరీర్ లో ఒక భాగంగా మార్చుకుంటున్నారు. వెళ్లిన చోట కేవలం ఫొటోలు దిగడం మాత్రమే కాకుండా అక్కడి స్థానిక సంస్కృతిని మనుషులను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా మెలుగుతున్నారు.

సాధారణంగా ఈ తరం అంటే విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యం అనే అపోహలు ఉన్నాయి. కానీ వాస్తవానికి అత్యంత చైతన్యం కలిగిన తరం . వీరు చేసే ప్రయాణాల్లో పర్యావరణానికి హాని కలుగకుండా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాను కేవలం వినోదానికే కాకుండా సామాజిక సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడానికి వాడుతున్నారు. అన్యాయం ఎక్కడ జరిగినా డిజిటల్ వేదికల ద్వారా నిలదీస్తున్నారు.

యువసేన పాటలో చెప్పినట్లు సమాజం బాగుండాలనే కోరిక, నేటి యువత రక్తంలో ప్రవహిస్తోంది. కాకపోతే వారి పద్ధతులు మారాయి. వారు వీధుల్లో పోరాడుతున్నారు. విమానాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. ఇంటర్నెట్ వేదికగా మార్పుకు స్వరంగా మారుతున్నారు.

ప్రశ్నించే గొంతుక, కొత్తదారిని వెతికే పాదం, సమాజాన్ని ప్రేమించే హృదయం.. ఈ మూడు కలిసిన ‘జనరేషన్ జెడ్’ నిజంగానే దేశానికి ఒక కొత్త ఆశ కిరణం.

Tags:    

Similar News