ఎమ్మెల్యేగానే రెండు బర్త్ డేలు...ఆ ముచ్చట ఉందా ?

తెలుగుదేశం పార్టీకి చెందిన భీమునిపట్నం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి.;

Update: 2025-12-01 18:26 GMT

తెలుగుదేశం పార్టీకి చెందిన భీమునిపట్నం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. సన్నిహితులు ఆత్మీయుల మధ్యన ఆయన జన్మ దిన వేడుకలు గతంలో కంటే ఈసారి అట్టహాసంగా చేశారు. సన్నిహితులు బంధుమిత్రులు అంతా కలసి గత కొన్ని రోజులుగా గంటా పుట్టిన రోజులను ఘనంగా చేయాలని నిర్ణయించుకుని భారీ ఏర్పాట్లు చేశారు.

ఇదీ విశేషం. :

ఈసారి గంటా పుట్టిన రోజులకు ఒక విశేషం ఉంది. ఆయన రాజకీయ జీవితం పాతికేళ్ళు పూర్తి అయిన సందర్భం ఇది. 1999లో అనకాపల్లి నుంచి ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచిన గంటా వెనక్కి తిరిగి చూసుకోలేదు 2004లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా 2009లో ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా 2014లో టీడీపీ నుంచి భీమిలీ ఎమ్మెల్యేగా గెలిచారు ఈ మధ్యలోనే మంత్రిగా కూడా ఉన్నారు. 2019 నుంచి ఆయన రాజకీయం సాధారణంగా గడుస్తోంది. అప్పట్లో ప్రతిపక్షంలో గంటా ఉన్నారు ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా మంత్రి పదవి అయితే ఆయనకు దక్కలేదు. ఒక విధంగా ఆయన అభిమానులకు అనుచరులకు అది ఒక విధమైన ఆవేదనగానే ఉంది అని అంటారు.

మంత్రిగానే ఈసారి :

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన పుట్టిన రోజు వేడుకలలో ప్రతీ ఒక్కరూ ఆశించింది ఏంటి అంటే మా గంటా ఈసారి తప్పకుండా మంత్రి అవుతారు అని. ఆయన 2014 నుంచి 2019 దాకా విశాఖ జిల్లా తరఫున మంత్రిగా ఉన్నారు. ఆనాడు ఆయన జిల్లాను మొత్తం నడిపించారు అని వారు చెబుతారు. ఈసారి చూస్తే విశాఖ జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేదు, అనకాపల్లి జిల్లా నుంచి మంత్రి ఉన్నారు. అలాగే స్పీకర్ పదవి కూడా ఆ జిల్లాకే దక్కింది. దాంతో విస్తరణలో కచ్చితంగా విశాఖ జిల్లాకు న్యాయం జరుగుతుంది అని అంటున్నారు. అలా 2026 నాటికి మంత్రిగానే మా గంటా పుట్టిన రోజు వేడుకలు చేస్తామని వారు ఆశపడుతున్నారు.

కలెక్టర్ కావాలని :

ఇదిలా ఉంటే తన పుట్టిన రోజు సందర్భంగా గంటా శ్రీనివాసరావు ఇప్పటిదాకా తన జీవితంలో ఎవరితోనూ పంచుకోని వాటిని మీడియా ముఖంగా పంచుకున్నారు. తాను బీకాం బీఎల్ చేశాను అని ఆయన చెప్పారు. ఐఏఎస్ కి ప్రిపేర్ అయి సివిల్ సర్వీసులో చేరాలన్నది తన ఉద్దేశ్యం అని చెప్పారు. అయితే విధి ఇలా ప్రజా జీవితంలోకి తీసుకుని వచ్చిందని ఆయన చెప్పారు. కలెక్టర్ కాకపోయినా గంటా మంత్రిగా ఎంతో మంది కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారని అంటారు. అలాగే ఆయన సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవులు చేపట్టి తాను అనుకున్న విధంగా విశాఖ జిల్లా అభివృద్ధి కోసం దోహదపడ్డారు అని అంటున్నారు.

ఆ కోరిక తీర్చుకుని :

ఇక గంటా ఆరున్నర పదుల వయసులోకి అడుగుపెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదులకు చేరువ అవుతారు. దాంతో రాజకీయంగా ఇక తప్పుకుని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. దాంతో దాదాపుగా గంటాకు ఎమ్మెల్యేగా ఇదే చివరి అవకాశం అని అంటున్నారు. దాంతో ఆయన తన పదవీకాలంలో మంత్రి అయి ఆ హోదాలో తాను ఇంకా చేయాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి సంతృప్తి చెందాలని చూస్తున్నారు అని అంటున్నారు. తాను చంద్రబాబు ప్రోడక్ట్ ఆయన వల్లనే రాజకీయాల్లోకి వచ్చి ఇంతటి స్థానాన్నికి ఎదిగాను అని వినయంగా చెప్పుకునే గంటా పట్ల చంద్రబాబుకు ఎంతో గురి ఉంది. దాంతో విస్తరణలో సీనియర్లకు చోటు ఇస్తారని ప్రచారం సాగుతున్న వేళ గంటా మరోసారి మంత్రి అవుతారని అంటున్నారు. మొత్తానికి ఈసారి గంటా బర్త్ డే వేడుకలు అయితే వేరే లెవెల్ లో జరిగాయి

Tags:    

Similar News