గంటా అయ్యన్న నవ్వులు పువ్వుల్

ఇక విభజన ఏపీలో అప్పటి ఉమ్మడి జిల్లాలో గంటా అయ్యన్న ఇద్దరూ మంత్రి పదవులు దక్కించుకున్నారు.

Update: 2026-05-26 03:41 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత భీమునిపట్నం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు, అలాగే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కి చెందిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా విశాఖలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో కలసి మెలసి సందడి చేస్తూ నవ్వుల పువ్వులు పూయించారు. దానిని చూసిన వారు అంతా ఎంత ముచ్చటగా ఉంది సీనియర్ నేతల స్నేహ బాంధవ్యం అని మురిసిపోయారు. ఈ ఇద్దరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ కార్యక్రమం ఆద్యంతం అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలాగే పక్క పక్కనే కూర్చుని మరీ అనేక విషయాలను చర్చించుకున్నారు. ఇందులో విశేషం ఏముంది ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన దిగ్గజ నేతలు కదా అనుకోవచ్చు. కానీ ఈ ఇద్దరు నేతల మధ్య గతంలో రాజకీయ పరమైన వైరం ఉందని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. దానికి బలం చేకూర్చేలా అనేక సంఘటనలు కూడా జరిగాయని ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయం ఎరిగిన వారు అంతా చెబుతారు.

అప్పట్లో కోల్డ్ వార్ :

ఇక విభజన ఏపీలో అప్పటి ఉమ్మడి జిల్లాలో గంటా అయ్యన్న ఇద్దరూ మంత్రి పదవులు దక్కించుకున్నారు. చంద్రబాబు కూడా సామాజిక ప్రాంతీయ న్యాయం పాటిస్తూ ఇద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించారు అయితే ఆ అయిదేళ్ళ కాలంలో ఇద్దరూ రాజకీయంగా ఆధిపత్యం కోసం పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా తమ వ్యూహాలకు పదును పెట్టడంతో వర్గ పోరుగా టీడీపీకి అది పరిణమించింది అని చెబుతారు. ఆఖరుకు నామినేటెడ్ పదవులు పంపిణీ కూడా చేయలేని పరిస్థితులు ఆనాడు నెలకొన్నాయని కూడా గుర్తు చేసుకుంటారు. ఇక 2019లో గంటా గెలిచారు, జగన్ వేవ్ లో సైతం ఆయన తన సీటుని నిలబెట్టుకున్నారు. అయ్యన ఓటమి చెందినా టీడీపీ పక్షాన గట్టిగా నిలబడి పోరాటం చేశారు. ఆ సమయంలో గంటా పెద్దగా బయటకు రాలేదని అయ్యన్న వర్గం ఆరోపిస్తూ వచ్చింది. అయితే అనారోగ్య సమస్యల కారణగానే గంటా కొంతకాలం దూరంగా ఉన్నారని ఆయన వర్గం చెబుతుంది. ఇక వైసీపీలోకి గంటా చేరేందుకు ప్రయత్నం చేశారు అని ప్రత్యర్థి వర్గం అప్పట్లో అంటూండేది. ఇక గంటాకు 2024 ఎన్నికల్లో టికెట్ చివరి విడతలో రావడం వెనక కూడా అనేక కారణాలు ఉన్నాయని చెబుతారు.

చివరి ఎన్నికలేనా :

ఇదిలా ఉంటే ఈ ఇద్దరు సీనియర్లూ ఇపుడు పోటా పోటీగా రాజకీయం చేసే స్థితిలో లేరని చెబుతున్నారు గంటా మాజీ మంత్రిగానే మిగిలారు. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన పూర్తిగా భీమిలీ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అలాగే స్పీకర్ వంటి రాజ్యాంగ పదవిలో అయ్యన్న కుదురుకున్నారు. దాంతో గతంలో మాదిరిగా ఆయన పూర్తి స్థాయి ప్రత్యక్ష రాజకీయాల వైపు చూసే అవకాశం అయితే లేదు. ఇక టీడీపీలో చూస్తే రాజకీయం మారుతోంది. సీనియర్లు తెర వెనక్కి వెళ్తున్నారు. కొత్త వారికి జూనియర్లకు అవకాశాలు దక్కుతున్నాయి. దాంతో ఈ ఇద్దరు సీనియర్ నేతలూ 2029లో తమ వారసులను రంగంలోకి దించి తాము తప్పుకోవాలని చూస్తున్నారు. ఒక విధంగా 2024 ఎన్నికలే వారికి చివరివి అని కూడా ప్రచారంలో ఉంది. మరి రాజకీయంగా పోరు ఏదీ లేనపుడు స్నేహమే మళ్ళీ చిగురిస్తుంది కదా అన్నదే ఇపుడు వారి విషయంలో నిజం అయింది అని అంటున్నారు మొత్తానికి ఇద్దరు సీనియర్ నేతలు కలిసి మెలసి ముందుకు సాగడం జిల్లాకూ పార్టీకి కూడా మేలు చేస్తుందని అంతా అంటున్నారు.

Tags:    

Similar News