పెట్రో బాదుడేమో కానీ.. తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు పండుగే!

అవును.. ఇప్పుడో సిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. సాధార‌ణంగా ప్ర‌జ‌ల‌కు భారం క‌లిగే నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి ప్ర‌భుత్వాలు వెనుకంజ వేస్తాయి.

Update: 2026-05-25 10:30 GMT

అవును.. ఇప్పుడో సిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. సాధార‌ణంగా ప్ర‌జ‌ల‌కు భారం క‌లిగే నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి ప్ర‌భుత్వాలు వెనుకంజ వేస్తాయి. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప‌న్ను భారాన్ని మోపాల్సి వస్తే.. ఒక‌టికి నాలుగుసార్లు ఆలోచించే ప‌రిస్థితి. అందుకు భిన్నంగా పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల పెంపు వేళ‌.. సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు ప‌డే దుస్థితి.

అందుకు ప్ర‌తిగా దేశంలో మ‌రే రాష్ట్రాల్లోనూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కాసుల వ‌ర్షం కురిసే ప‌రిస్థితి. సామాన్యుడి మీద భారం.. రాష్ట్ర ఖ‌జానాకు కాసుల గ‌ల‌గ‌లు. ఎందుకిలా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. అంత‌కంత‌కూ పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌ల వేళ‌.. త‌న‌కు అద‌నంగా స‌మ‌కూరే ప‌న్ను ఆదాయాన్ని ప్ర‌జ‌ల‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఎందుకు బ‌దిలీ చేయ‌వు? అన్న‌ది ప్ర‌శ్న‌.

అర్థం కాలేదా? అయితే.. వివ‌రంగా చెబితే అస‌లు విష‌యం అర్థం కావ‌ట‌మే కాదు.. ఔరా అంటూ ముక్కున వేలేసుకునే ప‌రిస్థితి.

అంత‌ర్జాతీయంగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్రం పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. అప్ప‌టికి.. నాలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ధ‌ర‌ల్ని పెంచ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఎన్నిక‌లు ముగిసిన కొద్ది రోజుల‌కే బాదుడు మొద‌లు పెట్టింది. ఇదంతా తెలిసిన విష‌యాలే. ఇప్పుడు చెప్పే అస‌లు విష‌యంలోకి వెళితే.. ఆశ్చ‌ర్యానికి గురి కావాల్సిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ‌ల్లో ఉన్న విలువ ఆధారిత ప‌న్ను విధాన‌మే. మిగిలిన వ‌స్తు సేవ‌ల మీద జీఎస్టీ విధానం అమ‌ల్లో ఉంటే.. పెట్రోల్.. డీజిల్ మీద మాత్రం వ్యాట్ విధానంలో ప‌న్ను వేస్తారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే.. ఈ ప‌న్ను భారం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ‌. దీంతో.. పెట్రోల్.. డీజిల్ అమ్మ‌కాల ద్వారా రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి. ఈ కారుణంగా కేంద్రం ధ‌ర‌లు పెంచిన ప్ర‌తిసారీ సామాన్య ప్ర‌జ‌ల మీద భారంగా మారితే.. తెలుగు రాష్ట్రాల ఖ‌జానాకు మాత్రం అద‌నంగా ప‌న్ను ఆదాయం ల‌భించే ప‌రిస్థితి.

పెట్రోల్ మీద తెలంగాణ‌లో అత్య‌ధికంగా 35.20 శాతం వ్యాట్ ను వ‌సూలు చేస్తారు. దేశంలోనే ఇదెక్కువ‌. అదే స‌మ‌యంలో ఏపీ విష‌యానికి వ‌స్తే.. 31 శాతం వ్యాట్.. లీట‌రుకు రూ.4 చొప్పున స్థిర వ్యాట్ తో పాటు మ‌రో రూపాయిని రోడ్డు సెస్ కింద వ‌సూలు చేస్తారు.

డీజిల్ విష‌యానికి వ‌స్తే తెలంగాణ‌లో 27 శాతం వ్యాట్ వ‌సూలు చేస్తుంటే.. ఏపీలో 22.25 శాతం వ్యాట్ తో పాటు లీట‌రుకు నాలుగు రూపాయిల అద‌న‌పు వ్యాట్.. మ‌రో రూపాయి రోడ్ సెస్ కింద వ‌సూలు చేస్తారు. ఈ ప‌న్ను బాదుడు దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే తెలుగు స్టేట్స్ లో ఎక్కువ‌.

స‌గ‌టున రోజువారీ ఇంధ‌న వినియోగం తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. తెలంగాణ‌లో ప్ర‌తి రోజూ 58.8 ల‌క్షల లీట‌ర్లు.. డీజిల్ 73.4 ల‌క్ష‌ల లీట‌ర్ల అమ్మ‌కాలు సాగుతుంటాయి. ఏపీ విష‌యానికి వ‌స్తే.. పెట్రోల్ 62 ల‌క్ష‌ల లీట‌ర్లు.. డీజిల్ 98ల‌క్ష‌ల లీట‌ర్ల వినియోగం జ‌రుగుతుంది. ఈ లెక్క‌లు ఇలా ఉంటే.. గ‌డిచిన ప‌ది రోజుల్లో నాలుగు ద‌ఫాలుగా పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఏడాదికి ల‌భించే అద‌న‌పు ఆదాయం ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ.1100 కోట్లు. ఒక‌వేళ‌.. రానున్న రోజుల్లో మ‌రింత‌గా ధ‌ర‌లు పెరిగితే.. ఈ ఆదాయం మ‌రింత పెర‌గ‌నుంది. ఇలాంటి వేళ‌లో.. ప్ర‌జ‌ల మీద అద‌న‌పు భారం ప‌డ‌కుండా త‌మ వంతు ప్ర‌య‌త్నంగా.. త‌మ‌కు ల‌భించే అద‌న‌పు ఆదాయాన్ని ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లిస్తే.. వారి మీద ప‌డే అద‌న‌పు భారం అంతో ఇంతో త‌గ్గుతుంది. మ‌రో ఆస‌క్తిక‌ర అంశం ఏమంటే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు పెట్రోల్.. డీజిల్ అమ్మ‌కాల‌తో ఏడాదికి వ‌చ్చే ఆదాయం ఎంతో తెలుసా? తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర రూ.12వేల కోట్లు అయితే ఏపీకి సుమారు 11,500- రూ.12,500 కోట్ల భారీ ఆదాయం ల‌భిస్తుంది. దీనికి అద‌నంగా పెరిగిన ధ‌ర‌ల‌తో వ‌చ్చే ఆదాయం రూ1100 కోట్లు. మ‌రి.. అంత‌కంత‌కూ పెరుగుతున్న ధ‌ర‌ల‌కు అనుగుణంగా వ‌చ్చే ఆదాయాన్ని ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లించేలా తెలుగు ముఖ్య‌మంత్రులు నిర్ణ‌యం తీసుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News