రీల్ కాదు రియ‌ల్.. అమ్మాయి కోసం కార్ల‌తో కొట్టేసుకున్నారు

సినిమాల్లో మాత్ర‌మే క‌నిపించే సీన్లు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ రియ‌ల్ లైఫ్ లోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

Update: 2026-05-22 05:15 GMT

సినిమాల్లో మాత్ర‌మే క‌నిపించే సీన్లు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ రియ‌ల్ లైఫ్ లోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. డ‌బ్బు.. రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉంటే చాలు.. తామేం చేసినా న‌డిచిపోతుంద‌న్న తీరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీంతో.. ఇంత‌కాలం రీల్ లైఫ్ లో మాత్ర‌మే ద‌ర్శ‌న‌మిచ్చే ఉదంతాలు ఇప్పుడు రియ‌ల్ లైఫ్ లోనూ క‌నిపిస్తున్న ప‌రిస్థితి. అలాంటి ఉదంత‌మే ఒక‌టి విజ‌య‌వాడ న‌డిరోడ్డు మీద చోటు చేసుకుంది. ఒక యువ‌తి విష‌యంలో చోటు చేసుకున్న వివాదం.. చివ‌ర‌కు ఇద్ద‌రు యువ‌కులు త‌మ ఖ‌రీదైన‌కార్ల‌తో ఢీ కొట్టుకోవ‌టం (గుద్దుకోవ‌టం).. ఈ క్ర‌మంలో స్థానికులు భ‌య‌భ్రాంతులై ప‌రుగులు తీసిన ప‌రిస్థితి. విజ‌య‌వాడ‌లో పెను సంచ‌న‌లంగా మారిన ఈ ఉదంతంలో పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంతా అయ్యాక స్టేష‌న్ కు సీన్ షిప్టు అయ్యేలా ఇప్పుడీ ఇష్యూ విజ‌య‌వాడ‌లోని ప‌డ‌మ‌ట పోలీసు స్టేష‌న్ లో ఉంది. ఇంత‌టి ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణాలేంటి? ఇంత‌కూ న‌డిరోడ్డు మీద ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన ఆ ఇద్ద‌రు యువ‌కులు ఎవ‌రు? వారి నేప‌థ్యం ఏంటి? లాంటి అంశాల్లోకి వెళితే.. అస‌లు ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటాయో అర్థ‌మ‌వుతుంది.

షాకింగ్ నిజం ఏమంటే.. న‌డిరోడ్డు మీద ఇంత‌టి ర‌చ్చ చేసిన ఇద్ద‌రు యువ‌కులు చిన్న‌నాటి స్నేహితులు కావ‌టం. ఒక యువ‌తి విష‌యం ఇద్ద‌రు స్నేహితుల‌ను శ‌త్రువులుగా మార్చ‌ట‌మే కాదు.. ఒక‌రి సంగ‌తి మ‌రొక‌రు చూసుకోవాల‌న్న పంతం వ‌ర‌కు వెళ్లింది. ఈ ఇష్యూకు కార‌ణ‌మైన ఇద్ద‌రు యువ‌కుల్లో ఒక‌రు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి లింగ‌మ‌నేని రోహిత్. మ‌రొక‌రు విజయవాడ భారతీనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బొల్లా ఓమ్. ఇద్ద‌రు చిన్న‌నాటి స్నేహితులు. ఒక యువ‌తి విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలంగా వివాదం న‌డుస్తోంది. ఒక‌రు గురించి మ‌రొక‌రు త‌ప్పుగా మాట్లాడుకుంటున్నార‌న్న అనుమానం తాజా వివాదానికి ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రు ఫోన్ లో మాట్లాడుకోవ‌టం.. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగి.. ఒక‌రికొక‌రు స‌వాళ్లు విసురుకున్నారు.

వీరిద్ద‌రి మ‌ధ్య హాట్ హాట్ గా ఫోన్ సంభాష‌ణ సాగిన స‌మ‌యంలో తాను ప‌ట‌మ‌ట ఆర్ ఆర్ గార్డెన్ లోని హైటెన్ష‌న్ రోడ్డులో ఉన్నాన‌ని రోహిత్ చెప్ప‌టం.. తాను అక్క‌డికి వ‌స్తున్న‌ట్లుగా ఓమ్ చెప్పారు. ఆవేశంతో థార్ జీపుతో బొల్లా ఓమ్ అక్క‌డికి చేరుకోవ‌ట‌మే కాదు వ‌చ్చీ రాగానే త‌న జీపును నేరుగా రోహిత్ కారును ఢీ కొన్నారు. అందుకు ప్ర‌తిగా రోహిత్ సైతం త‌న కారుతో ఓమ్ థార్ వాహ‌నాన్ని ఢీ కొన‌టంతో ఈ ఇష్యూ మ‌రింత‌గా పెరిగి... స్ట్రీట్ ఫైట్ గా మారింది. వీరి దెబ్బ‌కు స్థానికులు భ‌యంతో ప‌రుగులు తీశారు.

ఓమ్ తో మ‌రికొంద‌రు రావ‌టం.. వారంతా రాడ్లు తీసుకొని రోహిత్ కారుపై దాడికి దిగారు. ఈ సంద‌ర్భంగా రోహిత్ కారుకు పంక్చ‌ర్ కావ‌టంతో అక్క‌డి నుంచి అత‌ను పారిపోయాడు. ఇదంతా రాత్రి వేళ‌లో చోటు చేసుకుంది. పోలీసుల నిఘా త‌క్కువ‌గా ఉండే ఈ ప్రాంతాన్ని త‌మ అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి ఎంచుకున్న‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హైటెన్ష‌న్ రోడ్డె మీద త‌మ ఖ‌రీదైన కార్ల‌ను రేసింగ్ త‌ర‌హాలో దూసుకెళ్లేలా చేసి.. ఒక‌రికొక‌రు ఎదురెదురుగా ఢీ కొట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం గ‌మ‌నార్హం. దీంతో పెద్ద ఎత్తున శ‌బ్దాలు..కార్ల‌నుంచి పొగ‌లు వ‌చ్చాయి. అర్థ‌రాత్రి వేళ జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఆ స‌మ‌యంలో రోడ్ల మీద ఉన్న వారైతే.. ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీశారు.

వీరి ర‌చ్చ‌కు సంబంధించిన అంశాలు సీసీ కెమేరాలో స్ప‌ష్టంగా న‌మోద‌య్యాయి. ఈ ఉదంతం గురించి స‌మాచారం అందుకున్నంత‌నే సీఐ ప‌వ‌న్ కిషోర్ అక్క‌డ‌కు చేరుకొని..ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్యాంగ్ వార్ త‌ర‌హాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌న‌లంగా మారింది. ఒక‌రి కారుతో మ‌రో కారును ఢీ కొనే వేళ‌లో కార్ల వేగం ఎంత‌న్న విష‌యాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందుకోసం ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని తీసుకుంటున్నారు.

ఓమ్, రోహిత్ బ్యాక్ గ్రౌండ్ విష‌యానికి వ‌స్తే.. ఇందులో బొల్లా ఓమ్ వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి ర‌మేష్ కు అత్యంత స‌న్నిహిత బంధువుగా చెబుతున్నారు. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా నిర్వ‌హించిన వేడుక‌ల‌ను భారీగా నిర్వ‌హించ‌టం.. పెద్ద ఎత్తున కార్లు.. జీపుల‌తో భారీ ర్యాలీలో ఓమ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతారు. ఇక‌.. లింగ‌మనేని రోహిత్ విష‌యానికి వ‌స్తే.. ఒక సంప‌న్న కుటుంబానికి చెందిన యువ‌కుడిగా చెబుతున్నారు. విజ‌య‌వాడ‌లోని ఒక ఫేమ‌స్ కాలేజీలో బీటెక్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. రాజ‌కీయాల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధాలు లేన‌ప్ప‌టికి.. బ‌ల‌మైన ఆర్థిక‌.. సామాజిక నేప‌థ్యం ఉన్న కుటుంబంగా చెబుతున్నారు. రెండు సంప‌న్న కుటుంబాల‌కు చెందిన ఇద్ద‌రు యువ‌కులు బాధ్య‌త మ‌రిచి.. రోడ్ల మీద ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన తీరుపై పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. లేదంటే రాబోయే రోజుల్లో ఈ త‌ర‌హా ఉదంతాలు మ‌రింత పెర‌గ‌టం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రేం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News