భారతీయ రైల్వే విప్లవం.. విదేశీయుడిని ఆశ్చర్యపరిచిన ఫుడ్ డెలివరీ!

మనలో చాలా మందికి రైలులో ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం మామూలే అయినా, అతనికి మాత్రం ఇదో నమ్మలేని అనుభవం.;

Update: 2025-04-12 17:30 GMT

భారతదేశంలో ఫుడ్ డెలివరీలు సాధారణ విషయంగా మారాయి. రెస్టారెంట్ నుండి ఇంటికే కాదు, ఇప్పుడు రైలులో ప్రయాణిస్తున్న వారికి కూడా ఫుడ్ డెలివరీ సులభంగా చేస్తున్నారు. ఇది చాలా సాధారణ విషయంగా అనిపించవచ్చు.. కానీ చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది సాధ్యం కాదు. ఈ విషయాన్ని భారతదేశంలోని చాలా మంది విదేశీయులు ఒక కలగా భావిస్తారు. బ్రిటిష్ యూట్యూబర్ జార్జ్ బక్లీ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. వారణాసికి రైలు ప్రయాణంలో జార్జ్ మొదటిసారి రైలులో ఆన్‌లైన్ ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. కరెక్ట్ టైమ్‌కి ఫుడ్ డెలివరీ కావడంతో అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "యూకే భారతదేశం నుంచి ఈ విషయం నేర్చుకోవాలి" అని యూట్యూబర్ అన్నాడు.

బక్లీ వారణాసి వెళ్లేందుకు ఏసీ ఫస్ట్-క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు. అతనికి ఆకలి వేసింది. తాను ప్రయాణిస్తున్న ట్రైన్ నెక్ట్స్ స్టేషన్ కాన్పూర్. తాను ప్రయాణిస్తున్న ట్రైన్ కాన్పూర్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఆగుతుందని షెడ్యూల్ ఉంది. ఏదైతే అది అవుతుందని రెండు గంటల ముందే ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా శాండ్‌విచ్, మిల్క్‌షేక్ ఆర్డర్ చేశాడు. ట్రైన్ కాన్పూర్‌కి చేరుకుంది. తన ఆర్డర్ కోసం తాను ప్రయాణిస్తున్న బోగీలో వేచి చూస్తున్నాడు. ఆ సమయంలోనే తన ఆర్డర్ సమయానికి పర్ఫెక్ట్‌గా డెలివరీ కావడం అతన్ని ఆశ్చర్యపరిచింది. తన సీటు వద్దకు డెలివరీ బాయ్ వచ్చి శాండ్‌విచ్ అందజేశాడు.

మనలో చాలా మందికి రైలులో ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం మామూలే అయినా, అతనికి మాత్రం ఇదో నమ్మలేని అనుభవం. భారతదేశంలో అంత టెక్నాలజీ ఉందా? అని జార్జ్ ఆశ్చర్యపోయాడు. జార్జ్ ఆ మొత్తం సంఘటనను వీడియో తీశాడు. బక్లీ తన వీడియోలో ఈ మొత్తం ప్రాసెస్‌ను యాప్‌లో ఆర్డర్ చేయడం దగ్గర్నుంచి, తన సీటు వద్ద శాండ్‌విచ్ అందుకోవడం వరకు వివరంగా రికార్డ్ చేశాడు. వీడియోలో అతను చాలా ఎగ్జైట్‌మెంట్‌తో, ఆశ్చర్యంతో కనిపించాడు. "నేను ఇండియాలో ట్రైన్‌లో ఫుడ్ డెలివరీ తీసుకుంటున్నాను. నమ్మకపోతే, కాసేపు ఆగండి చూపిస్తా" అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. డెలివరీ బాయ్ అతనితో సెల్ఫీ దిగి వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ విషయంలో యూకే భారత్ నుండి నేర్చుకోవాలని జార్జ్ అన్నాడు.

భారతదేశంలో రైల్వే ప్రయాణం ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ఒకటి రైలులో ఫుడ్ డెలివరీ. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని, తమ సీటు వద్దకే తెప్పించుకునే సౌకర్యం కల్పించింది. ఇది విదేశీయులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

Tags:    

Similar News