కో పైలట్ పగ .. నిద్రపోయిన నిఘా !
ఫ్లైదుబాయ్ కన్నా ముందు 2020 - 2024 మధ్య ఒమన్ ఎయిర్ లో పనిచేశాడు. ఇతనికి ఉన్న తీవ్రవాద భావాల కారణంగా డెస్క్ జాబ్ ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
హమామ్ అల్-హమ్మామీ. ఫ్లై దుబాయ్ లో కో పైలట్. 29 ఏళ్ల ఒమన్ జాతీయుడు. అతనికి ప్రత్యక్ష్యంగా ఉగ్రవాద సంస్థలతో ఎక్కడా సంబంధాలు ఉన్నట్లు ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. ఏవైనా ఉగ్రవాద సంస్థలు అతన్ని ప్రేరేపించాయా ? అంటే ఎలాంటి ఆధారాలు లేవు. కానీ విమానం హైజాక్ చేసి పెద్ద మొత్తంలో ప్రాణనష్టం కలిగించాలని ప్రయత్నించాడు. కానీ పైలట్ సమయస్ఫూర్థితో అతని లక్ష్యం నెరవేరలేదు. ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటకు వస్తుండడం ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఏం చేయాలనుకున్నాడు ?
దుబాయ్ నుండి టెలీ అవీవ్ కు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేయాలి. దానిని ఇజ్రాయిల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం ప్యాసింజర్ టర్మినల్ మీద కూల్చాలి అన్నది హమామ్ అల్-హమ్మామీ ఉద్దేశం. టెల్ అవీవ్ విమానాల మార్గం అప్పటికే రెండు సార్లు పరిశీలించడంతో పాటు, ఆ విమానాశ్రయం గురించి తెలుసుకున్నాడు. కాక్ పిట్ లో కెప్టెన్ స్మిత్ మచ్చర్ మీద దాడి చేసి విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలన్నది అతని పథకం. అయితే మచ్చర్ ధైర్య సాహసాల ముందు అతని కుట్రలు నెరవేరలేదు. ఏకంగా 9/11 తరహాలో దాడి చేయాలన్నది అతని ఉద్దేశం అన్న సమాచారం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది.
ఎలా ప్రభావితం అయ్యాడు ?
2017లో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో చదువుతున్నప్పుడు మై సెంటర్ అనే ఇస్లామిక్ కేంద్రం ద్వారా కొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. దానిని లెబనీస్ కు చెందిన అబూ హంజా అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఉగ్రవాద సాహిత్యం ప్రభావం చూపిందని సమాచారం. అయితే అక్కడి కేంద్రం కానీ, అబుహంజా గానీ ఈ దాడికి ప్రేరేపించిన దాఖలాలు లేవు.
ఎక్కడ పనిచేశాడు ?
ఫ్లైదుబాయ్ కన్నా ముందు 2020 - 2024 మధ్య ఒమన్ ఎయిర్ లో పనిచేశాడు. ఇతనికి ఉన్న తీవ్రవాద భావాల కారణంగా డెస్క్ జాబ్ ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2025లో రాయల్ ఎయిర్ మరాక్ లో శిక్షణ పొందినా, ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ ఏడాది జనవరిలో ఫ్లైదుబాయ్ లో చేరాడు.
భద్రతా వైఫల్యం ఉందా ?
ఫ్లై దుబాయ్ రిక్రూట్ మెంట్ లో ప్రొఫెషనల్, సెక్యూరిటీ చెక్స్ అన్ని పరీక్షల్లో పాసయ్యాడు. ఎక్కడా ఉగ్రవాద భావాలు గుర్తించబడలేదు. ఒమర్ ఎయిర్ లైన్స్ లో అతనిని డెస్క్ ఉద్యోగానికి పరిమితం చేసిన విషయం ఇక్కడ ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలను సూక్ష్మంగా పరిశీలించకపోవడం భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు.
మొత్తానికి ఇరాన్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఎక్కడా నిర్ధారణ కావడం కానీ, ఆధారాలు లభించడం కానీ జరగలేదు. సంఘటనకు ముందు ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలను ఎక్కువగా చూశాడని, కాక్ పిట్ లో పోరాడేందుకు ప్రైవేటు కోచ్ వద్ద బాక్సింగ్ నేర్చుకున్నాడని సమాచారం. 9/11 ఆదర్శంగా ఇజ్రాయిల్ మీద ఆత్మాహుతి దాడి చేయడం మతపరమైన విధిగా భావించినట్లు సమాచారం. మొత్తానికి ఒంటరిగా ఇంతపెద్ద ఘటనకు ప్రయత్నించడం దిగ్భ్రాంతికర అంశం. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.