ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆ ఐదుగురికి అగ్ని పరీక్ష
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలు కీలకంగా మారాయి.;
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రులకు ఈ ఎన్నికలు సవాల్ విసురుతున్నాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి మినహా మిగిలిన నలుగురు నేతలకు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే నేపథ్యం ఉండటంతో ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, విజయన్, మమతా బెనర్జీ ఈ ఎన్నికలను చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో పుదుచ్చేరి కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతం. అయినప్పటికీ అక్కడి ఎన్నికపైనా జాతీయస్థాయిలో ఆసక్తి నెలకొంది. ఇక బీజేపీకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ సారి ప్రస్తుత ప్రభుత్వాలను గద్దె దించాలనే పట్టుదలతో కాషాయ దళం పనిచేస్తోంది. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యక్తిగత ప్రతిష్టగా మార్చుకున్నారని చెబుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ జోరుకు బ్రేక్ వేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్యకంగా అడుగులు వేస్తోంది. దీంతో అసోం అసెంబ్లీ పోరు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గెలవాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. అయితే ఆమె జోరుకు బ్రేకులు వేసేలా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సువేంధు అధికారిని ముందుపెట్టి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పై గట్టి ప్రణాళికలు రచిస్తున్నారని చెబుతున్నారు. దీంతో కేంద్రాన్ని ఎదుర్కొని అధికారాన్ని నిలబెట్టుకోవడం మమతా బెనర్జీకి కత్తిమీద సాములా మారిందని అంటున్నారు. ఇప్పటికే కేంద్ర సంస్థల నుంచి సుప్రీంకోర్టు వరకు బెంగాల్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్లు వస్తున్న కథనాలు ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చేస్తున్నాయి.
ఇదే పరిస్థితి తమిళనాడులోనూ కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న ఏఐడీఎంకే కూటమిని అధికారంలోకి తేవాలని బీజేపీ పెద్దలు స్కెచ్ వేస్తున్నారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోమారు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉన్న స్టాలిన్ ను పదవీచ్యుతుడిని చేయాలని బీజేపీ అన్నివిధాల ప్రయత్నిస్తోంది. ఇక ఈ రాష్ట్రంలో తాజా రాజకీయ సంచలనంగా భావిస్తున్న సినీ నటుడు దళపతి విజయ్ ప్రారంభించిన పార్టీ కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తోందని విశ్లేషిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు.
మరోవైపు అసోంలో బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ, కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. అసోంలో ఐదేళ్లుగా పార్టీని ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడుపుతున్న హిమంత బిశ్వశర్మ ఈ ఎన్నికల భారాన్ని ఒక్కరే మోస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన జోరుకు కళ్లెం వేసేలా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 3జీగా పేరు తెచ్చుకున్న గౌరవ్ గొగోయ్, అఖిల్ గొగోయ్, లురింజ్యోతి గొగోయ్ కలిసికట్టుగా పనిచేస్తుండటంతో హిమంత బిశ్వశర్మ చెమటోడ్చుతున్నారని చెబుతున్నారు. ఇక కేరళంలో పదేళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని, మళ్లీ అధికారంలోకి రావడం అంటే అంత తేలికేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చేసే మ్యాజిక్ ను అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
నాలుగు పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికల పోరు ఈ విధంగా సాగుతుండగా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సైతం ప్రజానాడి అంతుచిక్కని విధంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. మరో మూడు రోజుల్లో పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. సినీ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే ఇక్కడ 30 స్థానాల్లో పోటీ చేస్తోంది. దీంతో ఫలితాలపై అంచనా వేయడం కష్టంగా ఉందని అంటున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రంగస్వామి నాయకత్వానికి ఈ ఎన్నికలు పరీక్ష పెడుతున్నాయని చెబుతున్నారు. పుదుచ్చేరి చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రంగస్వామికి ఈ సారి నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, మౌలిక సదుపాయాల లేమి వంటి అంశాలు సవాల్ విసురుతున్నట్లు చెబుతున్నారు. వీటిని అధిగమించి ఐదోసారి ముఖ్యమంత్రి కావాలని రంగస్వామి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఐదు రాష్ట్రాల్లో పోరు తీవ్ర ఉత్కంఠగా సాగుతోందని విశ్లేషిస్తున్నారు.