36 గంటలుగా సముద్రంలో బాలుడు... చెక్కే సంజీవని - జాలర్లే దేవుళ్లు!

సముద్రంలో కొట్టుకుపోతున్న సమయంలో చేతికి దొరికిన ఒక చెక్కను ఆసరాగా చేసుకొని 36 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు.

Update: 2023-10-02 05:44 GMT

నేల మీద నూకలుంటే ఎంత పెద్ద ప్రమాధం నుంచైనా.. మరెంత పెను విపత్తునుంచైనా బయటపడతారని అంటుంటారు. భూకంప శిధిలాల కింద కొన్ని రోజులపాటు నీరూ, ఆహారం, ఆఖరికి కదలికలు కూడా లేకుండా బ్రతికి బట్టకట్టిన ఎన్నో సంఘటనలు అప్పుడప్పుడూ దర్శనమిస్తుంటాయి. అది చూసినవారు... వీరిది గట్టి పిండం అని కామెంట్ చేస్తుంటారు. దాదాపు ఇదే స్థాయిలో తాజాగా 14ఏళ్ల బాలుడి ఉదంతం తెరపైకి వచ్చింది.

అవును... గుజరాత్‌ సముద్రంలో కొట్టుకుపోయిన ఓ బాలుడు ఊహించని రీతిలో బయటపడ్డాడు. సముద్రంలో కొట్టుకుపోతున్న సమయంలో చేతికి దొరికిన ఒక చెక్కను ఆసరాగా చేసుకొని 36 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా కడలిలో దొరికిన ఒక చెక్కను ఆసరాగా చేసుకుని అన్ని గంటలు ప్రాణాలు నిలబెట్టుకోవడం సామాన్య విషయం కాదని అంటున్నారు విషయం తెలిసినవాళ్లు.

వివరాళ్లోకి వెళ్తే... సూరత్ కు చెందిన వికాస్ దేవి పూజక్ అనే బాలుడు.. లక్ష్మణ్ అనే మరో బాలుడితో కలిసి మూడు రోజుల క్రితం సూరత్‌ లోని డుమాస్ బీచ్‌ కు సరదగా వెళ్లాడు. ఈ క్రమంలో కొద్దిసేపు తీరంలో ఆటలాడుకుంటుండగా... అనూహ్యంగా విరుచుకుపడిన అలలు సముద్రంలోకి లాక్కెళ్లిపోయాయి. ఈ సమయంలో లక్ష్మణ్‌ అనే బాలుడిని స్థానికులు రక్షించగా... వికాస్ గల్లంతయ్యాడు.

దీంతో వికాస్ ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలించాయి. అయినా అతడి జాడ లభించలేదు. బాలుడు గల్లంతై దాదాపు 24 గంటలు గడిచిపోవడంతో కుటుంబ సభ్యుల్లోనూ ఆశలు సన్నగిల్లాయి. ఇంతలో ఒక అద్భుతం జరిగింది.. శాస్వతంగా దూరమైపోయాడనుకున్న కుమారుడు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు.

Read more!

గణపతి విగ్రహాలు తయారీకి కింద భాగంలో చెక్కను వినియోగిస్తారనేది తెలిసిన విషయమే. అయితే... గణేష్ నిమజ్జనం తర్వాత అలా ఉపయోగించిన చెక్క ఒకటి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఈ సమయంలో గల్లంతైన బాలుడికి అనూహ్యంగా ఆ చెక్క దొరికింది. దీంతో దాన్ని ఆసరాగా చేసుకున్న బాలుడు ప్రాణాలు నిలుపుకోగలిగాడు.

మరోపక్క ఐదు రోజుల కింద చేపల వేటకు వెళ్లిన జాలర్లు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో వారికి సముద్రంలో ఓ చేయి పైకి లేచి ఉండటం కనిపించింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా బాలుడు కనిపించాడు. హుటాహుటున అతన్ని పైకి లాగి తమతో ఒడ్డుకు తీసుకువచ్చారు. అలా బాలుడిపాలిట చెక్క సంజీవని అవగా.. జాలర్లు దేవుళ్లయ్యారు అంటూ స్థానికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట!

Tags:    

Similar News