మూవీ టికెట్ల మీదా 5 శాతం జీఎస్టీ.. ఏం జరుగుతుందో?

ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ శ్లాబుల్ని తగ్గించే దిశగా కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-08-27 09:16 GMT

ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ శ్లాబుల్ని తగ్గించే దిశగా కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచి తాజాగా వచ్చిన డిమాండ్ సమంజసంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ డిమాండ్ ను మల్టీఫ్లెక్సులతో పాటు.. అన్ని థియేటర్లకు అమలు చేయాల్సిన అవసరం ఉంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

ఓవైపు ఓటీటీలు.. మరోవైపు మల్టీఫ్లెక్సులు విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో జీఎస్టీ పన్ను బాదుడు నుంచి రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ చట్టంలో పేర్కొన్న ప్రకారం రూ.100కు మించిన సినిమా టికెట్లను 18 శాతం శ్లాబు పరిధిలో ఉంచారు. అదే రూ.100 లోపు అయితే 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్లాబుల్ని మార్చాలన్న అంశంపై కసరత్తు జరుగుతున్న వేళ.. రూ.300 వరకు ఉన్న టికెట్లపై 5 శాతం జీఎస్టీ.. అంతకు మించిన టికెట్ ధరలు ఉంటే 18 శాతం జీఎస్టీని అమలు చేయాలన్న మాట ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

నిజానికి సింగిల్ థియేటర్ యజమానులకు ఊరట కల్పించేలా.. రూ.100 టికెట్ ధర వరకు ఎలాంటి జీఎస్టీ వసూలు చేయకుంటే.. వారి వ్యాపారానికి మరింత మేలు చేసినట్లు అవుతుంది. పన్ను బాదుడు లేని నేపథ్యంలో టికెట్ ధరలు తక్కువ అయ్యే అవకాశం ఉంది. అది ప్రేక్షకుల్ని థియేటర్ కు మరింత దగ్గర చేసే అవకాశం ఉంది. మల్టీ ఫ్లెక్సుల్లో అమ్మే ఆహార పదార్థాల మీద కూడా 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అంతేకాదు.. ఆహారం.. డ్రింక్స్ ను రెస్టారెంట్ సేవలుగా పరిగణిస్తూ ఇన్ ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయాన్ని కల్పించటం లేదు. అయితే.. ఈ విషయంలోనూ మార్పులు తీసుకురావటం ద్వారా.. థియేటర్లలో ఆహార పదార్థాల ధరలు తక్కువ అయ్యే వీలుంది. దేశంలొ దగ్గర దగ్గర 9 వేల స్క్రీన్లకు ప్రాతినిధ్యం వహించే మల్టిఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరుకుంటున్న జీఎస్టీ తగ్గింపు.. ఆ పరిశ్రమకు మాత్రమే కాదు.. ప్రేక్షకుల జేబు మీదా భారాన్ని తగ్గిస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News