రాహుల్ తో కలసి పోరాడరాదా జగన్ !

మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీది అదే బాధగా ఉంది. ఈవీఎంల వల్లనే తాము ఓటమి పాలు అయ్యామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.;

Update: 2025-07-04 03:32 GMT

ఈవీఎంల మీద దేశంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అదే పనిగా ఈసీ మీద ఈ విషయంలో డిమాండ్లు పెడుతున్నారు హర్యానా మహారాష్ట్ర ఎన్నికల మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల మీద తమకు డౌట్లు చాలా ఉన్నాయని రాహుల్ గాంధీ చెబుతూ వస్తున్నారు.

ఆయనే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఇదే విషయం మీద గట్టిగా మాట్లాడుతున్నారు. గత ఏడాది జరిగిన హర్యానా ఎన్నికల్లో వరసగా మూడోసారి బీజేపీ గెలిచింది. ఇక మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి గెలిచింది.

దీంతో ఈవీఎంల మీద తమకు ఎక్కడ లేని అనుమానాలూ పెరిగిపోతున్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు. అనూహ్య విజయాలు అప్రతిహత జయాలు బీజేపీకి మాత్రమే ఎలా దక్కుతున్నాయని ఆయన సూటిగా ధాటీగా ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంల మీద విపరీతమైన సందేహాలు తమకు ఎక్కువైపోతున్నాయని కూడా రాహుల్ గాంధీ అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీది అదే బాధగా ఉంది. ఈవీఎంల వల్లనే తాము ఓటమి పాలు అయ్యామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ మధ్యనే వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా రాయచోటి నియోజకవర్గంలో కొత్తగా పెరిగిన ముప్పయి వేల ఓట్లూ టీడీపీకే ఎలా పడతాయని లాజిక్ తో కూడిన ప్రశ్నను సంధించారు. అనంతపురం జిల్లాలో చూస్తే హిందూపురం లాంటి చోట్ల తమ పార్టీకి ఒక్క ఓటు పడని బూతులు ఉన్నాయని ఎలా సాధ్యమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అన్నింటి కంటే కూడా పోలింగ్ సాయంత్రం నుంచి రాత్రి దాకా జరిగిందే ఎక్కువ ఉందని అదెలా జరిగింది అని డౌట్లు తీస్తున్నారు. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళిన వైసీపీ నేతల బృందం చర్చించారు. ఈవీఎంల విషయంలో ఎన్నికల అధికారుల వ్యవహార శైలి మీద కూడా తమకు సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అందువల్ల ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ ద్వారానే జరపాలని వైసీపీ కోరుతోంది. అలా జరిగితేనే ప్రజల తీర్పునకు సార్ధకత చేకూరుతుందని కూడా చెబుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలు వద్దు అని చెప్పామని తెలిపారు. తమకు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదని కూడా ఈసీకి చెప్పామని అన్నారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా ఎపుడూ ముఖ్యంగా ఉంటుంది. ఎన్నికలు ఏ రూపంలో నిర్వహించాలన్న దాని మీద మెజారిటీ రాజకీయ పార్టీలు ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్నికల సంఘం కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయం మీద జాతీయ స్థాయిలో పోరాడుతున్న రాహుల్ గాంధీతో కలసి గట్టి పోరాటం చేయవచ్చు కదా అని వైసీపీకి సూచనలు వస్తున్నాయి.

కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు మహరాష్ట్రలో ఠాక్రే శివసేన తదితర పార్టీలు కూడా ఈవీఎంల తీరుని తప్పు పడుతున్నాయి. మరి అంతా కలసి అతి పెద్ద ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకుని వస్తేనే కదా ఈసీలో కదలిక వస్తుందని అంటున్నారు. అలా కాకుండా వినతిపత్రం ఇస్తే ఏమి జరుగుతుంది అన్న చర్చ సాగుతోంది. భావ సారూప్యత కలిగిన పార్టీలతో ఒకే రకమైన అంశాల మీద పోరాటడంలో తప్పు లేదన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News