"భారతీయ బడ్జెట్" అనేది ఏ గ్లోబల్ బిజినెస్ మొఘల్‌కైనా ఒక పెద్ద పరీక్షే... అందులో 'మస్క్' జుజుబీ అంతే..
ప్రపంచాన్ని వేలిముద్రతో ఏలేస్తున్న ఫ్యూచరిస్టిక్ ఐకాన్.. మిలియన్ల మందికి ఆరాధ్యదైవం అయిన మన ఎలాన్ మస్క్ బాస్‌కి ఇన్నాళ్లకు ఒక గట్టి కౌంటర్ పడేలా ఉంది.
ప్రపంచాన్ని వేలిముద్రతో ఏలేస్తున్న ఫ్యూచరిస్టిక్ ఐకాన్.. మిలియన్ల మందికి ఆరాధ్యదైవం అయిన మన ఎలాన్ మస్క్ బాస్‌కి ఇన్నాళ్లకు ఒక గట్టి కౌంటర్ పడేలా ఉంది. ఆకాశంలో రాకెట్లను అటు ఇటు తిప్పడం.. అంగారకుడి మీద ప్లాట్లు వేయడం.. ఎక్స్ లో నాలుగు పోస్టులేసి షేర్ మార్కెట్లను షేక్ చేయడం మస్క్ మామకు చిటికెలో పని కావచ్చు. కానీ మన భారతీయ టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టడం అంటే... సాదాసీదా మార్కెటింగ్ కాదయా ఎలాన్.. ఇది సాక్షాత్తూ ‘రియాలిటీ చెక్’
మీరు ఆకాశం నుంచి శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటర్నెట్ అందిస్తామంటే.. ఆహా, ఓహో అని చప్పట్లు కొట్టడానికి మనోళ్లు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే బిల్లు చూశాక "ఏంటి బాస్ ఇది?" అని ప్రశ్నించడం మనోళ్లకు పుట్టుకతో వచ్చిన హక్కు..
జియో జిందాబాద్ ఉన్న చోట.. స్టార్‌లింక్ కాస్ట్ వర్కవుట్ అవుతుందా?
భారతీయ వినియోగదారుడి మైండ్‌సెట్ అర్థం చేసుకోవడం టెక్నాలజీ డిజైన్ చేసినంత తేలిక కాదు. 2016 లో ఫ్రీ డేటా రుచి చూసినప్పటి నుంచి.. మనోళ్లకు ఇంటర్నెట్ అంటే "తక్కువ ధర.. ఎక్కువ డేటా" అని ఫిక్స్ అయిపోయింది. నెలకు ఒకట్రెండు వందలేసి రోజుకి జీబీల కొద్దీ డేటా వాడుకుంటూ దానికే ఉచితంగా ఓటీటీలూ.. కాలర్ ట్యూన్లూ ఆశించే కస్టమర్లు ఉన్న దేశం ఇది.
ఇలాంటి చోట మీ స్టార్‌లింక్ డిష్ తెచ్చి "ఇదిగోండి బాక్స్.. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు.. నెలవారీ బిల్లు వేలల్లో ఉంటుంది" అని చెప్తే.. సగటు భారతీయుడు ఇచ్చే సైలెంట్ లుక్ ముందు ఏ స్పేస్‌ఎక్స్ రాకెట్ కూడా నిలబడలేదు.. "అంత డబ్బు పెడితే ఇంట్లో రెండు కొత్త టీవీలు కొనుక్కుంటాం కదా సాంబా" అని ఉచిత సలహాలు కూడా ఇస్తారు.
అభ్యంతరాలు.. ప్రభుత్వ ప్రకటనలు..
మరోవైపు "అయ్యో.. భారత్‌లో నన్ను ఎదగనివ్వడం లేదు.. ఎవరో అడ్డుకుంటున్నారు" అని మస్క్ గారు చిన్నపిల్లాడిలా బుంగమూతి పెడితే మన కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గకుండా ఆన్సర్ ఇచ్చేసింది. "అబ్బే.. అలాంటిదేం లేదు సార్.. మన దగ్గర అంతా ఫెయిర్ గేమ్.. లైసెన్సులు ఇచ్చాం.. స్పెక్ట్రమ్ నిబంధనలు ఉన్నాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ చూసుకుంటున్నాం.. అందరికీ ఒకే రూల్" అని నర్మగర్భంగా తేల్చేసింది. అంటే నెపం బయటివాళ్ల మీద నెట్టేసి ఎస్కేప్ అయిపోదామంటే ఇక్కడ కుదరదు మరి..
మరి స్టార్‌లింక్‌కు దిక్కేంటి?
మరి ఈ ఎలన్ మస్క్ డివైజ్ ఎవరు కొంటారు? నగరాల్లో ఫైబర్ నెట్‌వర్క్, 5జీలు జోరుగా ఉన్నప్పుడు స్టార్‌లింక్ అవసరం పెద్దగా రాకపోవచ్చు. కానీ హిమాలయ కొండల్లో ఇంటర్నెట్ లేని మారుమూల గ్రామాల్లో సముద్రంలో ఉండే బోట్లలో ఉండేవాళ్లకు ఇది నిజంగానే వరప్రసాదం. అంటే మస్క్ పోటీ పడాల్సింది హైదరాబాద్, బెంగళూరు రోడ్లలో ఉండే రోజూవారీ నెటిజన్లతో కాదు.. కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాలతో.. ఆ దిశగా ఫోకస్ చేస్తే ఇండియాలో రాణిస్తాడు.
"భారతీయ బడ్జెట్" అనేది ఏ గ్లోబల్ బిజినెస్ మొఘల్‌కైనా ఒక పెద్ద పరీక్షే. టెక్నాలజీ ఎంత ఆకాశంలో ఉన్నా.. ధర మాత్రం భారతీయుడి జేబుకు అందుబాటులో ఉండాల్సిందే. కాబట్టి ఎలాన్ బాస్.. రాకెట్లు పంపడం ఆపి.. కాస్త రీఛార్జ్ ప్లాన్ల మీద డిస్కౌంట్లు ఆలోచించండి.. లేకపోతే ఇక్కడ పప్పులు ఉడకవు!