మోడీ వ్యతిరేకులంతా ఏకమయ్యారు.. బెంగళూరులో జంగ్ సైరెన్ మోగించారు
ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతున్న ఎస్‌ఐఆర్ అంశంతో పాటు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన డిమాండ్లపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
ఊరికే రారు మహానుభావులు అంటారు.. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను గడగడలాడించడానికి సామాజిక మాధ్యమాల 'కీబోర్డ్ యోధులు'.. వెండితెర నిరసనకారులు చివరకు స్టూడియో లైట్లు వదిలి ఒకే వేదికపైకి వచ్చేశారు.. ఇప్పటివరకు యూట్యూబ్ వీడియోల్లో వ్యూస్ పెంచుకుంటూ.. ఎక్స్ వేదికగా ఘాటు పోస్టులతో విరుచుకుపడే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, నిత్యం మోదీపై విమర్శలతో వార్తల్లో నిలిచే ప్రకాశ్ రాజ్, సీజేపీ నేత అభిజీత్ దీప్కేలు బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ వేదికగా 'విప్లవాత్మక' సమరానికి తెరలేపారు. డిజిటల్ స్క్రీన్‌ల వెనుక పక్కాగా తీసే వీడియోలతో విమర్శలు గుప్పించడమే కాకుండా.. ఈసారి క్షేత్రస్థాయికే వచ్చి "లైక్, షేర్, సబ్‌స్క్రైబ్" లెవల్లో నిరసనకు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన హాస్యానికి.. చర్చకు తావిస్తోంది.
దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర.. ప్రాధాన్యత కలిగిన పరిణామం చోటుచేసుకుంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, భారత ఎన్నికల వ్యవస్థ తీరుతెన్నులపై నిరంతరం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే వివిధ రంగాల ప్రముఖులు ఒకే తాటిపైకి రావడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియా వేదికగా మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ విశేష ప్రజాదరణ పొందిన ప్రముఖ యూట్యూబర్, రాజకీయ వ్యాఖ్యాత ధ్రువ్ రాఠీ, వైవిధ్యభరిత నటుడు ప్రకాశ్ రాజ్, సీజేపీ నేత అభిజీత్ దీప్కే తదితరులు కలిసి ఒకే నిరసన వేదికకు మద్దతు పలకడం సంచలనం సృష్టిస్తోంది.
బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో భారీ నిరసనకు పిలుపు
ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతున్న ఎస్‌ఐఆర్ అంశంతో పాటు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన డిమాండ్లపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోని చారిత్రాత్మక ఫ్రీడమ్ పార్క్ వేదికగా భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించాలని ధ్రువ్ రాఠీ, ప్రకాశ్ రాజ్, అభిజీత్ దీప్కే సంయుక్తంగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో కోరారు.
సాధారణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకే పరిమితమై తన రాజకీయ అభిప్రాయాలను వెల్లడించే ధ్రువ్ రాఠీ, ఈసారి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి నిరసనకు మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆయన సీజేపీ నాయకులతో కలిసి భాగస్వామ్యం వహిస్తూ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
రెండు నెలలుగా సాగుతున్న పోరాటం
ఎస్‌ఐఆర్ అంశాన్ని ప్రధాన అజెండాగా చేసుకుని గత రెండు నెలలుగా దేశంలోని అనేక ప్రధాన ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకత.. ఓటర్ల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ.. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై పలు ప్రజా సంఘాలు విపక్షాలు పోరాడుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరగనున్న ఈ పోరాటంలో ధ్రువ్ రాఠీ ప్రత్యక్షంగా భాగస్వామి కావడం వల్ల ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో మరింత విస్తృత ప్రచారం దక్కుతుందని నిర్వాహకులు బలంగా విశ్వసిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై సుదీర్ఘకాలంగా బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న ప్రకాశ్ రాజ్‌తో పాటు ధ్రువ్ రాఠీ కూడా తోడవడంతో ఈ వేదికపైకి రాజకీయ, మీడియా వర్గాల దృష్టి పడింది.
అక్టోబర్ 10న మరింత ఉధృతంగా కార్యచరణ?
బెంగళూరు నిరసనతో పాటు అక్టోబర్ 10న నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతున్న మరో భారీ జాతీయ స్థాయి కార్యక్రమంలోనూ ధ్రువ్ రాఠీ పాల్గొంటారా అనే ఆసక్తికర చర్చ మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ తాజా వీడియో విడుదల ద్వారా ఆయన ఈ రాజకీయ, సామాజిక ఉద్యమంలో మరింత క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
కేంద్ర అధికార పక్షాన్ని నిలదీసే డిజిటల్, సినీ, ప్రజాసంఘాల ప్రముఖులు ఒకే వేదికపైకి చేరడం బెంగళూరు నిరసన కార్యక్రమానికి ఒక ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. దీంతో ఫ్రీడమ్ పార్క్‌లో జరగబోయే ఈ జంగ్ సైరెన్ ప్రోగ్రామ్‌పై ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.