జగన్ హిందువుగా మారు...విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ !
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఒకనాటి సహచరుడు, తోడు నీడగా ఉండే వి విజయసాయిరెడ్డి షాక్ ఇచ్చేలా ఒక కీలక సలహా ఇచ్చారు.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఒకనాటి సహచరుడు, తోడు నీడగా ఉండే వి విజయసాయిరెడ్డి షాక్ ఇచ్చేలా ఒక కీలక సలహా ఇచ్చారు. జగన్ కి రెడ్డి ఓట్లు కావాలీ అంటే ముందు హిందువుగా మారాలి అని ఆయన సూచించారు. రెడ్డి పేరు తగిలించుకుని ఇటు హిందువులను అలాగే అవతల క్రైస్తవ మతం అనుసరిస్తూ ఆ మతస్తులను మభ్యపెడుతున్నారు అని జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని నిందించారు. జగన్ పూర్వీకులు క్రైస్తవ మతం పుచ్చుకున్నారు అని జగన్ కోరుకుంటే తిరిగి హిందువుగా మారవచ్చు అని విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు. ఆయన హిందూ మతం పుచ్చుకుంటాను అంటే తాను మనసారా స్వాగతిస్తాను అని అన్నారు.
రెడ్డి ఓట్లు కోరాలంటే :
జగన్ తన పేరు చివరిలో రెడ్డి తగిలించుకున్నది రెడ్డి ఓట్లు పొందేందుకే అని విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మతం వేరేది ఉంది అని అలాంటపుడు రెడ్డి ఎలా అవుతారు అని నిలదీశారు. ఆయన రెడ్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. జగన్ ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. ఇదిలా ఉంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక చర్చిలు ఏపీలో ఉన్నాయని ఆయన సంచలన గణాంకాలు బయటపెట్టారు. దాదాపుగా ఎనిమిది వేల దాకా చర్చిలు ఉన్నాయని అన్నారు. కేరళలో ఎక్కువగా క్రైస్తవ మతం అనుసరిస్తారు అని అక్కడ కూడా ఇన్ని చర్చిలు లేవని అన్నారు.
మత మార్పిడులు దారుణం :
ఏపీలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. బలవంతపు మత మార్పిడులకు అడ్డు కట్ట వేయకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలలోకి వెళ్లిపోయారని ఏపీకి కూడా అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. హిందువులు అంతా మేలుకోవాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. సొంత మతం గురించి మాట్లాడితే మతోన్మాదం అని ఎదురుదాడి చేస్తున్నారని అది తగదని ఆయన సూచించారు. హిందూ దేవాలయాలకు భక్తులు ఇచ్చే నిధుల నుంచి ఇతర మతాలకు ఏ విధంగా పారితోషికాలు ఇస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఏ మతానికి సంబంధించిన నిధులను ఆ మతానికే ఖర్చు చేయాలన్నది తమ పార్టీ విధానం అని ఆయన స్పష్టం చేశారు.
రాయలసీమ కోసం :
తమ కొత్త పార్టీ రాయలసీమ సంక్షేమం కోసం పని చేస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. రాయలసీమకు ఎలాంటి తాగు నీటి వనరులు లేవని అన్నారు. 50 టీఎంసీల నీరుని సైతం నిలువ చేసుకునే రిజర్వాయర్లు కూడా లేవని అన్నారు. గోదావరి నుంచి సముద్రంలోకి వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయని వాటి నుంచి వేయి టీఎంసీల నీరు రాయలసీమకు మళ్ళించేలా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రాయల సీమ విషయంలో చంద్రబాబు జగన్ ఇద్దరూ నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సొంత ప్రయోజనాలు తప్పించి ప్రజల కోసం పాటు పడడం లేదని ఆయన నిందించారు. రాయలసీమ ప్రగతి అని పెద్ద కబుర్లు చెబుతున్నారు తప్పించి ఆచరణలో అడుగు ముందుకు కదలడం లేదని ఆయన విమర్శించారు.