కొందరు మగాళ్లను చూస్తే ట్రాన్స్ జెండర్ అయ్యారా అనిపిస్తుంది: ఎలన్ మస్క్
టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ''ఇన్‌స్టాగ్రామ్ కేవలం అమ్మాయిల కోసమే'' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. సోషల్ మీడియాలో వినియోగదారుల అలవాట్లు, వారు పోస్ట్ చేసే కంటెంట్ వారి జీవితంలోని వివిధ దశలను ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై ఎక్స్ (ట్విట్టర్) లో జరుగుతున్న ఒక వైరల్ చర్చలో మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ అనేది పూర్తిగా మహిళలకు సంబంధించిన ప్లాట్‌ఫారమ్ అనేలా తనదైన శైలిలో కామెంట్స్ పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వైరల్ థ్రెడ్‌లో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ``థర్స్ట్ ట్రాప్స్` (ఆకర్షణీయమైన ఫోటోలు) పోస్ట్ చేయడం.. నిరంతరం స్టోరీలు అప్‌డేట్ చేయడం.. వండిన వంటకాల ఫోటోలు పెట్టడం వంటి అలవాట్లను సరదాగా విశ్లేషించారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ``ఇన్‌స్టాగ్రామ్ అనేది అమ్మాయిల కోసం`` అని ఒక చిన్న లైన్‌తో ట్వీట్ చేశారు. అయితే అంతటితో ఆగకుండా తన వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి వస్తున్న స్పందనలను చూసి ఆయన మరింత ఘాటుగా స్పందించారు. వయసు పైబడిన మగవారు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లింకులను తనకు పంపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
తన ఫాలో-అప్ పోస్ట్‌లో ఎలన్ మస్క్ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..``కొంతమంది ఎదిగిన పురుషులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను నాకు పంపుతుంటారు. అది చూసినప్పుడు నాకు మీరు జెండర్ ట్రాన్సిషన్ (లింగ మార్పిడి) అవుతున్నారా ఏంటి?`` అనిపిస్తుంది అంటూ ఎగతాళి చేశారు. మస్క్ చేసిన ఈ రెండు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జెండర్ స్టీరియోటైప్స్ (లింగ వివక్ష), పురుషత్వం, ఆన్‌లైన్ సంస్కృతిపై ఒక పెద్ద యుద్ధానికే తెరలేపాయి. ఒక సామాజిక వర్గాన్ని .. మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు మస్క్‌పై మండిపడుతున్నారు.
టెక్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. మస్క్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక ఒక పెద్ద వ్యాపార వ్యూహం దాగి ఉంది. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌తో ఉన్న పాత శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని.. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్‌లను తక్కువ చేసి చూపించడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తుంటారు. తన సొంత ప్లాట్‌ఫారమ్ అయిన X (ట్విట్టర్) మాత్రమే అత్యంత పారదర్శకమైనదని.. మిగిలిన సోషల్ మీడియా కంపెనీలన్నీ మూసి ఉంచిన తలుపుల వెనుక ఫలితాలను మానిప్యులేట్ చేస్తాయని మస్క్ ఈ సందర్భంగా ఆరోపించారు. తన ప్లాట్‌ఫారమ్‌కు మైలేజ్ పెంచడం కోసమే ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ తరహా టీజింగ్ కామెంట్ వ్యూహాన్ని అమలు చేశారని భావిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పురుషులు - మహిళల యూజర్ బేస్ దాదాపు సమానంగా ఉన్నా.. మస్క్ చేసిన ఈ కామెంట్స్ ఇంటర్నెట్‌ను రెండు వర్గాలుగా విభజించాయి. ఆయన మద్దతుదారులు ఇదంతా కేవలం ఒక హాస్యం లేదా వ్యంగ్యం మాత్రమేనని సమర్థిస్తుండగా... విమర్శకులు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఒక టెక్ బిలియనీర్ ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా తన ట్వీట్లతో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చర్చలను శాసించడంలో ఎలన్ మస్క్ మరోసారి సఫలమయ్యారు.