భక్తులకు టీటీడీ బిగ్ అలర్డ్.. ఇప్పుడు మరో ముప్పు!

అదే సమయంలో అడవి జంతువులు దాడులు జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.;

Update: 2025-07-04 05:13 GMT

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరో కలకలం రేగింది. కలియుగ వైకుంఠంలో భక్తుల రక్షణ పెద్ద సవాల్ గా మారుతోంది. ప్రధానంగా అడవి జంతువుల నుంచి భక్తులను కాపాడుకోవడానికి టీటీడీ శ్రమించాల్సివస్తోంది. రోజురోజుకు తిరుమల క్షేత్రానికి భక్తులు రద్దీ పెరుగుతుండటం, అదే సమయంలో అడవి జంతువులు దాడులు జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు చిరుత పులులు, ఎలుగుబంట్లతోనే సమస్యలను ఎదుర్కొన్న శ్రీవారి భక్తులు ఇప్పుడు మరో ముప్పును ఎదుర్కోవాల్సివస్తోందని అంటున్నారు.

తిరుమల కాలిబాట మార్గాలకు సమీపంలో అడవి జంతువులు సంచారం నానాటికీ పెరిగిపోతోంది. శేషాచలం అడవుల్లో జన సంచారం పెరిగిపోవడం, ఇతరత్రా కారణాలతో చిరుత పులులు, ఎలుగుబంట్ల తిరుమలకు వచ్చేస్తున్నాయి. గతంలో సీఆర్వో కార్యాలయానికి సమీపంలోకి వచ్చేసిన చిరుతలను పట్టుకునేందుకు టీటీడీ తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. ఇక అలిపిరి మెట్ల మార్గంలో ఒకసారి బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం ఇప్పటికీ అందరినీ భయపెడుతూనే ఉంది. దీంతో ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకున్నారు. అదేవిధంగా ఎలుగు బంట్లు కూడా తిరుమలలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు వీటన్నిటికీ మించినట్లు ఏనుగులు నుంచి ముప్పు ఏర్పడుతోంది. గురువారం నాలుగు ఏనుగుల గుంపు తిరుమల నడకమార్గానికి సమీపంలో కనిపించాయి. ఓ ఏనుగు ఘాట్ రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించింది. ఇక ఏనుగులను చూసిన భక్తులు హడలిపోయారు. మొదటి ఘాట్ రోడ్ సమీపంలోనే ఏనుగులు ఉండటంతో అటువైపు వెళ్లడానికి వాహనదారులు సైతం భయపడిపోయారు. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని కేకలు వేయడం, వాహనాల లైట్లతో ఏనుగులపై వెలుతురు పడేటట్లు చేయడంతో అవి భయపడి అడవిలోకి వెళ్లిపోయాయి.

ఈ సమాచారం తెలుసుకున్న టీటీడీ అటవీ విభాగం సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఏనుగులను అడవిలోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఏనుగుల సంచారంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అలర్ట్ జారీ చేసింది. ఎవరూ ఒంటరిగా కొండపైకి రావొద్దని సూచించింది. గుంపులుగా వెళ్లాలని సూచించింది. మరోవైపు ఏనుగుల సంచారంతో అటవీశాఖ ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహణకు చర్యలు తీసుకుంది.

Tags:    

Similar News