జగన్ కు ఈడీ షాక్.. అక్రమాస్తుల కేసులో అనూహ్య నిర్ణయం, రాజకీయం మారుతున్న సంకేతమా?

జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈడీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ నిర్ణయం రాజకీయాల్లో మార్పు,చేర్పులకు సంకేతమా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Update: 2026-10-10 11:26 GMT

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసులను రోజువారిగా విచారించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పదేళ్లుగా విచారణకు నోచుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. జగన్ తోపాటు నిందితులు అంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాలని ఈడీ తన పిటిషన్ లో పేర్కొందని చెబుతున్నారు. సీబీఐ కోర్టులో 9 పిటిషన్లు పదేళ్లుగా పెండింగులో ఉన్నాయని ఈడీ తన పిటిషన్ లో పేర్కొంది. సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకు కదలడం లేదని తెలిపింది. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక ఆరోగ్యానికి హానికరమని ఈడీ పేర్కొంది.

అనూహ్య నిర్ణయం

పదేళ్లుగా విచారణకు నోచుకోని కేసుల విషయంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సాధారణ న్యాయ ప్రక్రియలో భాగంగానే ఈడీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఏమైనా రాజకీయ ప్రోద్బలం ఉందా? అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ అనుచిత లేదా అయాచిత లబ్ధి పొందారని సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ రెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ బెయిలుపై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆయనపై నమోదైన కేసుల విచారణ అటకెక్కిందని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ అనూహ్యంగా పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోర్టుకు వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది.

బీజేపీ ఆలోచన మారిందా?

జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈడీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ నిర్ణయం రాజకీయాల్లో మార్పు,చేర్పులకు సంకేతమా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండటం, కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలు అయిన టీడీపీ, జనసేన అధినేతలు మాజీసీఎం అక్రమాస్తుల కేసుల విషయంలో సీరియస్ గా ఉండటం వల్లే ఈడీ తాజా నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించేవారని, జగన్ రెడ్డితో ఉన్న రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కూడా అప్పట్లో ఆయనపై నమోదైన కేసులను తొక్కిపెట్టిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు రాజకీయం మారడం, జగన్ ఇండి కూటమి వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలొ తాజా నిర్ణయం హీట్ పుట్టిస్తోందని అంటున్నారు.

వరుసగా ఈడీ అటాక్

విపక్షం వైసీపీ లక్ష్యంగా ఇటీవల చోటుచేసుకున్న ఈడీ దాడులు, అరెస్టులే హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏకంగా వైసీపీ అధినేత జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈడీ పిటిషన్ దాఖలు చేయడం రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోందని అంటున్నారు. మద్యం కుంభకోణంతోపాటు మద్యం రవాణాలోనూ కుంభకోణం జరిగిందని, విదేశాలకు నిధులు మళ్లించారని వైసీపీ నేతలు రాజ్ కేసిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ ను ఈడీ అరెస్టు చేసింది. అదే సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను అరెస్టు చేసి జైలుకు పంపింది. అంతేకాకుండా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేనట్లు ఏపీకి చెందిన కేసులపై ఈడీ దూకుడు పెంచడమే అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితిని మరింతగా వేడెక్కించేలా తాజాగా జగన్ రెడ్డి కేసుల విషయంలో ఈడీ హైకోర్టుకు వెళ్లడం చర్చకు తావిస్తోంది.

Tags:    

Similar News