20 సెం.మీ. వాన..107 ఏళ్ల రికార్డు..రెడ్‌ అలర్ట్‌..ముంబై మునిగింది

ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 సమయానికి బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ)లోని చాలా ప్రదేశాల్లో 20 సెంటీమీర‍్లకు పైగా వర్షం కురిసింది.;

Update: 2025-05-26 13:32 GMT

ముందే వచ్చిన వానకు వరద ఎక్కు అన్నట్లు.. నైరుతు రుతుపవనాలు దుమ్మురేపుతున్నాయి..రోళ్లు పగిలే రోహిణి కార్తె ముందే వచ్చిన రుతు పవనాలు ముంబైని ముంచేస్తున్నాయి.. అసలే అరేబియా తీరాన ఉండే ముంబై.. ఆపై తొలకరి.. ఇక చెప్పేదేముంది? మహా నగరం మునిగింది. ఆర్థిక రాజధానిలో కుండపోతగా వాన పడుతోంది. శనివారమే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి, 16 ఏళ్లలో అత్యంత త్వరగా వచ్చాయి. ఇవి క్రమంగా విస్తరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 సమయానికి బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ)లోని చాలా ప్రదేశాల్లో 20 సెంటీమీర‍్లకు పైగా వర్షం కురిసింది.

సాధారణంగా నాలుగైదు సెంటీమీటర్ల వర్షం ఆగకుండా కురిస్తేనే నగరాలు అతలాకుతలం అవుతాయి. ఇక ముంబై మహానగరం గురించి చెప్పేదేముంది? తాజాగా దక్షిణ ముంబై తీవ్ర ప్రభావానికి గురైంది. దీంతో థానే, రాయగడ్‌, రత్నగిరి ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఈ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలకూ అతి భారీ వర్షాల ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం ఉదయం వరకు రెడ్‌ అలర్ట్‌ కొనసాగనుంది.

ముంబైలో ప్రసిద్ధి చెందిన నారిమన్‌పాయింట్‌ స్టేషన్‌ (25.2), బైకుల్లా ఈవార్డ్‌ (21.3), కొలాబా (20.7), డుటకి స్టేషన్‌ (20.2), మెరైన్ లైన్స్‌, చందన్‌వాడీ (18), మెమోన్‌వాడ (18.3), వర్లీ (17.1)లలో భారీ వర్షపాతం నమోదైంది. కొలాబాలో అయితే ఒక్కసారిగా వాన ముంచెత్తింది. ఇక్కడి అబ్జర్వేటరీలో మే నెలలో వర్షపాతం 29.5 సెం.మీ.గా నమోదైంది. 1918లో మే నెలలో అత్యధికంగా 27.94 సెం.మీ. వర్షం కురిసింది. 107 ఏళ‍్ల తర్వాత ఇప్పుడు ఆ రికార్డు బద్ధలైంది.

వాస్తవానికి మహారాష్ట్రలో పది రోజుల ముందుగానే నైరుతి ప్రభావం మొదలైంది. రుతుపవనాలు ఏటా జూన్‌ 5 నుంచి ప్రారంభమవుతాయి. 1990 తర్వాత.. అంటే 35 ఏళ్ల తర్వాత సీజన్‌ కంటే చాలాముందుగా ముంబైలో వర్షాలు పడుతున్నాయి.

దేశంలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించే కేరళలోనూ వర్షాలు కుమ్మేస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది. ఇక ఉత్తరాదిన ఉన్న దేశ రాజధాని ఢిల్లీని కూడా వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వర్షం పడడంతో ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కర్ణాటకలోనూని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Tags:    

Similar News