సముద్రంలో మునిగిన ద్వారకను చూసే అద్భుత ఛాన్స్.. ఎలానంటే?

ఇందులో భాగంగా అరేబియా సముద్రంలో మునిగి ఉన్న ద్వారకను కళ్లారా చూసే వీలుందని చెబుతున్నారు

Update: 2023-12-28 10:30 GMT

ద్వాపర నగరం. శ్రీక్రిష్ణ భగవానుడు నిర్మించిన రాజ్యం. కాలక్రమంలో సముద్రగర్భంలో కలిసిపోయిన ఈ అద్భుత నగరాన్ని మన కళ్లారా చూసే వీలుందా? ఆ దిశగా గుజరాత్ ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అంటే.. అవునని చెబుతున్నారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ నౌకా సంస్థ అయినా మజాగాన్ తో ఇటీవల ఒప్పందం చేసుకుంది.

ఇందులో భాగంగా అరేబియా సముద్రంలో మునిగి ఉన్న ద్వారకను కళ్లారా చూసే వీలుందని చెబుతున్నారు. శతాబ్దాల క్రితం విశ్వకర్మ నిర్మించిన నగరంగా చెప్పే ద్వారక గురించి పురాణాల్లో ప్రముఖంగా చెప్పటం తెలిసిందే.సముద్ర గర్భంలోకి మునిగిపోయిన ఈ చారిత్రక నగరాన్ని కళ్లారా చూసే వీల్లేదు. ఎందుకంటే.. సముద్రంలోని 300 అడుగుల దిగువ ఈ అద్భుత నగరం ఉంది.

ఇక్కడకు పర్యాటకుల్ని తీసుకెళ్లేందుకు వీలుగా జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారు. ద్వారకను చూసే ఆసక్తి ఉన్న పర్యాటకుల్ని తీసుకెళ్లేందుకు వీలుగా గుజరాత్ పర్యాటక అధికారులు టూర్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 24 మంది యాత్రికుల్ని ఈ జలాంతర్గగామిలో తీసుకెళ్లే వీలుందంటున్నారు. పర్యాటకులతో పాటు.. ఇద్దరు పైలెట్లు.. ఇద్దరు డ్రైూవర్లు.. టెక్నీషియన్.. గైడ్ కూడా వారితో ఉంటారు.

భక్తుల్ని అరేబియా సముద్రంలోని 300 అడుగుల లోతుల్లోకి తీసుకెళతారు. అక్కడ నుంచి పురాతన నగర శిథిలాలతోపాటు అరుదైన సముద్ర జీవాల్ని చూసే వీలుందని చెబుతున్నారు. ద్వారకను చూసేందుకు వీలుగా జలాంతర్గామి సౌకర్యాన్నిగుజరాత్ పర్యాటక శాఖ సిద్ధమవుతున్న వైనంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీక్రిష్ణ భగవానుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కారని చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఈ టూర్ ను గుజరాత్ ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News