లోకేశ్ పై ప్రశంసలు.. అందుకే దువ్వాడ సస్పెన్షన్?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత వీరవిధేయుడిగా చాటుకుంటారు. జగన్ కూడా దువ్వాడపై అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు.;

Update: 2025-04-23 17:41 GMT

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ వేటు అనేక రకాల చర్చకు తెరలేపింది. ఎవరూ ఊహించని విధంగా దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేయడం ఉరుములేని పిడుగులా ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని సస్పెన్షన్ ప్రకటనలో పేర్కొన్న.. ఆయనపై అలాంటి ఆరోపణలు లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఫ్యామిలీ వార్ లో దువ్వాడ ప్రవర్తన శ్రుతిమించిపోయిందనే అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. ఈ విషయంలో ఎప్పుడూ పార్టీ నుంచి దువ్వాడను వారించని వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు మరో బలమైన కారణం ఉందని అంటున్నారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత వీరవిధేయుడిగా చాటుకుంటారు. జగన్ కూడా దువ్వాడపై అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. ఈ కారణంగానే దువ్వాడపై స్వయాన ఆయన భార్యే ఫిర్యాదు చేసినా మాజీ సీఎం జగన్ అది వారి కుటుంబ వ్యవహారంగా వదిలేశారంటున్నారు. దీంతో దువ్వాడ తన ప్రేయసితో కలిసి మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం, తమ సంబంధాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడంపై ప్రజల నుంచి యావగింపు ఎదుర్కొన్నారని అంటున్నారు. ఈ ఎఫెక్ట్ పార్టీపైనా ఉంది. ఇదంతా దాదాపు ఏడాదిగా కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది కాలంలో పార్టీకి జరుగుతున్న నష్టంపై ఎప్పుడూ ఆందోళన చెందని వైసీపీ ఇప్పుడు ఆకస్మికంగా వేటు వేయడం ఎందుకన్న చర్చ జరుగుతోంది. దువ్వాడ సస్పెన్షన్ పై వైసీపీ పేజీల్లోనూ రకరకాల చర్చ జరుగుతోంది.

అయితే దువ్వాడ సస్పెన్షన్ వెనుక ఓ పెద్ద రీజన్ ఉందని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన ప్రేయని మాధురితో కలిసి డిజిటల్ మీడియాకు ఎక్కువ ఇంటర్వ్యూలిస్తూ ట్రెండింగులో ఉంటున్న దువ్వాడ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టీడీపీ యువనేత లోకేశ్ ను ప్రశంసించారని అంటున్నారు. ఇదే ఆయనపై వైసీపీ ఆగ్రహానికి అసలు కారణమని టాక్ వినిపిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పవన్ తోపాటు లోకేశ్ సమర్థుడైన నాయకుడంటూ దువ్వాడ జంట కీర్తించారట.. ఇది ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేతకు నచ్చలేదని, ఆ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లడంతోనే ఆయనపై వేటు వేశారని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన దువ్వాడ 2019 ఎన్నికల్లో ప్రస్తుత కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై పోటీ చేసి ఓడిపోయారు. తొలినుంచి కింజరాపు కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ వస్తున్న దువ్వాడ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తూ వరుస ఓటములతో కుదేలయ్యారు. అయితే ఆయన పోరాటాన్ని మెచ్చుకుని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ కి వీర విధేయుడుగా గుర్తింపు కోసం ప్రయత్నించిన దువ్వాడ... తన నోటికొచ్చినట్లు మాట్లాడి అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. సినీ నటుడు పోసాని అరెస్టు తర్వాత దువ్వాడ పేరే ఎక్కువగా వినిపించింది. ఇదే సమయంలో ఆయన డిప్యూటీ సీఎం పవన్, యువనేత లోకేశ్ ను పొగుడుతూ ఇంటర్వ్యూలు ఇవ్వడం వైసీపీలో ఆయన వ్యతిరేకులకు అస్త్రంగా పనికొచ్చిందని అంటున్నారు. ఈ కారణంగానే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అని గుర్తించి వేటు వేశారంటున్నారు.

ఈ కారణం కాకుండా ఆయన సస్పెన్షన్ కు మరే కారణం కనిపించడం లేదని దువ్వాడ సన్నిహితులు చెబుతున్నారు. అంతా అనుకున్నట్లు దువ్వాడ-మాధురి ఎఫైర్ వల్లే వేటు వేయాల్సివస్తే అది ఎప్పుడో జరిగేది అంటున్నారు. ఇప్పుడు వారిద్దరి బంధంపై ఎవరూ ఎక్కడా అభ్యంతరాలు చెప్పడం లేదంటున్నారు. ఆ ఇద్దరూ కలిసిమెలిసి తిరగడమే కాకుండా సంయుక్తంగా వ్యాపారం చేసుకుంటున్నారు. అదే సమయంలో నియోజకవర్గానికి దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోని దువ్వాడపై వేటు వేయడం ఏంటో అంటూ చర్చ జరుగుతోంది. మొత్తానికి దువ్వాడ సస్పెన్షనుకుగల కారణంగా కూడా ఓ మిస్టరీగా మారిందని అంటున్నారు.

Tags:    

Similar News