చలో మూలపేట...వైసీపీ కొత్త డ్రామా

ఉత్తరాంధ్ర వైసీపీకి చెందిన నాయకులు అంతా కలిసి చలో మూలపేట అని ఒక కార్యక్రమం నిర్వహించారు.;

Update: 2026-04-01 11:13 GMT

ఉత్తరాంధ్ర వైసీపీకి చెందిన నాయకులు అంతా కలిసి చలో మూలపేట అని ఒక కార్యక్రమం నిర్వహించారు. అయితే అదంతా ఒక డ్రామా అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ ఈ డ్రామాను రక్తి కట్టించారు అని ఆయన నిందించారు. పోర్టుకు పోదాం రండి అని నిరసన కార్యక్రమానికి పేరు పెట్టిన ధర్మాన బ్రదర్స్ నిజంగా పోటుకు వెళ్ళారా అక్కడ పరిస్థితులు చూశారా అని దువ్వాడ తాజాగా విడుదల చేసిన ఒక వీడియో బైట్ లో నిలదీశారు. పోర్టుకు పోవడానికి నలభై మంది వరకూ వైసీపీ నాయకులకు అధికారులు అనుమతి ఇచ్చినప్పటికి అక్కడికి వెళ్ళకపోవడం లోని ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.

టెంట్ వేసి స్టంట్ :

ఇక మూలపేట పోర్టుకు పది కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసి మీటింగ్ పెట్టి స్టంట్ చేశారు అని ఆయన విమర్శించారు. ఇదంతా అందరినీ మభ్యపెట్టే కార్యక్రమం కాదా అని నిలదీశారు. ఇక వైసీపీ నాయకులు నిర్వహించిన సభలో కూడా పోర్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితుల గురించి కానీ పోర్టుకు వంద కిలోమీటర్ల రహదానికి ఇచ్చి త్యాగాలు చేసిన వారి ఇబ్బందుల గురించి కానీ కనీస మాత్రంగా మాట్లాడకపోవడం దారుణం అన్నారు. ఈ సమావేశంలో ఏమో చెబుతారు అని ఆశించి వచ్చిన జనాలు నిరాశకు గురి అయ్యారని ఆయన అన్నారు.

ఏమి సాధించారు :

ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏమి సాధించారు అని దువ్వాడ ప్రశ్నించారు. పోర్టుకు వెళ్ళకుండా సభ నిర్వహించడం ఒక డ్రామా అని ఆయన అన్నారు. విష్ణు చక్రం మూలపేట ప్రజల కష్టాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు నిరాశ్రయులు అయిపోయారు అని దువ్వాడ అన్నారు. వారి కోసం ఏమైనా వైసీపీ నేతలు మాట్లాడారా అని నిలదీశారు. భూములు ఇచ్చిన త్యాగధనులు అవసరం లేదా అని ఆయన ఆగ్రహం చేశారు. భూ సేకరణ కోసం ఇరవై అయిదు వేల ఎకరాలు తీసుకుంటున్నారని అయితే దానికి భూములు కోల్పోయిన వారికి ఇవ్వకుండా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని దువ్వాడ సంచలన ఆరోపణలు చేశారు.

మోసం చేయాలనుకోవద్దు :

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు మూల పేట నిర్వాసితుల గురించి ఆలోచించకుండా మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటే పోరాటం చేయడానికి తాను సిద్ధం అని దువ్వాడ ప్రకటించారు. అప్పట్లో జిల్లాలో కాకరాపల్లిలో ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో తాను ఏడేళ్ళ పాటు ఉద్యమించాను అని దువ్వాడ చెప్పారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో రద్దు చేయించామని చెప్పారు. సంతబొమ్మాళి, టెక్కలి ప్రజల శక్తిని పరీక్షించవద్దని మోసం చేయవద్దని ధర్మాన ప్రసాదరావుకు ఆయన సూచించారు. మొత్తానికి చూస్తే ఆ మధ్య దాకా ఒకే పార్టీలో ఉన్న దువ్వాడ ధర్మాన బ్రదర్స్ ని వ్యతిరేకిస్తూ వచ్చారు ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. తాను వైసీపీకి దూరం కావడం వెనక ధర్మాన బ్రదర్స్ ఉన్నారని అనేక సందర్భాలలో దువ్వాడ ఆరోపించారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు మీద ఆయన సంచలన ఆరోపణలు చేయడంలో వైసీపీ పోర్టుకు పోదాం రండి నిరసన కూడా డ్రామా అని సెటైర్లు వేయడంతో వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడాల్సి వస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News