ఈ ట్యాంకర్ డ్రైవర్ ను అభినందించాల్సిందే

ఆ వెంటనే తన వాహనాన్ని ఆపి.. దగ్గరకు వెళ్లి చూడగా.. ఒక శిశువు చెయ్యిగా గుర్తించాడు.

Update: 2024-05-05 05:32 GMT

తప్పులు చేయటం ఎందుకు? తాము చేసిన తప్పులకు సంబంధం లేని వారిని బలి చేయటం ఈ మధ్యన అలవాటుగా మారింది. మనసు లేని కొందరు చేసే పనుల గురించి తెలిస్తే మనసు చేదుగా మారుతుంది. తాజాగా అలాంటి ఉదంతమే హనుమకొండ జిల్లా ఊరుగొండ జాతీయ రహదారి పక్కన చోటు చేసుకుంది. రోజువారీ పనుల్లో భాగంగా తన వాటర్ ట్యాంకర్ ను తీసుకొని వెళుతున్న డ్రైవర్ రాందినయకు.. మట్టిలో నుంచి ఒక చిట్టి చెయ్యి కదులుతున్నట్లుగా కనిపించింది. ఆ వెంటనే తన వాహనాన్ని ఆపి.. దగ్గరకు వెళ్లి చూడగా.. ఒక శిశువు చెయ్యిగా గుర్తించాడు.

వెంటనే.. అక్కడి మట్టిని తొలగించి చూడగా.. ఒక అడ శిశువు బొడ్డు తాడుతో ఉండటం చూసి విలవిలలాడిపోయాడు. క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ పని చేస్తున్న ఉపాధి హామీ కూలీల్ని పిలిచి.. శిశువుపై మట్టిని తొలగించారు. ఆ వెంటనే.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

ఈ విషయం గురించి సమాచారం అందుకున్న దామర ఎస్ఐ తన టీంతో కలిసి వచ్చి.. ఆ శిశువును ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆ చిన్నారి అసలుసిసలు మృత్యుంజయరాలిగా అభివర్ణిస్తున్నారు. ఎవరీ దారుణానికి పాల్పడి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మట్టిలో పూడ్చిన పసిగుడ్డును గుర్తించి కాపాడిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ రాందినయను పలువురు అభినందిస్తున్నారు. ఇంత పాపానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News