60 రోజుల్లో రిపోర్టు.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కీలక పరిణామం!
దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురికావటం.. దీనికి సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.;
దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత అనంతబాబు వద్ద కారు డ్రైవర్ గా పని చేసిన సుబ్రహ్మణ్యం హత్యకు గురి కావటం.. అతడి శవాన్ని వారి కారులోనే ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లటం అప్పట్లో పెను సంచలనంగా మారింది.
దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురికావటం.. దీనికి సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తానే హత్య చేసినట్లుగా ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించటం.. అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రిమాండ్ చేయటం తెలిసిందే. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పై విడుదలైన అనంతబాబు రెండేళ్లుగా బయటే తిరుగుతున్నారు.
ఈ హత్య కేసుపై సత్వర విచారణ జరిపి.. నిందితుడికి శిక్ష విధించాలని బాధిత కుటుంబం కోరుతోంది. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకు జరిగిందేమీ లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ కేసుకు సంంధించి అదనపు ఛార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ అయ్యాయి.
మర్డర్ కేసుకు సంబంధించిన విచారణ నివేదికను 60 రోజుల్లో జిల్లా ఎస్సీకి.. డీజీపీకి అందజేయాలని పేర్కొన్నారు. అవసరమైతే సంబంధిత న్యాయస్థానం నుంచి అనుమతి పొందిన తర్వాత దర్యాప్తు చేపట్టి.. అదనపు ఛార్జిషీటును కోర్టులో దాఖలు చేయాలన్నారు. 2022 మే 19 రాత్రి ఈ దారుణ హత్య జరగటం తెలిసిందే. వైసీపీ సర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన ఉదంతాల్లో ఇదొకటిగా పేర్కొంటారు.
కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. బాధిత కుటుంబానికి పరిహారం అందజేశారు. ఈ కేసును మరోసారి విచారించేందుకు వీలుగా ఆదేశాలు జారీ కావటంతో.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుసుకున్నట్లైందన్న మాట బలంగా వినిపిస్తోంది. విచారణ బాధ్యతను ఐపీఎస్ అధికారికి అప్పగించటం కీలక పరిణామంగా చెబుతున్నారు.