92 ఏళ్ల వయసులో 70 వేల కోట్ల ఆస్తి.. ఇదీ ‘రెడ్డి’ గారి ఘనత
డాక్టర్ రెడ్డికి రిటైర్మెంట్ అంటే తెలియదు. 92 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం 5 వరకు పని చేస్తారు.;
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ సంపాదనపై ఆసక్తి తగ్గి, విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు చాలామంది. కానీ 92 ఏళ్ల వయసులోనూ చురుగ్గా పని చేస్తూ, రూ. 70,000 కోట్ల విలువైన ఆరోగ్య సామ్రాజ్యాన్ని నిర్మించిన డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి జీవితం ఇందుకు పూర్తి భిన్నం. సంపాదనపై దృష్టి పెట్టడం కంటే ఇష్టమైన పనికి ఆశయం తోడైనప్పుడు సంపద అదే వస్తుందని ఆయన గట్టిగా నమ్ముతారు.
డాక్టర్ రెడ్డికి రిటైర్మెంట్ అంటే తెలియదు. 92 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం 5 వరకు పని చేస్తారు. ఆదివారం ఒక్కరోజే ఆయనకు విశ్రాంతి. అలుపెరగని ఈ కృషి వెనుక దేశ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే బలమైన ఆశయం ఉంది.
చెన్నైలో జన్మించిన ప్రతాప్ రెడ్డి, స్టాన్లీ కాలేజీలో మెడిసిన్ చదివారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి కార్డియాలజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. విదేశాల్లో వైద్యులకు ఉన్న డిమాండ్ అప్పట్లో చాలా ఎక్కువ. అయితే, తన తండ్రిగారి కోరిక.. డాక్టర్ చదివి మాతృభూమికి సేవ చేయాలనే లేఖ.. ఆయన హృదయాన్ని కదిలించింది. 1970ల్లో అమెరికాలో స్థిరపడే అవకాశాలు ఉన్నా, ఆయన భారత్ తిరిగి వచ్చారు.
ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో, 1979లో కళ్ల ముందే సరైన వైద్య సదుపాయాలు లేక ఒక రోగి చనిపోవడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఆ రోగిని బతికించగలననే నమ్మకం ఉన్నా, అవసరమైన సదుపాయాలు లేకపోవడం ఆయన్ను నిస్సహాయుడిని చేసింది. అప్పుడే ఆయన ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు: భారతదేశంలోనే ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించే ఒక హాస్పిటల్‌ను నిర్మించాలి.
ఆ మహత్తర ఆశయం నుంచే అపోలో హెల్త్‌కేర్ ఆవిర్భవించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపోలోకు 71 హాస్పిటల్స్, 5,000 ఫార్మసీలు, 291 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ కూడా అపోలో నిర్వహిస్తోంది.
నేడు అపోలో గ్రూప్ మార్కెట్ విలువ సుమారు రూ. 70,000 కోట్లు. డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి కుటుంబం ఇందులో 29.3 శాతం వాటాను కలిగి ఉంది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి వ్యక్తిగత నికర ఆస్తుల విలువ రూ. 26,560 కోట్లు. అయితే, ఈ సంఖ్యలు ఆయనకు పూర్తి తృప్తినివ్వడం లేదు. తాను నిర్మించిన అపోలో సామ్రాజ్యం ద్వారా లక్షలాది మంది రోగులకు అందుతున్న ప్రపంచ స్థాయి వైద్య సేవలే తనకు నిజమైన సంతృప్తినిస్తాయని ఆయన చెబుతారు.
92 ఏళ్ల వయసులో కూడా డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి పని పట్ల చూపే నిబద్ధత, దేశానికి సేవ చేయాలనే తపన, ఒక ఆశయంతో మొదలుపెట్టిన ప్రస్థానం ఎంతటి గొప్ప విజయానికి దారితీస్తుందో నిరూపిస్తుంది. డబ్బు కంటే ఆశయం, కృషి ముఖ్యమని ఆయన జీవితం ఒక నిదర్శనం.