ఏపీ ఎన్నార్టీ సీఈవోగా డాక్ట‌ర్ పి. కృష్ణ‌మోహ‌న్ నియామ‌కం

ప్ర‌స్తుతం అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ‌(ఏపీ సీఆర్ డీఏ)లో సామాజిక అభివృద్ధి గ్రూప్‌న‌కు డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న డాక్ట‌ర్ పి. కృష్ణ‌మోహ‌న్‌కు పాల‌నా ప‌రంగా అపార‌మైన అనుభ‌వం ఉంది.;

Update: 2025-08-27 09:16 GMT

ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న నియ‌మించిన ప్ర‌భుత్వం పాల‌నా రంగంలో కృష్ణ‌మోహ‌న్‌కు అపార అనుభ‌వం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్ డీఏ)లో డైరెక్ట‌ర్‌గా సేవ‌లు నిబ‌ద్ధ‌త‌, దూర‌దృష్టికి మెచ్చి.. కీల‌క ప‌ద‌వి ఇచ్చిన సీఎం చంద్ర‌బాబు.

ఒక కృషి-ఒక ప‌ట్టుద‌ల ఉంటే అనేక విజ‌యాలు సాకారం అవుతాయ‌న‌ని నిరూపించిన నిత్య‌కృషీ వ‌లుడు డాక్ట‌ర్ పి. కృష్ణ మోహ‌న్‌. విశాల దృక్ఫ‌థం, నిరంత‌ర సాధ‌న‌, శోధ‌న‌ల‌ను సొంతం చేసుకున్న కృష్ణ‌మోహ‌న్‌ను ఏపీ ప్ర‌భుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు(ఏపీఎన్నార్టీ) సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియ‌మించింది. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశాల‌తో ఈ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌ద‌విలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకురాలు పి. హేమ‌ల‌తా రాణిని తిరిగి ఆమె మాతృశాఖ‌కు పంపించారు. దీంతో డాక్ట‌ర్‌. పి. కృష్ణ‌మోహ‌న్‌కు ఏపీఎన్నార్టీ సీఈవోగా నియ‌మించారు. ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఈ ప‌ద‌విలో ఉండే ఆయ‌న‌కు నెల‌కు రూ.2 ల‌క్ష‌ల వేత‌నంతోపాటు.. ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్నారు.

అపార అనుభ‌వం..

ప్ర‌స్తుతం అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ‌(ఏపీ సీఆర్ డీఏ)లో సామాజిక అభివృద్ధి గ్రూప్‌న‌కు డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న డాక్ట‌ర్ పి. కృష్ణ‌మోహ‌న్‌కు పాల‌నా ప‌రంగా అపార‌మైన అనుభ‌వం ఉంది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రాజెక్టుల కింద సామాజిక భద్రతల పర్యవేక్షణ బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గ‌త 35 ఏళ్లుగా ప్రభుత్వ, విద్యా రంగాలలో ఆయ‌న ఎన‌లేని సేవ‌లు అందించారు. వ్యూహాత్మక ఆలోచనలతో పాటు, అపార‌ నైపుణ్యం ఉన్న వ్యక్తిగా ఆయ‌న‌ గుర్తింపు పొందారు. ముఖ్యంగా, వ్యవస్థాగత అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాల అమలు, స్వయం సహాయక సంఘాల స్థాపన, పేదల జీవనోపాధుల మెరుగుదల కోసం అనేక కార్యక్రమాలను ఆయ‌న‌ నిర్వహించారు.

వివిధ స్థాయిల్లో..

డాక్ట‌ర్ పి. కృష్ణ‌మోహ‌న్‌.. వివిధ స్థాయిలో ఉన్నత ప‌ద‌వులు అలంకరించారు. APCRDA – గ్రూప్ డైరెక్టర్‌(2024–ప్రస్తుతం), IVIS టెక్నాలజీస్ – వైస్ ప్రెసిడెంట్(2019–2022), సీఎం ప్రత్యేక అధికారిగా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ CEOగా(2015–2019), SPA విజయవాడ–రిజిస్ట్రార్ (2012–2015)గా, NIFT హైదరాబాద్ –రిజిస్ట్రార్(2005–2009)గా ప‌నిచేశారు. అదేవిధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, నిజామాబాద్ జిల్లాల్లో DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కూడా సేవ‌లు అందించారు. ఈ క్ర‌మంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. విజ‌య‌వాడ‌లోని `విజయకృష్ణ సూపర్ బజార్`కు ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టి.. ఆర్థికంగా ప‌త‌నావ‌స్థ‌లో ఉన్న కోఆపరేటివ్ సంస్థను తిరిగి లాభాల బాట ప‌ట్టించారు.

మెచ్చిన కృషి!

పువ్వు పుట్ట‌గానే ప‌రిమళించిన‌ట్టు.. డాక్ట‌ర్ పి. కృష్ణ‌మోహ‌న్ ఏ ప‌ద‌విని చేప‌ట్టినా.. దానికి వన్నెతెచ్చారు. 2014-19 మ‌ధ్య అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు అమ‌లు చేసిన కీల‌క ప‌థ‌కం పసుపు కుంకుమ నుంచి చంద్రన్న బీమా, NTR భరోసా వంటి పథకాల అమలులో డాక్ట‌ర్ పి. కృష్ణ‌మోహ‌న్ ఎన‌లేని సేవ‌లు అందించారు. అదేస‌మ‌యంలో గ్రామీణ మహిళల కోసం శిక్షణ, పెట్టుబడి, మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు విశేష కృషి స‌ల్పారు. జల సంరక్షణ కోసం.. న‌డుంబిగించి.. మైక్రో ఇరిగేషన్(సూక్ష్మ సేద్యాన్ని)ను ప్రోత్సాహించారు. అలాగే.. సుస్థిర ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికలు రూపించారు. DFID, ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులకు మార్గదర్శకత్వం వ‌హించారు. డాక్ట‌ర్ పి. కృష్ణ‌మోహ‌న్ కృషిని ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు ప‌రిప‌రివిధాల మెచ్చుకున్నారు.

అధ్య‌య‌న శీలి!

డాక్ట‌ర్ పి. కృష్ణమోహన్ నిరంత‌ర అధ్య‌య‌న శీలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎకానామిక్స్ లో పోస్ట్-డాక్టరల్ ఫెలోషిప్ పూర్తిచేశారు. ఆయన రచించిన పరిశోధనా పత్రాలు జలవనరులు, వ్యవసాయ ఉత్పత్తి, మహిళా శక్తీకరణ, శ్రమ నియోజకత్వం వంటి విభాగాలలో దోహ‌ద‌ప‌డ్డాయి.

వ‌రించిన పురస్కారాలు!

2002 సంవత్సరంలో భారత మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఘనత కృష్ణమోహన్ గారికే దక్కింది.

సేవాదురంధ‌రులు!

డాక్ట‌ర్ పి. కృష్ణమోహన్ సేవా దురంధ‌రులుగా పేరొందారు. ఆయ‌న జీవితం, సేవ‌, మానవతా దృక్పథం, వ్యూహాత్మక ఆలోచన, కార్యాచరణ వంటివి ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచింది. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, మహిళా శక్తీకరణ, వ్యవస్థాత్మక మార్పుల్లో ఆయన పాత్ర ఎన‌లేనిది!.

Tags:    

Similar News