ట్రంప్‌నకు ఖరీదైన ఖతార్ విమానం బహుమతి.. అమెరికా నిఘా వర్గాల్లో కలవరం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ రాజకుటుంబం నుంచి బహుమతిగా రానున్న బోయింగ్ 747 విమానం అమెరికా నిఘా సంస్థలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.;

Update: 2025-05-14 11:32 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ రాజకుటుంబం నుంచి బహుమతిగా రానున్న బోయింగ్ 747 విమానం అమెరికా నిఘా సంస్థలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే బహుమతులపై ఎప్పుడూ అనుమానంతోనే ఉండే అమెరికా రక్షణ, నిఘా వర్గాలకు ఈ ఉచిత విమానం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనిపై చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 89 సీట్లతో ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైన్‌తో అత్యంత విలాసవంతంగా రూపొందించబడిన ఈ విమానం బాహ్యంగా రాజమందిరాన్ని తలపించినా, దాని అంతర్గత భద్రతా అంశాలు నిపుణులను కలవరపెడుతున్నాయి. ఇలాంటి విదేశీ బహుమతుల ద్వారా ప్రత్యర్థులు అమెరికా అధ్యక్షుడిపై, ఆయనతో ప్రయాణించే వారిపై నిఘా పెట్టే, ట్రాకింగ్ చేసే, సమాచార మార్పిడిలోకి చొరబడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"ఒక విదేశీ ప్రభుత్వానికి బహుమతిగా వెళ్లే విమానాన్ని అమెరికా నిర్మిస్తే, దానిలో నిఘా పరికరాలను అమర్చే అవకాశం ఉంది" అని మాజీ సీఐఏ స్టేషన్ చీఫ్ థాడ్ ట్రాయ్ అభిప్రాయపడ్డారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కూల్చివేసినప్పుడు నిఘా పరికరాలను తొలగించడానికి ఒక్కో ఇటుకను విడదీయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.వాస్తవానికి, ట్రంప్ 3.9 బిలియన్ డాలర్లతో రెండు సరికొత్త ప్రెసిడెన్షియల్ విమానాలను కొనుగోలు చేయాలని భావించారు. అయితే, వాటి డెలివరీలో జాప్యం జరగడంతో ఆయన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఖతార్ వద్ద ఉన్న ఈ విమానంపై ఆయన ఆసక్తి చూపారు. అప్పట్లో దీనిని బహుమతిగా ఇవ్వజూపలేదు.

-అత్యంత విలాసవంతంగా రూపుదిద్దుకున్న విమానం:

ట్రంప్‌కు ప్రస్తుతం బహుమతిగా లభించనున్న ఈ విమానాన్ని 2012లో ఖతార్ అప్పటి ప్రధాని, ప్రభుత్వ వెల్త్‌ఫండ్ అధిపతి హమద్ బిన్ జస్సిమ్ బిన్ జబెర్ అల్ థానీ కోసం తయారుచేశారు. క్రీమ్, తెలుపు రంగులతో తీర్చిదిద్దిన ఈ విమానం ఇంటీరియర్‌ను పారిస్‌కు చెందిన ఆల్బర్టో పింటో రూపొందించారు. అత్యంత విలాసవంతమైన తాయ్ పింగ్ రగ్గులు, అలెగ్జాండర్ క్లాడెర్ కళాకృతులు దీని సొంతం. విమానం అప్పర్ డెక్‌లో మాస్టర్ బెడ్‌రూమ్, స్నానాల గది, గెస్ట్ బెడ్‌రూమ్, ప్రైవేట్ లాంజ్, కార్యాలయం, సిబ్బంది గదులు ఉన్నాయి.

ఒకవేళ ఈ విమానం అమెరికా ప్రభుత్వానికి బదిలీ అయినా, దీనిని ఎయిర్ ఫోర్స్ వన్ ప్రమాణాలకు తగ్గట్లుగా మార్చడానికి భారీ స్థాయిలో రెట్రోఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. దాడులు, పేలుళ్లను తట్టుకునేలా ఉపరితలాన్ని బలోపేతం చేయడం, గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం, రహస్య సమాచార వ్యవస్థలు, ఆయుధ వ్యవస్థలను అమర్చడం వంటి మార్పులు చేయాల్సి ఉంటుంది.ఈ విమానంలో ఎటువంటి నిఘా లేదా ట్రాకింగ్ పరికరాలు లేవని నిర్ధారించుకోవడానికి రక్షణ శాఖ అధికారులు ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి నెలల సమయం పట్టవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ తయారీ కన్నా ఈ తనిఖీ ప్రక్రియకే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని మాజీ సీఐఏ అధికారి ట్రాయ్ తెలిపారు.

-"నేను ఎవరి మాటా వినను అంటున్న ట్రంప్ సమర్థన

ఈ బహుమతిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. "దేశం కోసం బహుమతులు స్వీకరించవద్దు అని చాలా మంది చెబుతున్నారు. నేను ఎందుకు స్వీకరించకూడదు? మేము అందరికీ ఇస్తున్నాం, అలానే తీసుకుంటాం. గల్ఫ్ పాలకుల వద్ద మనకంటే పెద్ద విమానాలు ఉన్నాయి. అసలు అమెరికా వద్దే అందరికంటే మంచి విమానం ఉండాల్సింది" అని సౌదీ పర్యటనకు ముందు ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ వ్యతిరేకులు దీనిని అమెరికాపై తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి గల్ఫ్ దేశాలు ఇస్తున్న లంచంగా అభివర్ణిస్తున్నారు. దీంతో ట్రంప్ తన వాదనను కొంత మార్చుకున్నారు. కొత్త బోయింగ్ విమానాలు వచ్చేవరకు ఈ విమానాన్ని తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగిస్తామని, నూతన విమానాల డెలివరీ ఆలస్యమవుతోందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఖతార్ అమెరికాకు దీర్ఘకాల మిత్ర దేశం. గల్ఫ్‌లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అక్కడే ఉంది. హమాస్-ఇజ్రాయెల్ మధ్య రాజీ కుదర్చడంలో ఈజిప్ట్‌తో కలిసి ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. హమాస్ రాజకీయ కార్యాలయం కూడా ఆ దేశంలోనే ఉంది. ఈ నేపథ్యంలో, బహుమతిగా వచ్చిన విమానంలో నిఘా పరికరాలు ఉండి ఉంటే కీలక సమాచారం కొందరి చేతుల్లోకి వెళ్లి అది వారి సొంత ప్రయోజనాలకు వాడుకోవచ్చని సిడ్నీ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ భద్రతా అధ్యయనాల అధిపతి జేమ్స్ డెర్ డెరియన్ అభిప్రాయపడ్డారు. ఖతార్ సోవియట్ యూనియన్ కానప్పటికీ, దానికి బలమైన నిఘా వ్యవస్థ ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇచ్చిన బహుమతిని తిరస్కరిస్తే అరబ్ దేశాధిపతులు నిరాశ చెందే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

మొత్తంమీద, ట్రంప్‌కు ఖతార్ నుంచి రానున్న ఈ విమాన బహుమతి అమెరికా నిఘా వర్గాలకు సరికొత్త సవాళ్లను విసురుతోంది. దీని భద్రతను నిర్ధారించడం, ఎయిర్ ఫోర్స్ వన్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం ఒక పెద్ద ప్రక్రియ కాగా, దీని స్వీకరణ చుట్టూ అల్లుకున్న నైతిక, చట్టపరమైన ప్రశ్నలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News