అమెరికా సంచలనం : 66 అంతర్జాతీయ సంస్థల నుంచి ఎగ్జిట్

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. భార‌త్, ఫ్రాన్స్ నేతృత్వంలోని సోలార్ అల‌య‌న్స్ నుంచి వైదొల‌గ‌తున్న‌ట్టు వైట్ హౌస్ పేర్కొంది.;

Update: 2026-01-08 09:44 GMT

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. భార‌త్, ఫ్రాన్స్ నేతృత్వంలోని సోలార్ అల‌య‌న్స్ నుంచి వైదొల‌గ‌తున్న‌ట్టు వైట్ హౌస్ పేర్కొంది. మొత్తంగా 66 సంస్థ‌ల‌కు త‌మ మ‌ద్ద‌తు విర‌మించుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఆయా సంస్థ‌ల‌కు అమెరికా నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు, స‌హాయం ఉండ‌దు. దీని వెనుక చాలా వ్యూహం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఇండియా అమెరికా మ‌ధ్య టారిఫ్ వార్ కు సంబంధించిన చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌లే తాను సంతోషంగా లేన‌ని మోదీకి తెలుసంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. భార‌త్ పై త్వ‌ర‌లో మ‌రిన్ని టారిఫ్ లు విధిస్తార‌న్న ప్ర‌చారం ఉంది. దీనంత‌టికీ మూలం ర‌ష్యా నుంచి క్రూడాయిల్ భార‌త్ కొనుగోలు చేయ‌డ‌మే.

ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం నేప‌థ్యంలో ట్రంప్ ఉక్రెయిన్ వైపు నిల‌బ‌డ్డారు. అనేక ఆంక్ష‌ల‌తో ర‌ష్యాను దారికి తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ర‌ష్యా ట్రంప్ దారికి రాలేదు. చైనాతో మ‌రింత స‌న్నిహితంగా మెలుగుతూ ట్రంప్ కు మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హారంగా ర‌ష్యా వైఖ‌రి మారింది. దీంతో ర‌ష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాల మీద ట్రంప్ గురిపెట్టారు. ర‌ష్యాతో ఆయిల్ కొనుగోలు చేయొద్దంటూ హెచ్చ‌రించారు. కానీ భార‌త్ ఖాత‌రు చేయ‌లేదు. ర‌ష్యాతో ఇప్ప‌టికీ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అందుకే భార‌త్ పై టారిఫ్ లు విధించారు. మ‌రోవైపు చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి.

అంత‌ర్జాతీయ సోలార్ అల‌య‌న్స్ ప్ర‌ధాన ఉద్దేశం.. సోలార్ ఎన‌ర్జీ ఉప‌యోగాలను ప్రమోట్ చేయ‌డం, టెక్నాల‌జీని ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకోవ‌డం, స‌హ‌క‌రించుకోవ‌డం, వాతావ‌ర‌ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవ‌డం. భార‌త్, ఫ్రాన్స్ నేతృత్వంలో ఇంట‌ర్నేష‌న‌ల్ సోలార్ అల‌య‌న్స్ న‌డుస్తోంది. ఇందులో అమెరికా కూడా ఉంది. కానీ అల‌య‌న్స్ నుంచి బ‌య‌టికి రావ‌డంపై అమెరికా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సోలార్ అల‌య‌న్స్ లో ఉన్న దేశాల‌కు ఆయా దేశాల‌ ప్ర‌యోజ‌నాలు ముఖ్యంగా ఉన్నాయి, అమెరికా ప్ర‌యోజ‌నాలు కాదంటూ అమెరికా వాదిస్తోంది. అందుకే బ‌య‌టికి వచ్చిన‌ట్టు చెబుతోంది. కానీ ట్రంప్ కు మొద‌టి నుంచి సోలార్ ఎన‌ర్జీ, గ్రీన్ రెన్యూవ‌బుల్ ఎనర్జీల ప‌ట్ల ఆస‌క్తి లేదు. ఫాజిల్ ఫ్యూల్స్ కే మొగ్గు చూపుతున్నారు. అంటే గ్యాస్, ఆయిల్ ఉత్ప‌త్తి పైన‌. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా తాను అధికారంలోకి వ‌స్తే గ్యాస్, ఆయిల్ ఉత్ప‌త్తికి ఎక్కువ ప్రాధాన్యాత ఇస్తానన్న‌ అర్థం వ‌చ్చే విధంగా ట్రంప్ ప్ర‌చారం సాగింది.

ఇటీవ‌ల వెనిజులా అధ్య‌క్షుడు నికోల‌స్ మ‌దురోను అమెరికా నిర్బంధించింది. వెనిజులా ప్ర‌పంచంలోనే ఎక్కువ ఆయిల్ నిల్వ ఉన్న దేశం. గ‌తంలో అమెరికా కంపెనీలు ఇక్క‌డ ఆయిల్ త‌వ్వేవి. కానీ హ్యూగో చావెజ్ అధికారంలోకి వ‌చ్చాక ప‌రిస్థితి మారింది. వెనిజులానే సొంతంగా ఆయిల్ త‌వ్వ‌డం మొద‌లు పెట్టింది. అప్ప‌టి నుంచే అమెరికాతో వెనిజులాకు స‌మ‌స్య‌లు ఉన్నాయి. చావెజ్ మ‌ర‌ణం త‌ర్వాత మ‌దురో అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి వెనిజులాలో మ‌దురో వ్యతిరేక వ‌ర్గాన్ని అమెరికా ప్రోత్స‌హిస్తోంది. ఇటీవ‌ల డ్ర‌గ్స్ వ్యాపారం చేస్తున్నార‌న్న నెపంతో మ‌దురోను అమెరికా నిర్బంధించింది. ఇదంతా వెనుజులాలో ఉన్న ఆయిల్ కోస‌మేన‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా వాద‌న వినిపిస్తోంది.

ఇప్ప‌టికే అమెరికా ఆయిల్ బావుల‌ను త‌మ కంట్రోల్ లో తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ట్రంప్ రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ కంటే ఆయిల్, గ్యాస్ ఉత్ప‌త్తికి ప్రాధాన్య‌త ఇస్తున్న నేప‌థ్యంలో వెనుజులా ఆయిల్ చేజిక్క‌డం, సోలార్ అల‌య‌న్స్ నుంచి బ‌య‌టికి రావ‌డం ఒకేసారి జ‌ర‌గ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Tags:    

Similar News