అమెరికాలో అంత లొల్లి పెట్టుకొని భారత్ పై ఏడుపా ట్రంప్?

అమెరికా రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారిన ప్రతిసారీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి మళ్లీ భారత్‌పైనే పడుతోంది.;

Update: 2025-10-20 07:30 GMT

అమెరికా రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారిన ప్రతిసారీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి మళ్లీ భారత్‌పైనే పడుతోంది. దేశంలో లక్షల మంది "No Kings" నిరసనలతో వీధుల్లోకి వచ్చినప్పటికీ, ట్రంప్ తన విమర్శకులను ఎదుర్కొనే బదులు, వాణిజ్య రీతిలో భారత్‌పై మరోసారి హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

* ట్రంప్ బుద్ధి మారదా? మళ్లీ భారత్‌పైనే విమర్శలు!

ట్రంప్ వ్యాఖ్యలు ఎప్పుడూ గందరగోళమే సృష్టిస్తాయి. గతంలో "భారత్‌ రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోళ్లు ఆపేసింది" అంటూ తప్పుడు ప్రచారం చేయడం, "నా ఫోన్‌తో యుద్ధం ఆగింది" అని చెప్పుకోవడం వంటివి కేవలం రాజకీయ నాటకాలే అని విశ్లేషకులు చెబుతుంటారు.

ఇప్పుడు రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూ, అదే పాత పద్ధతిలో భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం ట్రంప్‌ ధోరణిని స్పష్టం చేస్తోంది. అమెరికాలో అంతర్గత కల్లోలం ఉన్నప్పటికీ, ట్రంప్‌ బుద్ధి మళ్లీ భారత్‌పైనే చూపడం గమనార్హం.

* న్యూఢిల్లీ స్పందన: దౌత్య సమతౌల్యమే ప్రాధాన్యం

ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత్‌ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. అది దౌత్య సమతౌల్యం. విదేశాంగ వర్గాల సమాచారం ప్రకారం, ట్రంప్‌తో ఎలాంటి తాజా చర్చలు జరగలేదు. ఇది భారత్‌ రాజకీయ వివేకానికి చిహ్నం. రష్యా నుంచి ఇంధన దిగుమతుల విషయంలోనూ, భారత్‌ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిర్ణయాలే తీసుకుంటోంది.

* ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం: దేశీయ రాజకీయాలే

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్‌ వ్యాఖ్యలు విదేశాంగ విధానం కంటే ఎక్కువగా దేశీయ రాజకీయాల భాగంగా కనిపిస్తోంది. 'కఠిన నాయకుడు' ఇమేజ్ తెచ్చుకోవాలని.. "అమెరికా ప్రయోజనాలను కాపాడే కఠిన నాయకుడు" అనే ఇమేజ్‌ను తిరిగి సృష్టించుకోవడానికే ఆయన భారత్‌పై గట్టిగా మాట్లాడుతున్నారు. అంతర్గత నిరసనలు, విమర్శల నుంచి అమెరికన్ ప్రజల దృష్టిని మళ్లించడమే ఈ వ్యాఖ్యల అసలు లక్ష్యం. ట్రంప్ తన ఇంటి పోరును పక్కనపెట్టి, భారత్‌పై పడి ఏడవడం కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని తేలిపోతోంది.

* భారత్–అమెరికా వాణిజ్య భవిష్యత్తు

ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులు తక్షణం అమలులోకి రాకపోయినా, ఈ వ్యాఖ్యలు రెండు దేశాల ఆర్థిక సంబంధాలపై కొంత ఒత్తిడి కలిగిస్తాయి. అయితే, భారత్‌ మాత్రం తన 'స్ట్రాటెజిక్ ఆటానమీ' సూత్రాన్ని పాటిస్తూ, స్వతంత్ర దౌత్య మార్గాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉంది.

ట్రంప్‌ శైలి దౌత్యం ఎప్పుడూ ఊహించలేనిదిగా ఉన్నప్పటికీ, న్యూఢిల్లీ మాత్రం శాంతి, సమతౌల్యం, దౌత్య వివేకంతోనే ముందుకు సాగుతోంది. భారత–అమెరికా సంబంధాలు ఇప్పుడు ట్రంప్‌ రాజకీయ ఉవాచలకన్నా, వ్యూహాత్మక తెలివిపై ఆధారపడి ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News