మాతృత్వానికే కళంకం: పసికందును పొయ్యిలో వేసి కాల్చేసిన కసాయి తల్లి!

సహనం.. శాంతం.. ప్రేమ.. వాత్సల్యం.. మనసుకు ఆనందం కలిగించే ఇలాంటి పదాలకు కేంద్ర బింధువు అమ్మ.. తల్లిని మంచిన దైవం లేదు.. కానీ అదే తల్లి సహనం కోల్పోతోంది.;

Update: 2026-02-25 08:24 GMT

సహనం.. శాంతం.. ప్రేమ.. వాత్సల్యం.. మనసుకు ఆనందం కలిగించే ఇలాంటి పదాలకు కేంద్ర బింధువు అమ్మ.. తల్లిని మంచిన దైవం లేదు.. కానీ అదే తల్లి సహనం కోల్పోతోంది. కారణం ఏదైనా కావచ్చు కడుపున పుట్టిన వారి కోసం తప్పించే తల్లి.. కన్న బిడ్డలనే తప్పించేంత కర్కషంగా మారింది. కారణం ఏదైనా కావచ్చు.. తల్లి మార్పునకు కాలం విలవిలలాడుతోంది. మొన్నటికి మొన్న కన్న కూతురిపై ప్రియుడితో లైంగికదాడి చేయించిన తల్లి ఘటన మరువక ముందే రెండు నెలల పసికందు ఏడుస్తున్నాడని మంటల్లో పడేసిన తల్లిని ఇప్పుడు చూడాల్సి రావడం నిజంగా బాధపడే విషయమే.. అమ్మ.. సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమకు నిలువుటద్దం. బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చినా తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుకునే మాతృమూర్తిని చూస్తాం. కానీ, అదే తల్లి కన్నబిడ్డ పాలిట రాక్షసిగా మారింది. కేవలం రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపిన ఘటన మానవత్వానికే తీరని మచ్చగా మిగిలిపోయింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఉదంతం వింటే ఎవరి గుండె అయినా నీరవక తప్పదు.

ఏడుస్తున్నాడని ?

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.., రాత్రంతా ఆ పసిబిడ్డ ఏడుస్తున్నాడట. నిద్రపోనివ్వడం లేదనే చిన్న కారణంతో ఆ తల్లి విచక్షణ కోల్పోయింది. పాలు ఇచ్చి బుజ్జగించాల్సిన చేతులే, ఆ శిశువును మంటల్లోకి నెట్టాయి. ఒక తల్లికి ఉండాల్సిన ఓర్పు, సహనం నశించి, కన్నపేగుపై ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టడం వెనుక ఉన్న మానసిక స్థితిని అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. ఆ పసికందు కేకలు మంటల్లో కలిసిపోయినా, ఆ కసాయి తల్లి మనసు మాత్రం కరగలేదు.

కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న హింస

ఈ ఘటనను కేవలం నేరంగా మాత్రమే చూడద్దు.. సమాజంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచే చిన్నారులకు ముప్పు పొంచి ఉండడం ఆందోళనకరమైన విషయం. గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు వెలుగుచూసినప్పటికీ, పసికందును కట్టెల పొయ్యిలో వేసి కాల్చడం వంటి కిరాతక చర్యలు వినలేదు. ఒత్తిడి, మానసిక అస్థిరత లేదా మరే ఇతర కారణాలైనా సరే, అవి కన్నబిడ్డ ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నాయంటే మనం ఏ దిశగా పయనిస్తున్నామో ఆలోచించుకోవాలి.

చట్టం ముందు నిందితురాలు

దుండిగల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని, ఈ ఘోరానికి పాల్పడడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఏ కారణమైనా ఒక అభం శుభం తెలియని ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. ఈ కిరాతకానికి పాల్పడిన వ్యక్తికి చట్టం అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. అప్పుడే మాతృత్వానికి జరిగిన ఈ అవమానానికి కొంతైనా న్యాయం జరుగుతుంది. పసిబిడ్డ ఏడుపును ఆపలేని ఆ తల్లి, ఆ బిడ్డ ఊపిరిని శాశ్వతంగా ఆపేసింది. ఈ ఘటనపై కేవలం సానుభూతి చూపి వదిలేయకూడదు. ఇటువంటి వికృత మనస్తత్వాలు ఎందుకు పెరుగుతున్నాయో సామాజిక విశ్లేషణ జరగాలి. ఆడబిడ్డలకైనా, మగబిడ్డలకైనా రక్షణ కల్పించాల్సిన తల్లిలే రాక్షసులుగా మారితే, ఇక ఆ బిడ్డలకు దిక్కెవరు? చట్టం తన పని తాను చేసుకుపోవాలి, కానీ సమాజం కూడా తన విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News