60 ఏళ్ల వయసులో కార్యకర్తను పెళ్లాడిన బెంగాల్ బీజేపీ మాజీ చీఫ్

ఆయన పెళ్లాడింది ఎవరినో కాదు.. పార్టీ కార్యకర్త అయిన 51 ఏళ్ల రింకూ మజుందార్ తో.;

Update: 2025-04-19 05:14 GMT

పెళ్లికి వయసుతో పనేముంది? పెళ్లికి సంబంధించిన సమీకరణాలు చాలానే మారిపోయాయి ఇప్పుడు. గతంలో రెండో పెళ్లి అంటే అమ్మో అనుకునేటోళ్లు. అందుకు భిన్నంగా సెకండ్ మ్యారేజ్ అయితేనేం? అన్నట్లుగా పరిస్థితులు మారాయి ఇప్పుడు. అంతే కాదు.. లేటు వయసులో పెళ్లి చేసుకోవటం తప్పేం కాదనటమే కాదు.. ఆ పెళ్లిళ్లకు బోలెడంత సామాజిక మద్దతు లభిస్తోంది ఇప్పుడు. ఇంతకాలం బ్రహ్మచారిగా ఉన్న 60 ఏళ్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. తాజాగా పెళ్లి చేసుకున్నారు.

ఆయన పెళ్లాడింది ఎవరినో కాదు.. పార్టీ కార్యకర్త అయిన 51 ఏళ్ల రింకూ మజుందార్ తో. కొద్దిమంది సన్నిహితుల నడుమ వీరి పెళ్లి వేడుక బెంగాలీ సంప్రదాయ పద్దతిలో శుక్రవారం పూర్తైంది. వీరి పెళ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూలబొకేను పంపారు. మార్నింగ్ వాక్ లో పరిచయమైన కార్యకర్త రింకూను దిలీప్ పెళ్లాడిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంఘ్ పరివార్ కార్యకర్తగా ఉన్న ఆయన.. వయసులో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. తాజాగా చేసుకున్న పెళ్లి గురించి వివరణ ఇస్తూ.. ఇదంతా తన తల్లి కోసం చేసినట్లుగా చెప్పుకున్నారు. దిలీప్ కు ఇది మొదటి పెళ్లి కాగా.. రింకూకు మాత్రం ఇది రెండో పెళ్లి. పెళ్లి అనంతరం మీడియా ముందకు వచ్చిన ఆయన.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సహా పలువురు బీజేపీ నేతలు ఆయన నివాసానికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

తన పెళ్లి సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి మమతాతో సహా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఘోష్. తన వ్యక్తిగత జీవితం రాజకీయ జీవితం మీద ఎలాంటి ప్రభావాన్నిచూపదన్నారు. హనీమూన్ గురించి మీడియా అడగ్గా స్పందించిన ఆయన.. దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతుందని బదులిచ్చారు. 2015లో పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే బెంగాల్ లో వామపక్షాల స్థానాన్ని అధిగమించి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. వచ్చే ఏడాది బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దిలీప్ ఘోష్ కీలకంగా వ్యవహరిస్తారన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయన పెళ్లి వేడుక ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

Tags:    

Similar News