వైఎస్‌ ఫ్యామిలీ రికార్డు బ్రేక్‌ అవుతుందా?

కాగా వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఎవరికి వస్తుందోననే విషయంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Update: 2024-05-11 13:20 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారం మే 11 సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఇక అన్ని పార్టీల నేతల నోళ్లకు, ప్రచార వాహనాలకు తాళం పడింది. ఇక అంతా డబ్బు, మద్యం పంపకాలపైనే దృష్టి సారించారనే టాక్‌ నడుస్తోంది. మే 13న జరిగే పోలింగ్‌ సందర్భంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ కు క్యూ కట్టారు. విమానాశ్రయాలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఆంధ్రాకు వెళ్లేవారితో కిటకిటలాడుతున్నాయి.

కాగా వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఎవరికి వస్తుందోననే విషయంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌ పులివెందుల నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో జగన్‌ కు 90,110 మెజార్టీ వచ్చింది. అలాగే 2014 ఎన్నికల్లోనూ అత్యధిక మెజార్టీ సాధించిన రికార్డు జగన్‌ కే దక్కింది. ఆ ఎన్నికల్లోనూ జగన్‌ పులివెందుల నుంచి పోటీ చేయగా ఆయనకు రాష్ట్రంలోనే అత్యధికంగా 75,243 ఓట్ల మెజార్టీ లభించింది.

Read more!

ఇక 2009 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించారు. ఫులివెందుల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 68,681 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా 2009 నుంచి 2019 వరకు అత్యధిక మెజార్టీలు సాధించిన రికార్డులు వైఎస్‌ కుటుంబీకుల పేర్లనే ఉన్నాయి.

ఇక 1999, 2004 ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన రికార్డు టీడీపీ అధినేత చంద్రబాబుకి దక్కింది. 1999 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా చంద్రబాబు 65,687 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్‌ హవా వీచిన 2004 ఎన్నికలలోనూ చంద్రబాబే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు 59,588 ఓట్ల మెజారిటీ లభించింది. చంద్రబాబు 1989 నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి విజయం సాధించారు. మరోసారి అక్కడ నుంచే ఆయన బరిలో నిలిచారు.

ఈ నేపథ్యంలో అత్యధిక మెజార్టీ పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్‌ కు దక్కుతుందా లేక కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబుకు లభిస్తుందా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరిద్దరితోపాటు పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేనాని పవన్‌ కళ్యాణ్, మంగళగిరి నుంచి పోటీలో ఉన్న నారా లోకేశ్‌ లపైనా అత్యధిక మెజార్టీల బెట్టింగులు సాగుతున్నాయని సమాచారం.

Tags:    

Similar News