సొంతింటి వైపు దేవినేని ఉమా చూపు ?

దేవినేని ఉమా మహేశ్వరరావు టీడీపీలో సీనియర్ నేత. ఆయన 1999 నుంచి ఎన్నికల రాజకీయాల్లో ఉంటూ ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేశారు.;

Update: 2025-06-30 06:00 GMT

దేవినేని ఉమా మహేశ్వరరావు టీడీపీలో సీనియర్ నేత. ఆయన 1999 నుంచి ఎన్నికల రాజకీయాల్లో ఉంటూ ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆయన తొలిసారి 1999లో నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో రెండోసారి గెలిచారు.

అయితే 2009లో నందిగామ ఎస్సీ రిజర్వుడ్ సీటు కావడంతో ఉమా మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. మైలవరం ప్రజలు నాయకులు ఆయనను ఆదరించారు. అలా 2009, 2014లలో మరో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక విభజిత ఏపీలో 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దేవినేని ఉమా సీనియారిటీ సిన్సియారిటీని దృష్టిలో ఉంచుకుని ఆయనకు చంద్రబాబు కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

అలా అయిదేళ్ళ పాటు అత్యంత ముఖ్య పాత్రను చంద్రబాబు ప్రభుత్వంలో పోషించిన ఉమా 2019లో వైసీపీ ప్రభంజనం లో ఓటమి పాలు అయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ ఆయనను ఓడించారు ఇక 2024లో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. దాంతో ఉమాకు పోటీ చేసే చాన్స్ దక్కలేదు.

అయినా ఆయన టీడీపీ అధినాయకత్వం ఇచ్చిన హామీలతో సర్దుకుని పోయారు ఇక చూస్తే మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ పాతుకుపోతున్నారు. ఆయనకు అంగ బలం అర్ధబలం నిండుగా ఉన్నాయి. పైగా ప్రజలతో పార్టీ కార్యకర్తలతో ఆయన మమేకం కావడం ప్లస్ పాయింట్ గా ఉందని అంటున్నారు.

దీంతో 2029 ఎన్నికల్లో ఉమాకు మైలవరం సీటు దక్కడం కష్టమే అన్న భావన ఆయన వర్గీయులలో ఉంది. అయితే ఉమా ఎలాగైనా మైలవరం సీటు కోసం ప్రయత్నం ఎటూ చేస్తారు. అయితే ఎందుకైనా మంచిదని ప్లాన్ బీలో ఆయన ఉన్నారని అంటున్నారు

అదెలా అంటే 2027లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దాంతో 2029 నాటికి రెండు దశాబ్దాలుగా రిజర్వ్డ్ సీటులో ఉన్న నందిగామ ఫ్రీ సీటు అవుతుదని ఉమా భావిస్తున్నారు అని అంటున్నారు. అంటే అది ఓపెన్ కేటగిరీ సీటు అవుతుంది అన్న మాట.

ఆ విధంగా జరిగితే తిరిగి తన సొంత సీటుకే వెళ్ళి ఎంచక్కా పోటీ చేయవచ్చు అన్నది ఉమా ఆలోచనగా చెబుతున్నారు. నందిగామలో దేవినేని ఫ్యామిలీకి గట్టి పట్టుంది. అలా 2029లో మళ్ళీ నందిగామ లో అడుగుపెట్టి ఎమ్మెల్యే అయి తమ ప్రభుత్వం వస్తే మంత్రి కావాలని అలా హుందాగా రాజకీయాల నుంచి పదవీ విరమణ చేయాలని ఉమా లెక్కలు వేసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల టైం ఉంది. అసెంబ్లీ సీట్లు పునర్విభజనకు రెండేళ్ళ వ్యవధి ఉంది. కానీ ఉమా ఆలోచనలు చూస్తే పాదరసం కంటే స్పీడ్ గా ఉన్నాయని అంటున్నారుట.

Tags:    

Similar News