ఈసారి డీలిమిటేషన్ బిల్లు పక్కాగా పాస్ ?
డీ లిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అందరికీ తెలిసిందే.
డీ లిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అందరికీ తెలిసిందే. దాని కోసం ఏప్రిల్ 16న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను పెట్టి మరీ సభ ముందుకు తెచ్చింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు 33 శాతం మహిళా రిజర్వేషన్ ఇటు పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ సీట్లు యాభై శాతం పెంపుతో విపక్షానికి గట్టి షాక్ ఇవ్వాలని చూసింది. అయితే ఇండియా కూటమి ఐక్యంగా ఉండి డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకుండా దెబ్బ తీసింది. దాంతో బీజేపీకి భారీగానే షాక్ తిన్నట్లు అయింది. కానీ మరోసారి డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకుని చూస్తోంది.
పకడ్బంధీగానే :
ఈసారి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుని మరీ డీ లిమిటేషన్ బిల్లుని పార్లమెంట్ ముందుకు ఎన్డీయే ప్రభుత్వం తీసుకుని వస్తోంది. రానున్న వర్షాల కాల సమావేశాలలో ఈ బిల్లుని లోక్ సభలో ప్రవేశపెడతారు అని అంటున్నారు. ఇక ఈ బిల్లుని ఎలాగైనా పాస్ చేయించుకోవాలన్న పట్టుదలతో ఇప్పటికే ఏకాభిప్రాయం కోసం ప్రాంతీయ పార్టీలతో ఎన్ డీయే పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు డీఎంకే టీఎంసీ వంటి పార్టీలను సంప్రదిస్తున్నారని ప్రభుత్వ వర్గాల నుంచే సమాచారం అందుతోంది. అంతే కాదు ఈసారి విశేషం ఏమిటి అంటే పలువురు టీఎంసీ ఎంపీలు డీ లిమిటేషన్ బిల్లుకు సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. ఇక డీఎంకే అయితే కేంద్ర ప్రభుత్వం సవరించిన డ్రాఫ్ట్ బిల్లుని చూసి మద్దతు ఇవ్వాలని అనుకుంటోంది అన్న ప్రచారం కూడా సాగుతోంది.
మారుతున్న సీన్ :
కేంద్రం ఏప్రిల్ 16 నాటికి లోక్ సభలో డీ లిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పటి పరిస్థితి వేరు. ఆనాడు ముందు భాగాన నిలిచి డీఎంకే టీఎంసీ తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఈసారి చూస్తే టీఎంసీ ఎంపీలు అనేక మంది మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి పశ్చిమ బెంగాల్ లో మమత చేతుల నుంచి అధికారం జారిపోవడంతో టీఎంసీ ఎంపీలలో ఒక భారీ చీలిక వచ్చే అవకాశం ఉంది అన్న వార్తలు వినిపించడమే అని అంటున్నారు. అదే విధంగా డీఎంకే కూడా తమిళనాడులో ఓటమి పాలు అయింది. దాంతో పాటు కాంగ్రెస్ తో డీఎంకే తెగదెంపులు చేసుకుంటోంది. ఈ క్రమంలో డీఎంకే కూడా కాస్తా మార్పుచేర్పులు చేస్తే బిల్లుకు మా మద్దతు ఉంటుందని చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
రూట్ మార్చిన స్టాలిన్ :
తమిళనాడులో తమ పొత్తులో ఉంటూ తమ మద్దతుతో అయిదు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఆ తరువాత మాట మాత్రం అయినా చెప్పకుండా టీవీకేకు మద్దతు ప్రకటించడాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోయ్తోంది. దాంతో కాంగ్రెస్ కి కటీఫ్ అంటున్నారు స్టాలిన్. ఈ నెల 8న జరిగే ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే హాజరు కావడం లేదని చెబుతున్నారు. మరో వైపు కమలానికి సానుకూల సంకేతాలు పంపుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం జాతీయ స్థాయిలో పొలిటికల్ సీన్ అంతా మారిపోయింది. దాంతో రాజకీయ సమీకరణలు కూడా పూర్తిగా మారాయని అంటున్నారు
ఎన్డీయే టచ్ లోకి :
అంతే కాదు డీఎంకే ఇపుడు ఎన్డీయేకు టచ్ లోకి వెళ్తోంది అని అంటున్నారు. తమిళనాడులో అధికారం కోల్పోయిన డీఎంకేకు జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ఉంటే కనుక పుంజుకోగలమని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అలాగే బీజేపీకి కూడా డీఎంకే ఎంపీల సహకారం కావాల్సి ఉంది. ఇలా పరస్పర అవసరాలే ఈ రెండు పార్టీలను చేరువ చేస్తున్నాయని అంటున్నారు. అంతే కాదు మారుతున్న పరిణామాల క్రమంలో డీ లిమిటేషన్ బిల్లు మీద డీఎంకే నేతలతో అంతర్గతంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నట్లుగా చెబుతున్నారు.