ఢిల్లీలో ఆత్మాహుతి ఉగ్ర కలకలం.. కొద్దిలో మిస్.. ఏం జరిగిందంటే?

ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచానికి శత్రువు. ఒక మతం, ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మానవత్వ శత్రువు.;

Update: 2025-10-24 11:01 GMT

దేశ రాజధాని దిల్లీపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి యత్నం భగ్నమైంది. పోలీసులు సమయానికి స్పందించి, నిఘా సంస్థల సహకారంతో ఈ దాడిని అడ్డుకోగలిగారు. ఐసిస్‌ సంబంధాలు ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోవడం, వారి వద్ద నుండి ఆయుధాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం కావడం.. ఇవన్నీ మన అంతర్గత భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచానికి శత్రువు. ఒక మతం, ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మానవత్వ శత్రువు. కొంతమంది యువతను మతం, సిద్దాంతం, లేదా తప్పుడు విశ్వాసాల పేరుతో మతిభ్రమపెట్టి దారితప్పించడం ఈ వ్యూహం కొత్తది కాదు. కానీ దాన్ని ఎదుర్కోవడంలో మన సమాజం, ప్రభుత్వం, భద్రతా సంస్థలు మరింత సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

దిల్లీ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే అంశం.. ఆత్మాహుతి దాడికి సన్నాహాలు ఇప్పటికే పూర్తవ్వడం. అంటే, నిఘా సంస్థలు సమయానికి జాగ్రత్త పడకపోతే, అది పెద్ద విషాదానికి దారి తీసేదన్న మాట. ఇటీవలి కాలంలో భారత్‌లో అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లు మళ్లీ చురుకుగా మారుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. సోషల్‌ మీడియా, డార్క్‌ వెబ్‌ వంటి వేదికలను ఉపయోగించి యువతను ఉగ్రవాద దారిలోకి లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భారతదేశం ఉగ్రవాదాన్ని కఠినంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన దేశం. కానీ అదే సమయంలో ప్రజల అప్రమత్తత కూడా అత్యంత ముఖ్యమైనది. అనుమానాస్పద కదలికలు, కొత్త పరిచయాలు, ఆకస్మిక ప్రవర్తన మార్పులు వంటి విషయాలపై సాధారణ పౌరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. భద్రతా వ్యవస్థలు మాత్రమే కాదు.. సమాజమంతా ఈ పోరాటంలో భాగస్వామి కావాలి.

దిల్లీ ఘటన మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక. ఉగ్రవాదం ఎప్పుడైనా తలెత్తవచ్చు, ఎక్కడైనా దాడి జరగవచ్చు. అందుకే అప్రమత్తతే ఆయుధం. నిఘా సంస్థలు, పోలీసులు, ప్రజలు.. ముగ్గురూ ఒకే ఒరలో ఉండే సమయమిది.

భద్రతా సవాళ్లను ఎదుర్కోవాలంటే కేవలం తుపాకులు కాదు, తెలివి, సమన్వయం, అప్రమత్తత కూడా అవసరం. దిల్లీ ఘటన మనకు ఆ పాఠం మళ్లీ నేర్పింది.

Tags:    

Similar News