ఢిల్లీలో మేడ్ ఇన్ చైనా ఆయుధాలు వయా పాక్.. కీలక వివరాలివే!

అవును... దేశంలోకి అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.;

Update: 2025-11-22 15:30 GMT

భారత్ లో మేడ్ ఇన్ చైనా వస్తువులకు ఏమాత్రం కొదవలేదన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిత్యం మేడ్ ఇన్ ఇడియా, మేక్ ఇన్ ఇండియా గురించి చెబుతుండగా.. మరోపక్క పిన్నీసు నుంచి సెల్ ఫోన్ వరకూ చైనా వస్తువులకు భారత్ అతి పెద్ద మార్కెట్ గా మారిన పరిస్థితి! ఈ సమయంలో తాజాగా దేశ రాజధానిలో మేడ్ ఇన్ చైనా ఆయుధాల వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.

అవును... దేశంలోకి అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా, గోగి హిమాన్షు భాయ్ వంటి ప్రసిద్ధ ముఠాలతో సంబంధం ఉన్న గ్యాంగ్ లకు చైనా, టర్కీల తయారీ ఆయుధాలను సరఫరా చేస్తున్న ఓ ప్రధాన అంతర్జాతీయ అక్రమ ఆయుధ రాకెట్ ను ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు వెలడించారు.

పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ.తో సంబంధం ఉన్న ఈ రాకెట్ ద్వారా.. అత్యాధునిక ఆయుధాలను దేశ రాజధాని ప్రాంతంతో పాటు, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని గ్యాంగ్ స్టర్ లకు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో డ్రోన్ ల ద్వారా పాక్ నుంచి భారత్ లోకి ఈ ఆయుధాలు ప్రవేశిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి రోహిణి నుంచి నలుగురిని అరెస్ట్ చేశారు. వీరు పంజాబ్, యూపీ నివాసితులు.

క్రైమ్ సీపీ చెప్పిన వివరాలివే!:

ఈ సందర్భంగా స్పందించిన క్రైమ్ సీపీ సురేందర్ కుమార్... పాకిస్థాన్ నిఘా సంస్థ ఐ.ఎస్.ఐ. నిర్వహిస్తున్న ఆయుధ ముఠాను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ బృందం ఛేదించిందని తెలిపారు. ఈ ఘటనలో మొత్తం నలుగురిని అరెస్ట్ చేశామని.. వారి నుంచి 10 అధునాతన పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

వీటిలో ఐదు పిస్టళ్లు టర్కీలో తయారు చేయబడగా.. మూడు ఆయుధాలు చైనాలో తయారు చేయబడ్డాయని తెలిపారు. ఈ ఘటనలో ఫిలౌర్ కు చెమిద్న మన్ దీప్.. లుథియానాకు చెందిన దల్విందర్.. రోహిణీలోని ఒకరికి ఆయుధాలను అందించడానికి వెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరి విచారన సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించబడ్డాయని అన్నారు.

ఈ క్రమంలో మరో రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన మూడో వ్యక్తి రోహన్ తోపర్ యూపీలోణి బాగ్ పత్ నివాసి కాగా.. నాల్గవ వ్యక్తి అజయ్ అలియాస్ మోను అని క్రైమ్ సీపీ వెల్లడించారు. ఈ నెట్ వర్క్ లో ఇంకా ఎంతమంది ఉన్నారనేదానిపై కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ నెల 19న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎర్రకోట సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 14 మంది మరణించగా సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన గురించి దర్యాప్తు కొనసాగుతోన్న క్రమంలో ఈ రాకెట్ వ్యవహారం బయటపడింది!




Tags:    

Similar News