యువత అంటే వారేనా... కాక్రోచ్ దండు వేరేనా !
ఎక్కడ నుంచి వచ్చిదో తెలియదు కానీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అతి పెద్ద కాక్రోచ్ దండు కనిపించింది.
ఎక్కడ నుంచి వచ్చిదో తెలియదు కానీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అతి పెద్ద కాక్రోచ్ దండు కనిపించింది. ఒక వైపు వర్షం పడుతున్నా యువత లెక్క చేయకుండా ఉక్కు పిడికిలి బిగించి పార్లమెంట్ వైపుగా ర్యాలీకి నడుము కట్టింది. ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. అలాగే ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. అయినా సరే కాక్రోచ్ సైన్యం మాత్రం వెర్రి ఆవేశంతో జాతీయ జెండా చేత బూని పరుగులు తీయడం ద్వారా ప్రకంపనలు సృష్టించింది. అలాగే చాలా మంది చేతిలో అంబేద్కర్ ఫోటో ఉంది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ ఫోటోతో మరికొందరు కదం తొక్కారు. కాక్రోచ్ దండుని కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం విశేషం.
ఇంధనం అదేనా :
దేశం నలుమూలల నుంచి యువత జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే అని అంటున్నారు. అక్కడ ప్రముఖ పార్టీ వేదిక ఏదీ లేదు. ఆకట్టుకునే నేతలు అంతకంటే లేరు. ఖర్చు పెట్టి జనాలను తరలించారు అనుకోవడానికి వచ్చిన వారు అంతా అతి సామాన్యులు, సగటు యువకులు. కానీ వారిలో ఏదో తెలియని ఆవేశం, ఆగ్రహం, అసంతృప్తి. బహుశా అదే వారిని వందల కిలోమీటర్ల దూరం నుంచి ఢిల్లీ దాకా తీసుకుని వచ్చిన ఇంధనం అని అంటున్నారు. యువతలో కనిపిస్తున్న ఈ అసహనం కొంతమందిదేనా లేదా అంతమందిదీనా అన్నదే ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.
యువత అంటే మరి :
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా యువత గురించే ప్రత్యేకంగా మాట్లాడారు. భారత దేశానికి యువ శక్తి గర్వ కారణం అన్నారు. వారు దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు అన్నారు. వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు అని కూడా కొనియాడారు. అంతరిక్షంలో విక్రమ్ రాకెట్‌ను ని పంపిన యువత గురించి మోడీ పొగిడారు. అదే సమయంలో ఢిల్లీ వీధులలో కూడా మొత్తంగా యువత కదం తొక్కుతోంది. మరి ఈ యువత సంగతేంటి అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆందోళనలు చేస్తున్న ఈ యువత వేరేనా అన్నది విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న.
అంతరిక్షంలోనూ నడి వీధుల్లోనూ :
యువత అంటే ఉరకలెత్తే జలపాతం. ఎత్తు పల్లాలు చూసుకోకుండా దూకుడు చేయడం దాని నైజం. అంతరిక్షంలో విక్రమ్ రాకెట్‌ను ప్రయోగించి సక్సెస్ అయింది కూడా యువతే. అంతే కాదు ఢిల్లీ నడి వీధుల్లో గొంతు పెంచి ఆందోళనలు చేస్తోంది యువతే అని అంటున్నారు. యువత ఎక్కడైనా అదే జోరు ఉంటుందని అయితే వారు ఎదుర్కొనే సమస్యలను అడ్రస్ చేయడం బట్టే వారు స్పీడ్ కి కళ్ళెం వేయగలం తప్పించి వారిని అడ్డుకుంటే అయ్యేది కాదని అంటున్నారు. కాక్రోచ్ దండు విషయం తీసుకుంటే ఇంటర్నెట్ ఆపేసినా పోలీసులు పెద్ద ఎత్తున లాఠీ ఛార్జ్ చేసినా బోరున వానలో సైతం పట్టించుకోకుండా పార్లమెంట్ దిశగా పరుగులు తీస్తున్న యువతని చూస్తూంటే యువ శక్తి ఎక్కడైనా ఒక్కటే అని అర్ధం అవుతోంది. అందుకే వారి సమస్యలను సాకల్యంగా విని పరిష్కరించడమే ఉత్తమం అని విపక్షాలతో పాటు మేధావులూ కోరుతున్నారు.